సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరం దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం ఓటాన్ అకౌంట్‌లో ప్రజారవాణాపై మాత్రం ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ఆర్టీసీ, ఎంఎంటీఎస్ వంటి రవాణా సదుపాయాలకు ఏ మేరకు నిధులు కేటాయించనున్నారనే అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే గ్రేటర్ ఆర్టీసీ భారీ నష్టాలతో నడుస్తోంది. ఎంఎంటీఎస్ రెండో దశ కింద రైల్వే లైన్‌ల నిర్మాణంచేపట్టినప్పటికీ నిధుల కొరత కారణంగా కొత్త రైళ్ల కొనుగోళ్లకు అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రప్రభుత్వం నుంచి నిధులు అందితే తప్ప రెండో దశ రైళ్లు పట్టాలెక్కలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ప్రజా రవాణా కోసం నిధుల కేటాయింపుపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో వచ్చే ఏప్రిల్ వరకు ఆగాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు నగరంలో రవాణా సదుపాయాలను మెరుగుపర్చేందుకు, ప్రత్యేకించి పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడం నిరాశే మిగిల్చింది. గ్రేటర్ ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం నుంచి సాయంఅందకపోవడం పట్ల ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాలుతీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.
గ్రేటర్ నష్టాలు రూ.372 కోట్లు
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ రూ.602 కోట్ల నష్టాలను ఎదుర్కొంటుండగా, ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే రూ.372 కోట్ల మేర నష్టాలు ఉన్నాయి. గత భారీగా పెరిగిన ఇంధన ధరలు, నిర్వహణ వ్యయం ఆర్టీసీని కుంగదీస్తున్నాయి. గ్రేటర్‌లో ప్రతిరోజు 3,550 బస్సులు తిరుగుతున్నాయి. రోజుకు రూ.3.5 కోట్ల మేర ఆదాయం లభిస్తున్నప్పటికీ రూ.4.5 కోట్ల మేర రోజువారీ నిర్వహణ వ్యయం కారణంగా రోజుకు రూ.కోటి చొప్పున నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడం, భారీగా నిర్వహణ వ్యయం, విడిభాగాల కొనుగోళ్లు, తదితర కారణాల దృష్ట్యా నష్టాలు అనూహ్యంగా పెరిగాయి.
లైన్‌లు ఉన్నా.. రైళ్లు లేవు..
ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా నగర శివార్లను కలుపుతూ రైల్వేలైన్‌లను ఏర్పాటు చేశారు. చాలా చోట్ల పనులు తుది దశకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పటి వరకు అందకపోవడంతో కొత్త రైళ్ల కొనుగోళ్లకు బ్రేక్ పడింది. సికింద్రాబాద్–బొల్లారం, పటాన్‌చెరు–తెల్లాపూర్ మార్గాల్లో ఇప్పటికిప్పుడు ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు అవకాశం ఉన్నప్పటికీ నిధుల కొరత సమస్యగా మారింది. సుమారు రూ.850 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మూడొంతుల నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందజేయాల్సి ఉంది. రూ.600 కోట్లకు పైగా రాష్ట్రం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.300 కోట్ల వరకు మాత్రమే అందజేసినట్లు అధికారులు తెలిపారు. మరో రూ.300 కోట్ల వరకు రాష్ట్రం నుంచి అందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment