కాంగ్రెస్ ఇక, దూకుడు పెంచాలి. మెతక వైఖరి పనికి రాదు. ఘర్షణ అంతా టీడీపీ, టీఆర్‌ఎస్‌ల మధ్యనే కనిపిస్తోంది.
సీఎల్పీ సమావేశంలో నేతల సూచనలు
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ ఇక, దూకుడు పెంచాలి. మెతక వైఖరి పనికి రాదు. ఘర్షణ అంతా టీడీపీ, టీఆర్‌ఎస్‌ల మధ్యనే కనిపిస్తోంది. ఇలా ఉంటే లాభం లేదు...’అన్న అభిప్రాయాన్నే మెజారిటీ సభ్యులు వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన సీఎల్పీ సమావేశ వివరాలు పార్టీ వర్గాల ద్వారా తెలిశాయి. బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశం చర్చించింది. రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు కూడా హాజరైన ఈ మీటింగ్‌లో ‘ఎంపీల సేవలను ఉపయోగించుకోవడం లేదు. మొన్నటి సీఎల్పీ సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదు..? మమ్ముల్ని విస్మరిస్తున్నారు...’ అని ఎంపీలు వీహెచ్, సుఖేందర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదని, పొరపాటు అయిపోయిందటూ సీఎల్పీనేత జానారెడ్డి, మండలిలో కాంగ్రెస్ పక్షనేత డి.శ్రీనివాస్ వివరణ ఇచ్చుకున్నారు. ఇక ఉభయ సభల్లో వ్యహరించాల్సిన వ్యూహంపై చర్చిస్తూ, ప్రతీ రోజూ ఒక గంట ముందుగానే ఉభయ సభల కాంగ్రెస్ పక్ష నేతలు సమావేశం కావాలని, తాజా అంశాలను చర్చించాలని నిర్ణయించారు. 9వ తేదీన ఎంపీలు తలపెట్టిన సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. ఇదే సమావేశం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాల ఆధ్వర్యంలోనే జరుగుతుందని ప్రకటించారు. శాసన సభలో జానారెడ్డి, మండలిలో డీఎస్ బడ్జెట్‌పై చర్చను ఆరంభించాలని, అవకాశం వస్తే ఎమ్మెల్యే గీతారెడ్డితో కూడా మాట్లాడించాలని నిర్ణయించారు.