ప్రాజెక్టులకు నిధుల వరద | Kaleswaram Rs .6,286 crore project | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులకు నిధుల వరద

Published Tue, Mar 15 2016 2:53 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

ప్రాజెక్టులకు నిధుల వరద - Sakshi

ప్రాజెక్టులకు నిధుల వరద

కేటాయించిన నిధుల్లో నాలుగోవంతు జిల్లాలోని ప్రాజెక్టులకే
కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లకు చెరో రూ.100 కోట్లు
వేములవాడ ఆలయ అథారిటీకి రూ.100 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.6,286 కోట్లు
శాతవాహన యూనివర్సిటీకి రూ.21.69 కోట్లు
బడ్జెట్‌లో జిల్లావాటా రూ.15 వేల కోట్లకుపైనే...

 
 తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గతంతో పోలిస్తే ఈసారి జిల్లాకు న్యాయం జరిగింది. ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ సొంత జిల్లాకు సముచిత స్థాయిలో నిధులు కేటాయించారు. ప్రధానంగా గత కొన్నేళ్లుగా నత్తనడకన నడుస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు ఈసారి నిధుల వరద పారించారు. రాష్ర్ట బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రూ.25 వేల కోట్లు కేటాయిస్తే... అందులో ఒక్క మన జిల్లాలోని ప్రాజెక్టులకే నాలుగో వంతు నిధులను కేటాయించడం విశేషం. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్ల అభివృద్ధికి రూ.100 కోట్ల చొప్పున కేటాయించారు.


ఈ నిధులను నిజంగా ఖర్చు చేయగలిగితే త్వరలోనే కరీంనగర్, రామగుండం నగరాల రూపురేఖలే మారనున్నాయి. అట్లాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు వేములవాడ ఆలయ అభివృద్ధి అథారిటీకి ఈ బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. అయితే జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు స్థల సేకరణ, ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు ఊసే లేకపోవడం నిరాశకు గురిచేసింది. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకునేందుకు సిరిసిల్ల టెక్స్‌టైల్ రంగానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని భావించనప్పటికీ బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే లేదు. అట్లాగే గతంతో పోలిస్తే శాతవాహన యూనివర్సిటీకి నిధుల పెంపు పెద్దగా లేకపోవడం గమనార్హం.  -  సాక్షి ప్రతినిధి, కరీంనగర్  
  
కాళేశ్వరం ప్రాజెక్టుకు   రూ.6,286 కోట్లు
తెలంగాణలో లక్షలాది ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం (మేడిగడ్డ) ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధుల వరద పారింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం... తాజాగా బడ్జెట్‌లో రూ.6,286 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టుపై ఇటీవలే సూత్రప్రాయ ఒప్పందానికి వచ్చిన తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాలు నెలాఖరులోగా తుది ఒప్పందం ఖరారు చేసుకోనున్నాయి. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే నెలలోనే శంకుస్థాపన చేసేందుకు సిద్ధమవుతున్నారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టులపై సుధీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. అందులో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించారు.

ఎక్కడెక్కడ టన్నెళ్లు నిర్మించాలి? ఎక్కడ పంపింగ్ చేయాలి? ఎక్కడ గ్రావిటీ ద్వారా నీళ్లివ్వాలి? అనే అంశాలపై రూపొందించిన నివేదికలను కేసీఆర్ పరిశీలించారు. వెంటనే పనులు ప్రారంభించి మూడు నాలుగేళ్లలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌మానేరు ప్రాజెక్టులపైనా సీఎం చర్చించారు.
 
 ఇతర ప్రాజెక్టులకు సైతం...
గతేడాది వరద కాల్వ పనులకు రూ.747 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ బడ్జెట్‌లోనూ రూ.505 కోట్లు కేటాయించింది. మధ్యమానేరు, గౌరవెల్లి, గండివెల్లి ప్రాజెక్టులు వరద కాలువలో భాగంగా ఉన్నందున ఆయా ప్రాజెక్టుల పనులు చకచకా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.జిల్లాలో రెండు లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు తాగునీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో నిర్మిస్తున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులను కొనసాగించేందుకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.350 కోట్లు కేటాయించడం గమనార్హం.

వీటితోపాటు బడ్జెట్లో ఎస్సారెస్పీ మొదటి దశకు రూ.270 కోట్లు, ఎస్సారెస్పీ రెండవ దశకు రూ.70 కోట్లు కేటాయించారు. మొత్తంగా చూస్తే గత ఏడాదితో పోలిస్తే ఈసారి సాగునీటి ప్రాజెక్టులకు అత్యధికంగా నిధులు కేటాయించడం విశేషం.
 
