ఆదిలాబాద్‌టౌన్: బీసీలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే అధిక ప్రాధాన్యం లభించిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకులా వాడుకోవడమే గానీ వారి అభివృద్ధికి కృషి చేయలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చట్టసభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు తెలిపారు.
మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌ల నియామకంలో కూడా బీసీ రిజర్వేషన్ అమలు చేసినట్లు తెలిపారు. బీసీ కులానికి చెందిన ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొండ బాపూజీ లక్ష్మణ్ పేరిట హార్టికల్చర్ యూనివర్సిటీ, జయంతి ఉత్సవాలను కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. మహాత్మా జ్యోతిబాపూలే అధికారిక కార్యక్రమాలు, 103 రెసిడెన్షియల్ గురుకులాలు, విదేశీ విద్య పేరిట పథకాలను ప్రవేశపెట్టామని అన్నారు.
కళ్యాణలక్ష్మీ రూ.51వేల నుంచి రూ.75వేలకు పెంచామని, గీత కార్మికులకు ప్రమాద బీమా రూ.2లక్షల నుంచి రూ.6లక్షలకు పెంచామని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీసీ కులానికి చెందిన వారైన కూడా బీసీల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. చేనేత కార్మికులకు 50 శాతం సబ్సిడీపై పరికరాలు, రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. రూ.4వేల కోట్లతో గొల్ల, కుర్మలకు 84లక్షల గొర్రెలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఒంటరి మహిళలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పింఛన్ అమలు చేస్తున్నామన్నారు. బీసీ వసతిగృహాల్లో విద్యార్థులకు మెస్‌చార్జీలు గతం కంటే 70 శాతం పెంచామని, సన్నబియ్యంతో భోజనం, మాంస, శాఖాహారం అందిస్తున్నామని వివరించారు. బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. బీసీలకు ఆత్మగౌరవం కల్పించింది ఒక్క టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీష, నాయకులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యం
Published Fri, Jun 2 2017 1:21 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM
Advertisement