అసెంబ్లీలో విపక్షాల ఆందోళన
* నల్ల కండువాలతో వచ్చిన కాంగ్రెస్ నేతలు
* ప్రసంగాన్ని అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు
* సభ నుంచి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ వాకౌట్
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల తొలి రోజునే విపక్షాల నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లింది. రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ సంక్షోభం, ప్రజారోగ్యంపై ప్రభుత్వం పట్టింపు లేనట్లు వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్, టీడీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తిం చారు. మంత్రి ఈటెల బడ్జెట్ ప్రారంభించకముందే కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.
ప్రతిగా ‘ఖబడ్దార్.. ఖబడ్దార్..’ అంటూ అధికార పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. అదే గందరగోళం మధ్య ఈటెల తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సభా మర్యాదలు పాటించండి.. అంటూ స్పీకర్ నచ్చజెప్పటంతో కొద్ది సేపటికే ఇరుపక్షాలు శాంతించటంతో ప్రసంగం కొనసాగింది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నల్లకండువాలతో సభలోకి అడుగుపెట్టారు. సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినహా కాంగ్రెస్ సభ్యులు నల్ల కండువాలు వేసుకున్నారు.
బడ్జెట్ ప్రసంగం కొనసాగినంత సేపు ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, సంపత్‌కుమార్, గీతారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమ సీట్ల వద్ద నిలబడి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఆర్థికమంత్రి వివిధ పథకాలకు కేటాయింపులను ప్రస్తావించినప్పుడల్లా... ‘అది మేం ప్రవేశపెట్టిందే’ అంటూ కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ, విద్యుత్‌కు నిధుల కేటాయింపు అంశాలపై మాట్లాడుతుండగా.. విపక్షాలు నినాదాల హోరు పెంచాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అమరుల కుటుంబాలకు పరిహారం చెల్లించలేదని మధ్య మధ్యలో టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలే ప్రయత్నం చేశారు.
మరో పది నిమిషాల్లో ప్రసంగం ముగుస్తుందనగా.. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అయినా ఈటెల ప్రసంగాన్ని కొనసాగించారు. వాకౌట్‌కు ముందు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విపక్ష నేతలందరి సీట్ల దగ్గరికి వెళ్లి మాట్లాడారు. తమ వెంట రావాలంటూ టీడీపీ సభ్యులు కోరినప్పటికీ సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు సభలోనే ఉన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్, త్వరలో ఆ పార్టీలో చేరనున్న చల్లా ధర్మారెడ్డి టీడీపీ గ్యాలరీలో దూరంగా కూర్చున్నారు. వాకౌట్ చేసిన సమయంలో సభలోనే ఉన్నారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత స్పీకర్ మధుసూదనాచారి సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
సభ్యులకు సీఎం అభివాదం
సభకు అందరి కంటే ముందు మంత్రి హరీష్‌రావు వచ్చారు. తర్వాత వరుసగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు. మంత్రి హరీష్‌రావు సభలో కలియ తిరుగుతూ లోపలికి వచ్చిన తమ పార్టీ ఎమ్మెల్యేలతో కరచాలనం చేశారు. సభా ప్రారంభానికి పది నిమిషాల ముందు కాంగ్రెస్, టీడీపీ సభ్యులు వచ్చారు.
అప్పటికే సభలోకి వచ్చిన మంత్రి ఈటెల... విపక్ష సభ్యులకు అభివాదం తెలిపారు. సభ ప్రారంభానికి 5 నిమిషాల ముందు వచ్చిన సీఎం కేసీఆర్.. తన సీటు వద్ద నుంచి అందరికీ అభివాదం చేసి, చివరన ఉన్న ప్రధాన ప్రతిపక్షం గ్యాలరీ వరకు నడుచుకుంటూ వెళ్లారు. చేతులు జోడించి నమస్కారం చేస్తూ తిరిగి తన సీటుకు చేరుకున్నారు. కాంగ్రెస్ వరుసలో మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత జానారెడ్డి ముందు కూర్చోగా.. టీడీపీ గ్యాలరీలో ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి ముందు వరుసలో కూర్చున్నారు.
నిరసనలు.. నినాదాలు!
Published Thu, Nov 6 2014 3:10 AM | Last Updated on Thu, Jul 11 2019 5:33 PM
Advertisement
Advertisement