 కార్పొరేషన్లకు మహర్దశ
జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరాలకు మహర్దశ పట్టనుంది. మౌలిక సదుపాయల కల్పన కోసం ఒక్కో కార్పొరేషన్‌కు రూ.100 కోట్ల చొప్పున ఈ రెండు కార్పొరేషన్లకు రూ.200 కోట్లు కేటాయించడం విశేషం. ప్రస్తుతం నిధుల్లేక అల్లాడుతున్న ఈ రెండు కార్పొరేషన్లకు తాజా కేటాయింపులు పెద్ద ఊరట. ఈ నిధులను ఖర్చు చేయగలిగితే కరీంనగర్, రామగుండం నగరాల రూపురేఖలే మారే అవకాశాలున్నాయి. బడ్జెట్‌లో తాజా కేటాయింపుల పట్ల కరీంనగర్, రామగుండం ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సోమారపు సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. గంగుల నేతృత్వంలో సోమవారం అసెంబ్లీలో సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
 
 రాజాద్రికి రూ.100 కోట్లు..
తెలంగాణలో యాదాద్రి తరువాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన వేములవాడ దేవాలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.100 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం, తాజా బడ్జెట్‌లో మరో రూ.100 కోట్లు కేటాయించడం విశేషం. గతేడాది జూన్ 18న వేములవాడలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్... వేములవాడ అథారిటీకి ఏటా రూ.వంద కోట్ల చొప్పున రాబోయే నాలుగైదేళ్లపాటు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లుగా వేములవాడ ఆలయ అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేయడం, నిధులు కేటాయించడంతోపాటు త్వరలోనే వేములవాడ రూపురేఖలు పూర్తిగా మరనున్నాయి.
 
 మిగిలిన వాటి సంగతేంది?
సంక్షోభంలో ఉన్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని ఆశగా ఎదురుచూసిన నేతన్నలకు ఈ బడ్జెట్‌లో నిరాశే ఎదురైంది. బడ్జెట్ ప్రసంగంలో ఆ ఊసే లేకపోవడంతో నేత కార్మికులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో వివిధ అభివృద్ధి పనులకు గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రూ.21.60 కోట్లను కేటాయించా రు. గత ఏడాది డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన బిజినెస్ స్కూ ల్, ఇతర అభివృద్ధి పనులకు మరో రూ.20 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ తాజా బడ్జెట్‌లోనూ ఆ ప్రస్తావన లేదు.

జిల్లాకేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల, సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు, జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ఊసే లేదు. జిల్లా ప్రధానాసుప్రతిలో నెదర్లాండ్స్‌కు చెందిన రోబో బ్యాంక్ సాయంతో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని బడ్జెట్‌లో పేర్కొన్న ఆర్థిక మంత్రి నిధుల కేటాయింపు అంశాన్ని మాత్రం విస్మరించారు.

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి రూ.430 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపి నా... బడ్జెట్‌లో అసలు ఈ పథకానికి నిధులు కేటాయించలేదు. హడ్కో, ఇతర సంస్థల నుంచి తీసుకునే రుణం ద్వారా ఆయా ఇండ్లను నిర్మిస్తామని, బడ్జెట్‌కు ఇది అదనమని ఆర్థిక మంత్రి తన ప్రసంగ పాఠంలో పేర్కొనడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, కరీంనగర్
 
 జిల్లా వాటా రూ.15 వేల కోట్లపైనే...
 
రాష్ట్రంలో రూ.1,30,415 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమ రంగాలతో కలిపి చూస్తే మన జిల్లావాటా రూ.15 వేల కోట్లకుపైగానే ఉంటుందని రాజకీయ, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇందులో సింహభాగం నిధులు సాగునీటి రంగానికి కేటాయించగా ఆ తరువాత మిషన్ భగీరథ, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, మిషన్ కాకతీయ, వ్యవసాయ, అనుబంధ రంగాలకు నిధులు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, సంక్షేమ పథకాలను మినహాయించి రూ.6,110.27 కోట్ల మేరకు జిల్లా వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు పంపగా... ఇంచుమించు ఆ మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయించినట్లు తెలిసింది.
 
‘‘ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్లతో కరీంనగర్‌ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. విశాలమైన రోడ్లను నిర్మిస్తాం. హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కును తలపిం చేలా పట్టణంలో చక్కని విశాలమైన పార్కును ఏర్పాటు చేస్తాం’’- కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement