ఆదిలాబాద్‌టౌన్: తెలంగాణ ప్రభుత్వం రైతన్నకు అండగా నిలిచింది. వ్యవ‘సాయానికి’ బడ్జెట్‌లో నిధులు కేటాయించి అన్నదాతకు పెద్దపీట వేసింది. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర శాసన సభకు 2019–20 సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వ్యవసాయం, సాగునీరు, ప్రాజెక్టులు, పింఛన్లు, కల్యాణలక్ష్మి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ప్రగతికి ప్రత్యేక నిధిని కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని వర్గాల వారిని ఆకర్షించేలా పథకాలు ఉన్నాయి. సీఎం నిర్ణయంతో జిల్లా వాసులకు లబ్ధి చేకూరనుంది.
వ్యవసాయ రంగానికి పెద్దపీట..
ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. రైతులకు రుణమాఫీ కోసం రూ.6కోట్లు ప్రకటించింది. జిల్లాలో లక్షా 33 వేల 797 మంది రైతులు ఉన్నారు. ఇందులో దాదాపు 50 వేల మంది రైతులకు రుణమాఫీ వర్తించనుంది. అదే విధంగా రైతుబంధు పథకం ద్వారా గత ఖరీఫ్, రబీ సీజన్‌లలో ఎకరానికి రూ.4 వేలు ఇవ్వగా ఇక నుంచి ఎకరానికి రూ.5 వేల చొప్పున సంవత్సరానికి 10వేలను రైతుల అకౌంట్‌లో జమ చేయనున్నారు. రుణమాఫీ పథకానికి జిల్లాలోని రైతులకు రూ.137.77 కోట్లు నిధులు కేటాయించే అవకాశం ఉంది. రైతు బీమా పథకానికి కూడా ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. జిల్లాలో కోర్టా–చనాఖా బ్యారేజ్ పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు మరిన్ని నిధులు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా బోథ్ నియోజకవర్గంలో కుప్టి ప్రాజెక్టు నిర్మాణ పనులకు నిధులు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
సంక్షేమమే ధ్యేయంగా..
ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్‌లో అధిక నిధులు సంక్షేమానికి కేటాయించారు. ఆసరా పింఛన్లు రూ.1000 నుంచి 2016కు పెంచనున్నారు. దివ్యాంగుల పెన్షన్‌ను రూ.1500 నుంచి రూ.3016కు పెరగనుంది. అదే విధంగా ఎన్నికల ముందు సీఎం ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ వయస్సును 60 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించారు. జిల్లాలో ప్రస్తుతం 68,531 మంది పెన్షన్‌దారులు ఉన్నారు. మూడేళ్ల వయస్సు తగ్గించడంతో దాదాపు మరో 30 వేలకు పైగా లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉంది.
షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలకు నిధులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కులాల ప్రగతి కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. రుణాలను లబ్ధిదారులకు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలకు 16,581 కోట్లు కేటాయించగా మైనార్టీల కోసం రూ.2,004 కోట్లు కేటాయించారు. జిల్లాలో 7లక్షల 10 వేల జనాభా ఉంది. దాదాపు 4 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి అద్దాలు, ఉచిత ఆపరేషన్ల కోసం ప్రభుత్వ నిధులు కేటాయించింది. అదే విధంగా చెవి, ముక్కు, గొంతు, సంబంధిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు, ఊరూరా శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. అదే విధంగా మిషన్ భగీరథ పనులను పూర్తి చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.
నిరుద్యోగులకు భృతి..
జిల్లాలో 57 వేల మంది వరకు నిరుద్యోగులు ఉన్నారు. వీరికి నెలకు రూ.3016 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ప్రభుత్వం విధి విధానాలను రూపకల్పన చేస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతో నిరుద్యోగులకు మేలు జరగనుంది. ఈ పథకం కింద జిల్లాకు దాదాపు రూ.180 కోట్లు నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున జిల్లాలో బీసీ రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. జీపీల అభివృద్ధి కోసం నిధులు కేటాయించారు. 500 జనాభా కలిగిన గ్రామాలకు రూ.8 లక్షల చొప్పున నిధులు కేటాయించనున్నట్లు సీఎం ప్రకటించారు. జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా నీటి సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment