బీసీ సంక్షేమానికి అంతంతే | Budget allocation for BCC welfare | Sakshi
Sakshi News home page

బీసీ సంక్షేమానికి అంతంతే

Published Fri, Mar 16 2018 3:03 AM | Last Updated on Fri, Mar 16 2018 3:03 AM

Budget allocation for BCC welfare - Sakshi

వెనుకబడిన తరగతుల(బీసీ) సంక్షేమానికి తాజా బడ్జెట్‌లో కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. అయితే, బడ్జెట్‌లో బీసీల ప్రత్యేకనిధి ఊసేలేదు. బీసీ ఫెడరేషన్‌కు నిరాశ మిగిల్చింది. 2017–18 వార్షిక బడ్జెట్‌లో రూ.5,,070.36 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 2018–19 బడ్జెట్‌లో రూ.5,919.83 కోట్లు కేటాయించింది. వీటిని గురుకులాలు, కల్యాణలక్ష్మి, విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల కోసం ఖర్చు చేయనుంది.

బీసీ సంక్షేమశాఖకు ప్రగతి పద్దు కింద రూ.5,690.04 కోట్లు, నిర్వహణ కింద రూ.229.78 కోట్లు ఇచ్చింది. అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబీసీ) సంక్షేమ కార్పొరేషన్‌కు గతేడాది రూ.వెయ్యి కోట్లు కేటాయించగా ఈసారి కూడా అంతే మొత్తంలో కేటాయించడం గమనార్హం. అయితే, ఎంబీసీల్లోకి ఏయే కులాలు వస్తాయనే అంశంపై ఇంకా స్పష్టతరాలేదు. దీంతో కార్పొరేషన్‌ ద్వారా ఎలాంటి ఆర్థిక చేయూత పథకాలు అమలు కావడంలేదు.

2017–18 వార్షిక బడ్జెట్‌లో రూ.వెయ్యికోట్లలో కేవలం రూ.100 కోట్లు మంజూరు చేయగా అందులో రూ.50 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. తాజా బడ్జెట్‌లో వారికి రూ.1,200 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో చేనేత కార్మికులకు ఆర్థిక చేయూత కార్యక్రమాలు బీసీ సంక్షేమ శాఖ ద్వారా అమలు కానున్నాయి.     – సాక్షి, హైదరాబాద్‌


బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్లకు అరకొరే
తెలంగాణ వెనకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ(బీసీ కార్పొరేషన్‌)కు బడ్జెట్‌ తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. మూడేళ్లుగా కేటాయింపులు పెద్దగా లేక కార్పొ రేషన్‌ కార్యక్రమాలు పడకేశాయి. తాజా బడ్జెట్‌లో  రూ.5 కోట్లే కేటాయించింది. పెట్టుబడుల కింద రూ.50 కోట్లు కేటాయించింది. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని ఫెడరేషన్లకూ అరకొరగానే నిధులు కేటాయించింది. గతేడాది రజకులు, నాయిబ్రాహ్మణ ఫెడరేషన్లకు రూ.500 కోట్లు కేటాయించినా నిధుల విడుదలలో జాప్యం జరగడంతో 20 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేకపోయాయి.

తాజాగా రజక ఫెడరేషన్‌కు రూ.200 కోట్లు, నాయిబ్రాహ్మణ ఫెడరేషన్‌కు రూ.250 కోట్లు కేటాయించింది. వడ్డెర ఫెడరేషన్‌కు రూ. 5.45 కోట్లు, క్రిష్ణబలిజ, పూసల ఫెడరేషన్‌కు రూ.5 కోట్లు, వాల్మీకి బోయ ఫెడరేషన్‌కు రూ.2.10 కోట్లు, భట్రాజ్‌ ఫెడరేషన్‌కు రూ.2 కోట్లు, మేదర ఫెడరేషన్‌కు రూ.3 కోట్లు, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్‌కు రూ.10 కోట్లు, కుమ్మరి(శాలివాహన) ఫెడరేషన్‌కు రూ.8 కోట్లు, గీతకార్మిక ఫెడరేషన్‌కు రూ.10 కోట్లు చొప్పున కేటాయించింది.

బీసీలకు ప్రత్యేక అభివృద్ధి నిధి లేనట్లే...
వెనుకబడిన తరగతులకు ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు చేస్తారనే ఆశలపై తాజా బడ్జెట్‌ నీళ్లు చల్లింది. బీసీల సమగ్ర అభివృద్ధికి గతేడాది చివర్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మె ల్యేలతో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. సబ్‌కమిటీలోని మెజార్టీ సభ్యులు ప్రత్యేక అభివృద్ధి నిధివైపే మొగ్గు చూపారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకూ ఎస్‌డీఎఫ్‌ ఉండాలని పలువురు సభ్యులు కోరారు. అయితే, తాజా బడ్జెట్‌లో బీసీ ఎస్‌డీఎఫ్‌పై ఎలాంటి స్పష్టత రాలేదు.

మైనార్టీ సంక్షేమానికి 2 వేల కోట్లు
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసింది. బడ్జెట్‌లో రూ.1,999.99 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ.25.57 కోట్లు, ప్రగతి పద్దు కింద 1974.42 కోట్లు కేటాయించింది. 2017–18లో రూ. 1,249.66 కోట్లు ఇవ్వగా ఈసారి అదనంగా రూ.750 కోట్లు కేటాయించడం గమనార్హం. షాదీముబారక్‌ పథకానికి రూ.200 కోట్లు, ‘సీఎం విదేశీ విద్యానిధి’కి రూ.100 కోట్లు, దావత్‌ ఐ ఇఫ్తార్, క్రిస్మస్‌ ఫెస్ట్‌లకు 66 కోట్లు, గురుకులాలు, వసతి గృహాల నిర్వహణకు రూ.735 కోట్లు కేటాయించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement