సాగుకు పట్టం | KCR Budget Happy Agriculture Rangareddy | Sakshi
Sakshi News home page

సాగుకు పట్టం

Published Sat, Feb 23 2019 12:31 PM | Last Updated on Sat, Feb 23 2019 12:31 PM

KCR Budget Happy Agriculture Rangareddy - Sakshi

సాక్షి, వికారాబాద్‌: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాలను సంతృప్తి పరిచే బడ్జెట్‌ను శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. శాసనసభలోగానీ, లోక్‌సభలోగానీ ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టాలి. అయితే ఈ శాఖ తనవద్దే ఉండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి సీఎంలుగా ఉమ్మడి రాష్ట్రంలో కాసు బ్రహ్మానందరెడ్డి, రోశయ్య మాత్రమే బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్‌ మొదటిసారి సీఎం హోదాలో బడ్జెట్‌ వివరాలు చదివి వినిపించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు బహిరంగ వేదికలపై ఇచ్చిన హామీలు, పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను నెరవేర్చే దిశగా బడ్జెట్‌ను రూపొందించారు. తద్వారా వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించేలా అన్ని వర్గాలను ఆకర్శించేందుకు ప్రయత్నించారు.

రైతు రుణమాఫీ... 
 గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాతలు ఎదురుచూస్తున్న రైతురుణ మాఫీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ బడ్జెట్‌లో స్పష్టత నిచ్చారు. ఏతేదీవరకు కటాఫ్‌ డేట్‌గా నిర్ణయించి రుణమాఫీ చేస్తారనే విషయంలో సందేహాలను నివృత్తి చేస్తూ బడ్జెట్‌లో రుణమాఫీ కోసం రూ.6 వేల కోట్లు కేటాయించారు. జిల్లాలో 2,25,215 మంది రైతులుండగా, వీరిలో 1,82,600 మంది పలు బ్యాంకులలో పంట రుణాలు తీసుకున్నారు. వీరికి గాను లక్ష రూపాయలలోపు రుణాన్ని మాఫీ చేయనున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 2018, డిసెంబరు 11వతేదీ ఎన్నికల ఫలితాల నాటికి రైతులు తీసుకున్న లక్షలోపు రుణాన్ని మాఫీ చేస్తామని ప్రకటించారు. దీంతో లోన్‌ కటాఫ్‌ డేట్‌పై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

క్రాప్‌కాలనీలు...  
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నెలకొని ఉన్న వ్యవసాయానుకూల వాతావరణ, పర్యావరణ పరిస్థితులను పరిగణనలోనికి తీసుకొని ఆయా జిల్లాల్లో ఉండే నేల స్వభావాన్ని కూడా అంచనా వేసి దిగుబడులను పెంచడంతో పాటుగా గిట్టుబాటు ధర కల్పించడానికి పంట కాలనీల ఏర్పాటునకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఆయా జిల్లాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా పంటలు పండించే విధానమే ఈ కాలనీల ప్రధాన ఉద్దేశం. దీంతో రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగాబడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.20,107 కోట్లను ప్రతిపాదించారు. వికారాబాద్‌ జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లలో సుమారుగా 213 క్రాప్‌ కాలనీలను ఉద్యాన, వ్యవసాయాధికారులు ప్రతిపాదించారు.

మిషన్‌ కాకతీయ... 
చెరువుల పునరుద్ధరణే ప్రధాన ధ్యేయంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకానికి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. 2019– 20 బడ్జెట్‌లో ఈ పథకానికి నీటిపారుదల శాఖకు రూ.22,500 కోట్లు వెచ్చించారు. జిల్లాలో ఈ పథకం ద్వారా ఇప్పటివరకు నాలుగు విడతల్లో 733 చెరువులను రూ.234.78 కోట్లతో అభివృద్ది చేశారు. వీటి వలన జిల్లాలోని పలు ప్రాంతాల్లో 65,724 ఎకరాలకు సాగునీరు అందుతోంది. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 78 చెరువులు, కుంటల అభివృద్ధికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేయనున్నారు.
 
ఇంటింటికీ మిషన్‌ భగీరథ... 
జిల్లాలోని 971 ఆవాసాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మిషన్‌ భగీరథ పథకానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.1,187 కోట్లను మంజూరు చేసింది. దీంతో జిల్లాలో సుమారుగా 90శాతం పనులు పూర్తయ్యాయి. 80శాతం గ్రామాలకు ఈ నీటినే వినియోగిస్తున్నారు. మిగిలిన పనులను వచ్చేనెలాఖరులోగా పూర్తిచేసి ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా రక్షిత మంచినీటిని అందించాలని ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది.
 
మత్స్యకార కుటుంబాలకు చేయూత... 
గంగపుత్ర, ముదిరాజ్‌  కులాలవారితో పాటుగా బోయ, బెస్త కులస్తులకు చేపలు పట్టడమే ప్రధాన వృత్తి. ఆదాయ వనరు కూడా. ఐఎఫ్‌డీఎస్‌ పథకం కింద జిల్లాలోని మత్స్యకారులకు ఈ సంవత్సరం రూ.8 కోట్ల విలువచేసే 374 బైకులు, 33 ఆటోలు, 1 హైజెనిక్‌ ట్రాన్స్‌పోర్టు వెహికిల్, 17 మొబైల్‌ ఔట్‌లెట్స్‌ 75 శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు అందించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో మత్స్యకారుల అభివృద్ధికి, ఉచిత చేపపిల్లల పంపిణీకి గాను ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించింది.

