హామీలకు జై  | KCR Vote On Account Budget Introduced | Sakshi
Sakshi News home page

హామీలకు జై 

Published Sat, Feb 23 2019 7:37 AM | Last Updated on Sat, Feb 23 2019 7:37 AM

KCR Vote On Account Budget Introduced - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: బడ్జెట్‌లో వ్యవసాయ, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేశారు. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిధులను సంక్షేమ పథకాలకు కొనసాగింపుగా కేటాయించారు. దీనిని అధికార పార్టీ నాయకులు సంక్షేమ బడ్జెట్‌గా పేర్కొంటుండగా.. ప్రతిపక్షాలు మాత్రం ఇది కేవలం ఎన్నికల బడ్జెట్‌ అని.. ప్రధాన రంగాలకు ఇందులో నిధులు కేటాయించలేదని, ఇంకా పూర్తిస్థాయి బడ్జెట్‌ కేటాయించకపోవడం ఏమిటంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఎన్నికల హామీలనే ప్రధానాంశాలుగా పేర్కొనడంతో జిల్లాలోని ప్రజలకు లబ్ధి చేకూరనున్నది. ఇది ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కావడంతో కొత్త పథకాలు ప్రవేశపెట్టేందుకు అవకాశం లేకుండాపోయింది. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలకే నిధులు కేటాయించడంతో జిల్లాలోని అర్హులైన లబ్ధిదారులకు మేలు జరగనున్నది. వ్యవసాయ, సంక్షేమ రంగాల కోసం నిధులు కేటాయించారు.

వ్యవసాయ రంగంలో రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలకు బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన ఆసరా పింఛన్లకు కూడా నిధులను కేటాయించింది. దీంతో జిల్లాలోని రైతులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు లాభం చేకూరనున్నది. ప్రధానంగా కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి కలగనున్నది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి వ్యక్తికి ఏడాదికి రూ.806 చొప్పున కేంద్రం నుంచి నిధులు అందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2019–20 ఆర్థిక సంవత్సరంలో స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల విషయంలో రాష్ట్ర ఆర్థిక సంఘం ఇటీవల మధ్యంతర నివేదిక ఇచ్చిందని బడ్జెట్‌ ప్రసంగంలో కేసీఆర్‌ పేర్కొన్నారు. అయితే ఆర్థిక సంఘం సిఫార్సులకన్నా ఎక్కువ నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దీంతోపాటు 500 జనాభా కలిగిన గ్రామానికి కూడా రూ.8లక్షల నిధులు కేటాయించనున్నారు. వీటితోపాటు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులు, పన్నుల ద్వారా వచ్చే నిధులతో గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టనున్నది. 

అంకెల గారడీ.. 
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంకెల గారడీలా ఉంది. పూర్తిస్థాయిలో అన్ని వర్గాలకు న్యాయం జరగలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఈ బడ్జెట్‌తో అమలు జరిగే అవకాశం లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న ప్రభుత్వం నేటికీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సైతం ఆశించిన స్థాయిలో లబ్ధి చేకూర్చలేదు. విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం వహిస్తూ నిధుల కేటాయింపు పూర్తిస్థాయిలో లేకపోవడంతో నాణ్యమైన విద్య అందే అవకాశం కనిపించడం లేదు. – పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు 
 
లెక్కలతో మోసం.. 

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉన్నా.. అలా చేయలేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పి లెక్కల గారడీ చేశారు. ఒకేసారి రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం అందుకు రూ.6వేల కోట్లు కేటాయించి మోసం చేశారు. వైద్యరంగానికి రూ.5వేల కోట్లు కేటాయించామని చెప్పిన కేసీఆర్‌ కంటి వెలుగు, ఈఎన్‌టీ వంటి పథకాలు కూడా ఇందులోనే ఉంటాయని చెప్పారు. రూ.27వేల కోట్లు లోటు ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ లోటును ప్రజలపై పన్నులు వేసి భర్తీ చేస్తారా? ఏ విధంగా భర్తీ చేస్తారో సీఎం వివరించాలి. – నున్నా నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి 
 
అప్పుల్లోనే అభివృద్ధి.. 

రాష్ట్రం అప్పుల్లో గణనీయమైన అభివృద్ధి సాధించింది. కేసీఆర్‌ చెప్పిన లెక్కల్లో అంతా డొల్లతనం కనిపిస్తోంది. పంట రుణాల కేటాయింపులు గతంలోనే బాగున్నాయి. నిరుద్యోగ భృతికి సంబంధించి బడ్జెట్‌లో స్పష్టత లేదు. ప్రాజెక్టులకు సరైన రీతిలో కేటాయింపులు జరగలేదు. బడ్జెట్‌ను చూస్తుంటే ఆర్థిక అరాచకత్వం ప్రబలే ప్రమాదం ఉంది. సంక్షేమ పథకాల అమలుపై స్పష్టత లేదు. విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించారు. కేసీఆర్‌ అంకెల గారడీతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాకు సంబంధించి సీతారామ ప్రాజెక్టు కేటాయింపులపై స్పష్టత లేదు. – బాగం హేమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి 
 
అన్ని వర్గాలకు అన్యాయమే.. 

అతి సామాన్యుడికి వరాలు ఇచ్చినట్టున్నా.. బడ్జెట్‌ అన్ని వర్గాలకు అన్యాయం చేసేలా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏ రంగానికి సరిపడా నిధులు కేటాయించలేదు. వ్యవసాయ రంగానికి కేటాయించిన బడ్జెట్‌లో ఏదైనా ఒక్క పథకానికే నిధులన్నీ సరిపోయేలా ఉన్నాయి. అతి సామాన్యుడిపై భారం తగ్గించేందుకు ఎలాంటి కేటాయింపులు జరపలేదు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఎన్ని నిధులు కేటాయిస్తున్నామన్నది బడ్జెట్‌లో చెప్పలేదు. వ్యవసాయం, విద్య తదితర రంగాలు ఈ బడ్జెట్‌ వల్ల ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. 
– లక్కినేని సుధీర్‌బాబు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు 
  
మోసం చేసేందుకే.. 
తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసే ప్రక్రియలో భాగంగానే ఈ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్రం రూ.22వేల కోట్లు ఇస్తుందని తెలిసి కూడా పూర్తి బడ్జెట్‌ను ఎందుకు ప్రవేశపెట్టలేదో అర్థం కావడం లేదు. ఏ ఒక్క గ్రామానికి గ్రాంట్‌ ఇవ్వలేదు. కొత్త గ్రామ పంచాయతీలకు కేటాయింపులు లేవు. మిషన్‌ భగీరథ కరెంట్‌ బిల్లులు ఎవరు కట్టాలి. పార్లమెంట్‌ ఎన్నికల కోసమే తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నారు. – తుళ్లూరి బ్రహ్మయ్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడు 
 
అప్పుల ఊబిలో.. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.50వేల కోట్ల రెవెన్యూ లోటు కనిపిస్తోంది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి నిదర్శనం. మిగులు రాష్ట్రం కాస్త అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా లిక్కర్‌ అమ్మకాల వల్ల వచ్చే ఆదాయంపై ఆధారపడుతోంది. ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టాలి. అయితే రెవెన్యూ లోటు ఉండడం వల్ల ప్రభుత్వం అభివృద్ధిపై నిధులు కేటాయించడం లేదు. బడ్జెట్‌లో ఖమ్మం జిల్లాకు ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా ఇవ్వలేకపోయింది. ఇది పూర్తిగా రైతు వ్యతిరేక, అభివృద్ధి వ్యతిరేక బడ్జెట్‌. – సన్నె ఉదయ్‌ప్రతాప్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు 
 
ఎన్నికల బడ్జెట్‌.. 

రానున్న పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రజాకర్షక పథకాలతో ప్రవేశపెట్టారు. నిరుద్యోగ భృతి, పెన్షన్, రుణమా ఫీ వంటి ఎన్నికల హామీల నేపథ్యంలో కేటా యింపులు చేయడం సమంజసమైనప్పటికీ.. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, రైతాంగ సంక్షోభానికి కారణమైన వ్యవసాయరంగాన్ని ఆదుకోవడానికి, పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు బడ్జెట్‌లో పరిష్కార మార్గాలు చూపలేదు. నీటిపారుదల రంగానికి రూ.22వేల కోట్లు కేటాయించినా.. అనేక ప్రాజెక్టులకు లక్ష కోట్లకుపైగా ఖర్చు చేస్తున్న పరిస్థితి చూస్తుంటే వాస్తవ పరిస్థితికి తగినట్లుగా లేదు. మొత్తంమీద ఇది ఎన్నికల బడ్జెట్‌. – పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement