
అబద్ధాల బడ్జెట్...
బడ్జెట్ వాస్తవదూరంగా, ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టేలా ఉంది. గత బడ్జెట్ కేటాయింపులు 60 శాతం కూడా ఖర్చు చేయలేదు. మైనారిటీలకు కేటాయింపులు పేపర్ మీదే గానీ ఖర్చు చేసింది లేదు. కమీషన్‌లు వచ్చే చోటే ఖర్చు చేశారు గానీ సంక్షేమానికి కాదు. పాతబస్తీకి మెట్రో అంటున్న కేసీఆర్.. బడ్జెట్‌లో నిధులెందుకు కేటాయించలేదు? అబద్ధాలు చెప్పడంలో ఆయనకు పీహెచ్‌డీ ఇవ్వాలి. – షబ్బీర్ అలీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ
దొంగ లెక్కలు నిలదీస్తామని సస్పెన్షన్
తెలంగాణ ప్రజలకు బడ్జెట్ ఆశనిపాతం. ప్రజలను మరింత అగాథంలోకి నెట్టేలా ఉంది. లెక్కల్లో గొప్పలు తప్పా.. ఆదాయం, వ్యయంలో పొంతనే లేదు. 60 ఏళ్లలో ఎవరూ చేయని అప్పులు చేయడంలో కేసీఆర్ ప్రగతి సాధించారు. ప్రభుత్వ దొంగ లెక్కలను సభలో నిలదీస్తామనే సభ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేశారు. నాలుగేళ్లుగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. – భట్టి విక్రమార్క, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్
చెప్పింది బారెడు..జరిగేది జానెడు..
బడ్జెట్ పూర్తిగా మేడి పండులా ఉంది. చెప్పిన మాటను సీఎం నిలబెట్టుకోలేదు. చెప్పింది బారెడు.. జరిగేది జానెడు మాత్రమే. 85,000 ఉద్యోగ ఖాళీలు ఉంటే నాలుగేళ్లలో 25,000 ఉద్యోగాలే భర్తీ చేశారు. హైదరాబాద్‌లో లక్ష గ్రామాల్లో లక్ష ఇళ్లు కడతామన్నారు. ఇళ్లు కట్టి ఓట్లు అడగాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉంది. రైతులకు రుణమాఫీ కాలేదు. ఆర్భాటంగా పథకాలు ప్రకటిస్తున్నారు. – కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే
దూరదృష్టి లేని బడ్జెట్
దీన్ని పూర్తిగా అంకెల గారడీ బడ్జెట్‌గా మేం భావిస్తున్నాం. సంక్షేమం కోసం లక్ష కోట్ల బడ్జెట్‌ను ఖర్చుపెడతామని గొప్పలు చెప్పారు. మూత పడ్డ కంపెనీలను తెరిపించే భరోసాను బడ్జెట్ కల్పించలేకపోయింది. సాగునీటి ప్రాజెక్టుల మీద కేసీఆర్ ప్రభుత్వానిది సవితి ప్రేమ అని తేలిపోయింది. ఓటు బ్యాంకు రాజకీయ బడ్జెట్‌గా కనిపిస్తోంది. మద్దతు ధర నిధిని ఎందుకు కేటాయించలేకపోతున్నారో చెప్పాలి. – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్
ఎన్నికల బడ్జెట్
ఇది ఎన్నికల బడ్జెట్. కోటి ఎకరాలకు సాగునీరం దిస్తామని సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పారు. కానీ ఆ స్థాయిలో కేటాయింపుల్లేవు. బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయించారు. కానీ ప్రాజెక్టుల పూర్తికి రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. – గట్టు శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్ సీపీతెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
బడ్జెట్ దేశానికే దిక్సూచి
బడ్జెట్ దేశానికే దిక్సూచిగా ఉంది. పెట్టుబడి సాయం పథకం, బీమా పథకాలకు రూ.12 వేల కోట్ల మేర కేటాయింపులు చేయడం శుభపరిణామం. సాగునీటి రంగానికి ఏకంగా రూ.25 వేల కోట్లు కేటాయించారు. ఐడీసీ పథకాలకు గతేడాదితో పోలిస్తే ఈసారి రూ.100 కోట్ల మేర అధికంగా నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు దన్యవాదాలు.
– ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి
‘మూడెకరాలకు’ నిధులేవీ?
గత బడ్జెట్‌లో ఖర్చు చేయాల్సిన రూ.10 వేల కోట్లు మిగిలాయి. ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా లేదు. ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్. దళితులకు 3 ఎకరాల భూమి హామీ నెరవేర్చలేదు. అటవీ హక్కు చట్టాన్ని పక్కనబెట్టారు. ఆదివాసులను అడవులకే పంపాలని చూస్తున్నారు. ఉద్యోగాలపై మాట తప్పారు. – సున్నం రాజయ్య, సీపీఎం ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment