BCC Welfare Department
-
మట్టికి జైకొట్టి..
ఓల్డు మళ్లా గోల్డు అయింది.. మట్టి పాత్రల వినియోగం జనంలో మళ్లీ పెరిగింది.. దీంతో కుమ్మరి కొలిమిలు కళకళలాడుతున్నాయి.. అటు ప్రభుత్వమూ మట్టిపాత్రల వాడకం, కులవృత్తులకు ప్రోత్సాహాన్నిస్తుండటంతో మార్కెట్లో మట్టి పాత్రలు సందడి చేస్తున్నాయి. మట్టి పాత్రల్లో వండిన ఆహారం..పోషక విలువల గురించి ఈమధ్య అవగాహన పెరిగింది. దీంతో జనం వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకువస్తున్నారు. జిల్లాకు 30 మంది చొప్పున.. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు 30 మంది చొప్పున ఎంపిక చేసి వారికి హైదరాబాద్‌లోని రామానంద తీర్థ చేతి వృత్తుల సంస్థలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 40 వేల మంది కుమ్మరులకు శిక్షణ అందించారు. మెషీన్ ద్వారా మట్టి పాత్రల తయారీపై శిక్షణ పొందినవారు జనం అభిరుచికి తగ్గట్లు వివిధ రకాల పాత్రలను తయారు చేస్తున్నారు. వారికి కావాల్సిన డిజైన్లలో రూపొందించి.. మార్కెటింగ్ చేస్తున్నారు. సురాయిలు, రంజన్లు, కుండలు, గ్లాసులు, వాటర్‌బాటిళ్లు, దీపపు ప్రమిదలు, బిర్యానీ పాత్రల వంటివి వేలాది ఆకృతుల్లో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. వీటి ధర సైజు, నాణ్యతను బట్టి రూ.20 మొదలుకుని రూ.1,000 వరకు ఉంటున్నాయి. దేశీయ సంప్రదాయ పాత్రలు కావడంతో జనం కూడా వీటి వాడకాన్ని ఇష్టపడుతున్నారు. ఈ తరహా శిక్షణ కోసం గతంలో అప్పటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న నేతృత్వంలోని అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించింది. మెషీన్ల ద్వారా మట్టి పాత్రలు తయారు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాయితీ కల్పిస్తున్నాం.. చేతి వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇప్పటికే జిల్లాలలో స్టాల్స్‌తో పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అటు ఉపాధినీ కల్పిస్తున్నాం. పర్యావరణానికి మేలు చేసే మట్టి పాత్రల తయారీలో ప్రభుత్వం తరఫున శిక్షణ పూర్తి చేసిన వారికి రూ.2 లక్షల విలువైన తయారీ, అమ్మకాల యూనిట్‌ను రాయితీతో ఇస్తున్నాం.. అలోక్ కుమార్, బీసీ సహకార ఆర్థిక సంస్థ, కార్యనిర్వాహక డైరెక్టర్ మార్కెటింగ్‌పై దృష్టి సారించాలి వృత్తి శిక్షణ పొందిన వారు ఉపాధి దిశగా ముందుకు సాగడానికి ప్రభుత్వం వాటికి మార్కెటింగ్తోపాటు పట్టణ ప్రాంతాల్లో స్టాల్స్ ఏర్పాటు చేస్తే ఆదాయం కూడా పెరుగుతుంది. కోల్‌కతా, గుజరాత్ నుంచి వచ్చే మట్టి పాత్రల రేటు ఎక్కువగా ఉంటోంది. వాటి తయారీలో కొంత మేరకు రసాయనాలు వాడతారు. వీటి ద్వారా వాటి ఫినిషింగ్‌లో తేడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ తయారు చేసే మట్టి పాత్రలు సహజసిద్ధమైన మట్టితో తయారవుతాయి. నడికుడి జయంత్‌రావు రాష్ట్ర శాలివాహన ఫెడరేషన్ అధ్యక్షుడు -
బీసీ సంక్షేమానికి అంతంతే
వెనుకబడిన తరగతుల(బీసీ) సంక్షేమానికి తాజా బడ్జెట్లో కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. అయితే, బడ్జెట్లో బీసీల ప్రత్యేకనిధి ఊసేలేదు. బీసీ ఫెడరేషన్‌కు నిరాశ మిగిల్చింది. 2017–18 వార్షిక బడ్జెట్లో రూ.5,,070.36 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 2018–19 బడ్జెట్లో రూ.5,919.83 కోట్లు కేటాయించింది. వీటిని గురుకులాలు, కల్యాణలక్ష్మి, విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల కోసం ఖర్చు చేయనుంది. బీసీ సంక్షేమశాఖకు ప్రగతి పద్దు కింద రూ.5,690.04 కోట్లు, నిర్వహణ కింద రూ.229.78 కోట్లు ఇచ్చింది. అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబీసీ) సంక్షేమ కార్పొరేషన్‌కు గతేడాది రూ.వెయ్యి కోట్లు కేటాయించగా ఈసారి కూడా అంతే మొత్తంలో కేటాయించడం గమనార్హం. అయితే, ఎంబీసీల్లోకి ఏయే కులాలు వస్తాయనే అంశంపై ఇంకా స్పష్టతరాలేదు. దీంతో కార్పొరేషన్ ద్వారా ఎలాంటి ఆర్థిక చేయూత పథకాలు అమలు కావడంలేదు. 2017–18 వార్షిక బడ్జెట్లో రూ.వెయ్యికోట్లలో కేవలం రూ.100 కోట్లు మంజూరు చేయగా అందులో రూ.50 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. తాజా బడ్జెట్లో వారికి రూ.1,200 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో చేనేత కార్మికులకు ఆర్థిక చేయూత కార్యక్రమాలు బీసీ సంక్షేమ శాఖ ద్వారా అమలు కానున్నాయి. – సాక్షి, హైదరాబాద్ బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్లకు అరకొరే తెలంగాణ వెనకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ(బీసీ కార్పొరేషన్)కు బడ్జెట్ తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. మూడేళ్లుగా కేటాయింపులు పెద్దగా లేక కార్పొ రేషన్ కార్యక్రమాలు పడకేశాయి. తాజా బడ్జెట్లో రూ.5 కోట్లే కేటాయించింది. పెట్టుబడుల కింద రూ.50 కోట్లు కేటాయించింది. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని ఫెడరేషన్లకూ అరకొరగానే నిధులు కేటాయించింది. గతేడాది రజకులు, నాయిబ్రాహ్మణ ఫెడరేషన్లకు రూ.500 కోట్లు కేటాయించినా నిధుల విడుదలలో జాప్యం జరగడంతో 20 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేకపోయాయి. తాజాగా రజక ఫెడరేషన్‌కు రూ.200 కోట్లు, నాయిబ్రాహ్మణ ఫెడరేషన్‌కు రూ.250 కోట్లు కేటాయించింది. వడ్డెర ఫెడరేషన్‌కు రూ. 5.45 కోట్లు, క్రిష్ణబలిజ, పూసల ఫెడరేషన్‌కు రూ.5 కోట్లు, వాల్మీకి బోయ ఫెడరేషన్‌కు రూ.2.10 కోట్లు, భట్రాజ్ ఫెడరేషన్‌కు రూ.2 కోట్లు, మేదర ఫెడరేషన్‌కు రూ.3 కోట్లు, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్‌కు రూ.10 కోట్లు, కుమ్మరి(శాలివాహన) ఫెడరేషన్‌కు రూ.8 కోట్లు, గీతకార్మిక ఫెడరేషన్‌కు రూ.10 కోట్లు చొప్పున కేటాయించింది. బీసీలకు ప్రత్యేక అభివృద్ధి నిధి లేనట్లే... వెనుకబడిన తరగతులకు ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు చేస్తారనే ఆశలపై తాజా బడ్జెట్ నీళ్లు చల్లింది. బీసీల సమగ్ర అభివృద్ధికి గతేడాది చివర్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మె ల్యేలతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. సబ్‌కమిటీలోని మెజార్టీ సభ్యులు ప్రత్యేక అభివృద్ధి నిధివైపే మొగ్గు చూపారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకూ ఎస్డీఎఫ్ ఉండాలని పలువురు సభ్యులు కోరారు. అయితే, తాజా బడ్జెట్లో బీసీ ఎస్డీఎఫ్పై ఎలాంటి స్పష్టత రాలేదు. మైనార్టీ సంక్షేమానికి 2 వేల కోట్లు మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసింది. బడ్జెట్లో రూ.1,999.99 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ.25.57 కోట్లు, ప్రగతి పద్దు కింద 1974.42 కోట్లు కేటాయించింది. 2017–18లో రూ. 1,249.66 కోట్లు ఇవ్వగా ఈసారి అదనంగా రూ.750 కోట్లు కేటాయించడం గమనార్హం. షాదీముబారక్ పథకానికి రూ.200 కోట్లు, ‘సీఎం విదేశీ విద్యానిధి’కి రూ.100 కోట్లు, దావత్ ఐ ఇఫ్తార్, క్రిస్మస్ ఫెస్ట్‌లకు 66 కోట్లు, గురుకులాలు, వసతి గృహాల నిర్వహణకు రూ.735 కోట్లు కేటాయించింది. -
టీఆర్ఎస్ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యం
ఆదిలాబాద్‌టౌన్: బీసీలకు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అధిక ప్రాధాన్యం లభించిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకులా వాడుకోవడమే గానీ వారి అభివృద్ధికి కృషి చేయలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చట్టసభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ల నియామకంలో కూడా బీసీ రిజర్వేషన్ అమలు చేసినట్లు తెలిపారు. బీసీ కులానికి చెందిన ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొండ బాపూజీ లక్ష్మణ్ పేరిట హార్టికల్చర్ యూనివర్సిటీ, జయంతి ఉత్సవాలను కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. మహాత్మా జ్యోతిబాపూలే అధికారిక కార్యక్రమాలు, 103 రెసిడెన్షియల్ గురుకులాలు, విదేశీ విద్య పేరిట పథకాలను ప్రవేశపెట్టామని అన్నారు. కళ్యాణలక్ష్మీ రూ.51వేల నుంచి రూ.75వేలకు పెంచామని, గీత కార్మికులకు ప్రమాద బీమా రూ.2లక్షల నుంచి రూ.6లక్షలకు పెంచామని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీసీ కులానికి చెందిన వారైన కూడా బీసీల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. చేనేత కార్మికులకు 50 శాతం సబ్సిడీపై పరికరాలు, రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. రూ.4వేల కోట్లతో గొల్ల, కుర్మలకు 84లక్షల గొర్రెలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒంటరి మహిళలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పింఛన్ అమలు చేస్తున్నామన్నారు. బీసీ వసతిగృహాల్లో విద్యార్థులకు మెస్‌చార్జీలు గతం కంటే 70 శాతం పెంచామని, సన్నబియ్యంతో భోజనం, మాంస, శాఖాహారం అందిస్తున్నామని వివరించారు. బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. బీసీలకు ఆత్మగౌరవం కల్పించింది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష, నాయకులు పాల్గొన్నారు.