ఈఎన్‌టీ, దంత పరీక్షలు... 
గత సంవత్సరం ప్రవేశపెట్టిన కంటివెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వైద్య ఆరోగ్యశాఖకు రూ.5,536 కోట్లను ప్రతిపాదించింది. జిల్లాలో ఇప్పటివరకు కంటివెలుగు కింద 3.27లక్షల మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి 52వేల మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. 2,208 మందిని శస్త్రచికిత్సలకు సిఫారసు చేశారు.
 
పంచాయతీలకు నిధుల వరద... 
గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విదిల్చింది. ఒక్కో మనిషికి ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు రూ.1,606 విడుదల అవుతాయి. దీంతో 500 జనాభా కలిగిన ప్రతి గ్రామానికి సుమారుగా రూ.8 లక్షల నిధులు అందనున్నాయి.

నిరుద్యోగ భృతి.. 
గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువతను ముఖ్యంగా నిరుద్యోగులకు ఆకర్శించడంలో భాగంగా ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిలబెట్టుకున్నారు. ప్రతినెలా ఈ భృతి కింద రూ.3,016 ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకం అమలుకు గాను విదివిధానాలను రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించిన ప్రభుత్వం ఇందుకుగాను బడ్జెట్‌లో రూ. 1,810 కోట్ల రూపాయలను ప్రతిపాదించింది. కాగా పథకానికి అర్హత విషయంలో ప్రభుత్వం నియమ నిబంధనలు విడుదల చేస్తేగాని ఎంతమంది అర్హులవుతారో తేలుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

ఆరు కిలోల బియ్యం... 
జిల్లాలో 588 చౌకధరల దుకాణాలున్నాయి. వీటి ద్వారా 2.33 లక్షల కుటుంబాలకు ప్రతినెలా 5,342 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇందుకు అవసరమైన సబ్సిడీ కోసం ఈ బడ్జెట్‌లో రూ.2,744 కోట్లు ప్రతిపాదించారు. ప్రతినెల దాదాపుగా జిల్లాలోని విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టళ్లకు నెలకు 450 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అందజేస్తున్నారు. 

ఎకరాకు రూ.10 వేలు

గత సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథక సహాయాన్ని బడ్జెట్‌లో పెంచారు. ఏటా ఖరీఫ్, రబీలో ఎకరానికి రూ.4వేలు ఉన్న పెట్టుబడి సాయాన్ని సీజన్‌కు రూ.5 వేలకు పెంచారు. దీంతో ప్రతీ రైతుకు ఎకరానికి రూ.10 వేలు అందనున్నాయి. ఇందుకుగాను బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు ప్రతిపాదించారు. ఈ పథకం కింద గతేడాది జిల్లాలోని 2,25,215 మంది రైతులకు రూ.244 కోట్లు అందించారు.   

పెరగనున్న ఆసరా పెన్షన్లు..

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు,బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఇచ్చేనెలసరి పెన్షన్‌ రూ.1000 నుంచి రూ.2016 పెంచారు. దివ్యాంగుల పెన్షన్‌ను రూ.1,500 నుంచి రూ.3,016కు పెంచారు. వృద్ధాప్య కనీస పెన్షన్‌ అర్హత వయసును 65 నుంచి 57సంవత్సరాలకు తగ్గించారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి లబ్ధిదారులకు ఈ మొత్తాన్ని అందజేస్తారు. ఆసరా పెన్షన్లకోసం బడ్జెట్‌లో రూ.12,067 కోట్లకు ప్రతిపాదించారు. జిల్లాలో మొత్తం ఆసరా పెన్షన్లు 1,05,516 ఉన్నాయి. వీటిలో వృద్ధాప్య పింఛన్లు 37,057, వితంతు పెన్షన్లు 49, 521, వికలాంగులు 13,039, కల్లుగీత కార్మికులు 474, వీవర్స్‌ 169, ఒంటరి మహిళలు 4,715,బీడీ కార్మికులు 41 మంది ఉన్నారు. వీరికి ఏప్రిల్‌ 1వతేదీనుంచి పెంచిన పెన్షన్లు అమలు కానున్నాయి.  

కల్యాణలక్ష్మికి మోక్షం..

పేద ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని, కొంతైనా ఆర్థిక సహకారం అందించాలని ప్రవేశపెట్టిన పథకమే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌. ఈ పథకం కింద మొదట్లో రూ.75,116 ఇవ్వగా, ప్రస్తుతం దీనిని రూ.1,00,116 కు పెంచారు. జిల్లాలో ఇప్పటివరకు 3,108 దరఖాస్తులు వచ్చాయి. నిధుల కొరతతో వీటిలో కేవలం 253 మంది లబ్ధిదారులకే మంజూరుచేయడం జరిగింది. దీంతో ఈ పథకం అమలుకు గాను బడ్జెట్‌లో 1,450 కోట్లు ప్రతిపాదించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement