సాక్షి, హైదరాబాద్ : పుల్వామ ఉగ్రదాడిలో అశువులు బాసిన 40మంది జవాన్లకు తెలంగాణ అసెంబ్లీ ఘనంగా నివాళులు అర్పించింది. అంతేకాకుండా అమర జవాన్ల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఉగ్రదాడిలో మరణించిన ఒక్కొక్క అమర జవాను కుటుంబానికి రూ.25 లక్షలు అందచేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. శుక్రవారం ఉదయం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ పుల్వామా అమర జవాన్లకు సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...జవాన్లపై ఉగ్రదాడి హేయమైన చర్య అని, ఈ దాడి సైనికుల మీద, వ్యక్తుల మీద జరిగినది కాదని సమస్త దేశంపై జరిగిన దాడిగా అందరూ భావిస్తున్నారన్నారు. ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మృతి చెందటం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉండటమే కాకుండా, తమవంతుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సంతాప తీర్మానానికి ఆమోదం తెలిపిన అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశాలను పది నిమిషాలు వాయిదా వేశారు. అమరులకు నివాళి అనంతరం జీఎస్టీ చట్టానికి తీసుకువచ్చిన సవరణ బిల్లును ప్రతిపాదించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ 2019-20 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మరోవైపు శాసనమండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment