మహానగరంలో ప్రజా భద్రతకు ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖకు భారీగా నిధులు కేటాయించగా, అందులో సింహభాగం నగర పోలీస్ విభాగానికి దక్కుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి హోంశాఖకు రూ.4,540.95 కోట్లు కేటాయించగా, వీటిలో కనీసం రూ.2 వేల కోట్లు సిటీకి అందుతాయని అంచనా వేస్తున్నారు. బంజారాహిల్స్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘పోలీస్ ట్విన్ టవర్స్’ నిర్మాణమూ వేగవంతమవుతుందని పేర్కొంటున్నారు. ఇక హైదరాబాద్ విశ్వనగరం దిశగా అడుగులేస్తున్న నేపథ్యంలో మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తామని పేర్కొంది. ఈ మేరకు మంచినీటి సౌకర్యం, రహదారుల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి, ఔటర్ రింగ్‌రోడ్‌తో రేడియల్ రహదారుల అనుసంధానం, నాలాల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వనుంది. కేశవాపూర్ రిజర్వాయర్‌ను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు కేటాయింపులు చేయనుంది. అయితే శాఖల వారీగా నిధుల కేటాయింపులు మాత్రం చేయలేదు. ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో నిధుల కేటాయింపు జరగలేదని, ఏప్రిల్‌లో ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ఉంటుందని ఆయా విభాగాల అధికారులు పేర్కొంటున్నారు. ఇక అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రేటర్ ఆర్టీసీ, ఉస్మానియా ట్విన్ టవర్స్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం, నిమ్స్‌లో ప్రత్యేక యూరాలజీ, నెఫ్రాలజీ టవర్స్, ఈఎన్‌టీ భవనం తదితర అంశాలను ఈ బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హం.
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రం ప్రభుత్వం ఏటా బడ్జెట్‌లో నగర పోలీసు విభాగానికి పెద్దపీట వేస్తూ వస్తోంది. గత ఏడాది హోంశాఖకు మొత్తం రూ.1389.66 కోట్లు కేటాయించగా.. ఇందులో రూ.574.2 కోట్లు (41.3 శాతం) నగర పోలీసు విభాగానికి దక్కాయి. 2017–18లో రూ.509 కోట్లు కేటాయించగా... ఈసారి కేటాయింపులు గత ఏడాది కంటే రూ.63 కోట్లు పెరిగాయి. ఓటాన్ అకౌంట్‌లో హోంశాఖకు రూ.4540.95 కోట్లు కేటాయించారు. దీని నుంచి కనీసం రూ.2 వేల కోట్లు సిటీకే వస్తాయని అంచనా వేస్తున్నారు. ఫలితంగా ‘ట్విన్ టవర్స్’గా పిలిచే బంజారాహిల్స్ ప్రాంతంలో నిర్మించనున్న అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు (ఐసీసీసీ) పూర్తయి, అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.
‘డేగకళ్ల’ కోసం భారీగానే..
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో విస్తరించి ఉన్న నగరం మొత్తాన్ని సీసీ కెమెరా నిఘాలో ఉంచడానికి ప్రభుత్వం, పోలీసు విభాగం ముమ్మర కసరత్తు చేస్తోంది. స్మార్ట్ అండ్ సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద మూడు కమిషనరేట్లలో అవసరమైన పబ్లిక్ ప్లేసుల్లో కెమెరాలు ఏర్పాటు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో వీటి కనెక్టివిటీ తదితర అవసరాల కోసం ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్‌లో రూ.140 కోట్లు కేటాయించింది. తాజా కేటాయింపులతో ప్రాజెక్టు తుది రూపు దాలుస్తుందని తెలుస్తోంది. ఠాణాల్లో మౌలిక వసతుల కల్పనకు భారీగానే కేటాయింపులు జరిగే అవకాశముంది. సిటిజెన్ సెంట్రిక్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ పథకం కింద ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం గత ఏడాది రూ.10 కోట్లు ఇచ్చింది. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) పేరుతో అత్యాధునిక వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఇది ట్రయల్ దశలో ఉండగా జూన్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు భారీ నిధులు దక్కాయని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు.
తప్పని నిరీక్షణ!
మహానగరంలో మౌలిక వసతుల కల్పనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో నిధుల వరద పారిస్తారనుకున్న సర్కారు విభాగాలు ఏప్రిల్ వరకు నిరీక్షించక తప్పని పరిస్థితి నెలకొంది. గ్రేటర్ పరిధిలో బహుళ వరుసలదారులు, తాగునీటి ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో నిధులు దక్కకపోవడం అసంతృప్తికి గురిచేసింది. గతేడాదితో పోలిస్తే ఆయా విభాగాలకు తాజా బడ్జెట్‌లో నిధుల కేటాయింపులపై స్పష్టత కరువైందని నిపుణులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓట్‌ఆన్ అకౌంట్ మాత్రమేనని ఏప్రిల్ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్‌లో ఆయా విభాగాలకు నిధుల కేటాయింపులు ఎంత మేర ఉంటాయన్న అంశంపై స్పష్టత రానుందని ఆయా విభాగాల ఆర్థిక విభాగం అధికారులు స్పష్టంచేస్తున్నారు. మహానగర దాహార్తిని తీరుస్తోన్న జలమండలి ఈ ఏడాది రూ.4945 కోట్ల మేర ప్రతిపాదనలు ఆర్థికశాఖకు సమర్పించినప్పటికీ..ఏప్రిల్‌లో ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్ వరకు నిధుల కోసం నిరీక్షించక తప్పని పరిస్థితి నెలకొంది. గతేడాది (2017–18) ఆర్థిక సంవత్సరంలో వార్షిక బడ్జెట్‌లో జలమండలికి రూ.1420 కోట్లు కేటాయింపులు జరిపినప్పటికీ ఇందులో గతంలో తీసుకున్న రుణాల చెల్లింపునకు రూ.670 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇతర పథకాలకు మరో రూ.187 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిగాయి. మిగతా రూ.563 కోట్లు వాటర్‌బోర్డు ఖజానాకు చేరకపోవడం గమనార్హం. గ్రేటర్‌కు మణిహారంలా భాసిల్లుతున్న మెట్రో రైలు ప్రాజెక్టుకు గతేడాది వార్షిక బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయింపులు జరిపినప్పటికీ ఇందులో లోన్ల చెల్లింపునకు రూ.200 కోట్లు చెల్లించారు. మిగతా రూ.400 కోట్లు మెట్రోఖజానాకు చేరలేదు. ఏప్రిల్‌లో నిధుల విడుదలపై స్పష్టతరానుందని మెట్రోరైలు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది సైతం మెట్రోకు రూ.600 కోట్లు కేటాయించాలని కోరుతూ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు సమర్పించిన విషయం విదితమే.
నగరంలోని ప్రభుత్వ బోధనాసుపత్రులకు ఆశించినస్థాయిలో కేటాయింపులు జరపకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరడం, ప్రత్యామ్నాయంగా రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఆ భవనాలకు కేటాయింపులు లేకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. నగరానికి నలు వైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కానీ దీనికి అవసరమైన నిధులు కేటాయించలేదు. నిలోఫర్ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రం, నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, కోఠి ఈఎన్‌టీ, గాంధీ, ఫీవర్, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం, ఛాతి ఆస్పత్రి, కంటి ఆస్పత్రి, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల ప్రస్థావన లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెతుత్తతున్నాయి. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే ప్రారంభించిన 40 బస్తీ దవాఖానాలను బలోపేతం చేయనున్నట్లు ప్రకటించింది. పదివేల మందికో బస్తీ దవాఖాన ఏ ర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది.
ఆశ నిరాశల ఊగిసలాట!జీహెచ్‌ఎంసీకి భారీ నిధులు అవసరం
సాక్షి, సిటీబ్యూరో: గత బడ్జెట్‌లో నగరంలో రహదారుల అభివృద్ధికి రూ.566.02 కోట్లు కేటాయించిన రాష్ట్రప్రభుత్వం కొత్త బడ్జెట్‌లోనూ తగినన్ని నిధులు కేటాయించగలదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రహదారుల కోసం ఇచ్చే నిధులు జీహెచ్‌ఎంసీకి కాకుండా హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఆర్‌డీసీఎల్) ద్వారా ఖర్చు చేయనున్నప్పటికీ, నగరంలోని రోడ్లు బాగుపడతాయని నగర ప్రజలు భావిస్తున్నారు. గత సంవత్సరం ఎస్టాబ్లిష్‌మెంట్ పద్దులో భాగంగా వివిధ అంశాలకు సంబంధించి రూ. 102 కోట్లు కేటాయించారు. ఈసారి వీటిపై పెద్దగా ఆశల్లేవు. నగర రహదారులపై ప్రజల నుంచి నిత్యం విమర్శలతో పాటు వర్షం వస్తే పరిస్థితి తీవ్రంగా ఉండటంతో రోడ్లు దెబ్బతినకుండా పీరియాడికల్ మెయింటనెన్స్ కింద పనులు చేపట్టేందుకు రూ. 721 కోట్లకు గతంలోనే పరిపాలన అనుమతులిచ్చారు. హెచ్‌ఆర్‌డీసీఎల్‌కు మరో రూ.1,930 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం నుంచి నిధులు మాత్రం అందలేదు. దీంతో జీహె చ్‌ఎంసీపై అప్పు భారం పడుతోంది. నగరంలో వాన సమస్యల పరిష్కారానికి దాదాపు రూ. 4వేల కోట్లు ఖర్చు కాగలదని అంచనా.
రహదారులకు పూర్తిస్థాయి మరమ్మతులయ్యేనా..?
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రోడ్లకు పూర్తిస్థాయి మరమ్మతులకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొనడంతో పాటు అన్ని రహదారుల్ని అద్దంలా తీర్చిదిద్దేందుకు మిషన్‌మోడ్‌లో ప్రభుత్వం పనిచేయనుందని ప్రస్తావించడంతో రహదారులకు భారీ నిధులు కేటాయించగలరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment