సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా మదింపునకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ధేశించిన 15వ ఆర్థిక సంఘం విధివిధానాల ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పడింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం వాటా పంచారు. ఇందులో నుంచి తెలంగాణకు కేంద్ర పన్నుల వాటా కింద 2.437 శాతం పంచుతున్నారు. ఇప్పుడది 2.133 శాతానికి తగ్గింది. పైగా కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంచాల్సిన వాటా 42 నుంచి 41 శాతానికి తగ్గించారు. ఏడో ఆర్థిక సంఘం నుంచి 14వ ఆర్థిక సంఘం వరకు 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని వాటాలను నిర్ధేశించి కేంద్రం పన్నులను పంచింది. కానీ ఇప్పుడు 2011 జనాభా లెక్కల ఆధారంగా పన్నుల వాటాను నిర్ధేశించారు.
15వ ఆర్థిక సంఘం సిఫారసులు ఏప్రిల్ 1, 2020 నుంచి అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయి నివేదిక సిద్ధం కానందున కేవలం 2020–21కు వర్తించేలా మధ్యంతర నివేదిక ఇచ్చింది. దానిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వీటి ఆధారంగానే తాజాగా 2020–21 ఆర్థిక సంవత్సరానికి పన్నుల వాటాలను నిర్ధేశిస్తూ ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో బడ్జెట్‌లో పొందుపరిచారు. ఒకవేళ 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు పంచాల్సిన వాటాను 41 శాతం నుంచి ఇంకా తగ్గిస్తే అప్పుడు రాష్ట్రం ఇంకా నిధుల లేమిని ఎదుర్కోవలసి వస్తుంది. 2020–21లో కేంద్రం ఇచ్చే పన్నుల వాటా (అంచనాలు) ప్రకారం తెలంగాణకు రూ.16,726.58 కోట్లు రానున్నట్టు బడ్జెట్‌లో అంచనా రూపొందించారు. అయితే గత రెండు మూడేళ్ల కాలంలో బడ్జెట్‌లో పొందుపరిచిన అంచనాల మేరకు నిధులు రాలేదు. పొందుపరిచిన అంచనాల కంటే వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు తక్కువే వచ్చాయి.
ప్రభావం చూపించిన ‘జనాభా’
15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో పన్నుల వాటాలు తేల్చేందుకు జనాభాకు 15 శాతం వెయిటేజీ ఇచ్చారు. దీని ఫలితంగా 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా తగ్గింది.
తెలంగాణకు స్పెషల్ గ్రాంటు సిఫారసు
తెలంగాణ, కర్ణాటక, మిజొరం రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్లు ఇచ్చింది. తెలంగాణకు 2020–21కి రూ. 723 కోట్ల మేర పన్ను వాటా తగ్గుతుందని అంచనా వేసి గ్రాంటును సిఫారసు చేసింది. తెలంగాణకు పట్టణ స్థానిక సంస్థలకు రూ. 889 కోట్లు, గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1847 కోట్లు సిఫారసు చేసింది. 10 లక్షలకు పైబడి జనాభా ఉన్న హైదరాబాద్‌కు రూ.468 కోట్ల గ్రాంట్లు సిఫారసు చేసింది.
గిరిజన వర్సిటీ ఒక్కటే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి 2020–21 కేంద్ర బడ్జెట్ నిరాశనే మిగిల్చింది. కేవలం గిరిజన వర్సిటీ కోసం మాత్రమే రూ. 26.90 కోట్ల మేర నిధులు కేటాయించింది. తెలంగాణలో ఉన్న ఇతర జాతీయ సంస్థలకు సాధారణంగా చేసే కేటాయింపులే మినహా ప్రత్యేక ప్రస్తావనేదీ లేదు. కాగా పదిహేనో ఆర్థిక సంఘం 2020–21 సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటాను గతంలో ఉన్న 2.437 శాతం నుంచి 2.133 శాతానికి తగ్గించడం వల్ల ఆదాయం కోల్పోనుంది. అయితే తెలంగాణకు ప్రత్యేక గ్రాంటు కింద రూ. 723 కోట్లు పదిహేనో ఆర్థిక సంఘం సిఫారసు చేయడం స్వల్ప ఊరట. తెలంగాణలో ఐఐఎం, ఐఐఐటీ తదితర జాతీయస్థాయి విద్యాసంస్థలు స్థాపించాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌కు కేంద్రం నుంచి స్పందన కనిపించలేదు. మరోవైపు ఎయిమ్స్‌కు నిర్ధిష్ట కేటాయింపులు చూపలేదు.
ఏడాది తెలంగాణకు కేంద్ర పన్నుల్లో వాటా
2018–19 రూ. 17,960.01 (వాస్తవిక)
2019–20 రూ. 17,422.17 (సవరించిన అంచనాలు)
2020–21 రూ.16,726.58 కోట్లు (అంచనాలు)
Comments
Please login to add a commentAdd a comment