సాక్షిప్రతినిధి, నిజామాబాద్: సీఎం కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో జిల్లాలో ఎంతో మందికి లబ్ధి చేకూరనుంది. ప్రధానంగా సాగు, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేయడంతో జిల్లా రైతులు, ఇతర పథకాల లబ్ధిదారులకు ఎంతో మేలు కలగనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష లోపు రుణమాఫీ, ‘ఆసరా’ రెట్టింపు, పింఛన్ల అర్హత వయో పరిమితి కుదించడం, నిరుద్యోగ భృతి తదితరాలతో జిల్లాలోని ఆయా వర్గాలకు ప్రయోజనం చేకూరనుంది. ఓటాన్ బడ్జెట్‌లో సంక్షేమ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతమివ్వడంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
‘ఆసరా’ రెట్టింపు..
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రవేశ పెట్టిన రూ.1.82 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి పెద్ద పీట వేశారు. ముఖ్యంగా ఆసరా పింఛన్ల కోసం రూ.12,067 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద జిల్లాలో ప్రస్తుతం 2.66 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. వృద్ధాప్య, బీడీ కార్మికులు, వికలాంగులు, వితంతు, ఒంటరి మహిళ, గీత, చేనేత కార్మికులు, ఎయిడ్స్, పైలేరియా వ్యాధి గ్రస్తులు, అభయహస్తం ఇలా అన్ని రకాల పింఛ న్లు కలిపి ప్రతినెలా రూ.27.44 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రస్తుతం వికలాంగులకు నెలకు రూ.1,500, మిగతా వారికి నెలకు రూ.వెయ్యి చొప్పున పింఛన్ అందుతోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ ఆసరా పింఛన్లను రూ.వెయ్యి నుంచి రూ.2,016కు, వికలాంగలు పెన్షన్లను రూ.3,016కు పెంచుతామని హామీనిచ్చింది. ఆ హామీ మేరకు పింఛన్ల మొత్తాన్ని పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వికలాంగులకు రూ. 3,016, మిగతా పింఛన్లు, జీవనభృతి మొత్తాన్ని రూ. 2,016 చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు.
వయస్సు కుదింపుతో మరింత లబ్ధి
ఎన్నికల హామీ మేరకు వృద్ధాప్య పింఛన్ల అర్హతను 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో జిల్లాలో పింఛన్ లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగనుంది. అలాగే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాల అమలు కోసం రూ.1,450 కోట్లు కేటాయించారు. కల్యాణలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 5,674 మంది లబ్ధిదారులకు రూ.56.80 కోట్ల లబ్ధి కలిగింది. షాదీముబారక్ కింద 2,215 మందికి గాను రూ.22.17 కోట్లు పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో మరింత మందికి లబ్ధి కలగనుంది. షెడ్యూల్డ్ కులాల ప్రగతి నిధి పేరుతో ప్రభు త్వం రూ.16 వేల కోట్లు, మైనారిటీ సంక్షేమం కోసం రూ.2004 కోట్ల నిధులు కేటాయించడంపై ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
రైతులకు భరోసా..
నిజామాబాద్ అంటేనే వ్యవసాయ జిల్లాగా పేరుంది. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.20,107 కోట్లు కేటాయించారు. దీంతో జిల్లా రైతాంగానికి భరోసా లభిస్తోంది. రైతుబంధు పథకం కింద జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 2.25 లక్షల రైతులకు ఎకరానికి రూ.4 వేల చొప్పున రూ.181.39 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. అలాగే, రైతుబీమా కింద 227 మంది రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.11.35 లక్షలను వారి ఖాతాల్లో జమ చేశారు. ఈసారి ఈ రెండు పథకాలకు కూడా నిధులు కేటాయించడంతో రైతుల్లో భరోసా పెరుగుతోంది.
రుణమాఫీపై హర్షం..
రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి ప్రకటనతో జిల్లాలో సుమారు నాలుగు లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశముంది. గతంలో ఉమ్మడి జిల్లాలో 3.62లక్షల మందికి రుణమాఫీ వర్తించింది. నాలుగు విడతల్లో కలిపి రూ.1,790 కోట్లు మాఫీ అయ్యాయి. ఈసారి రుణ మాఫీ అర్హత పొందే రైతుల సంఖ్య ఉమ్మడి జిల్లాలో 4.20 లక్షల మంది వరకు ఉంటారని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాల తర్వాతే లబ్ధిదారుల సంఖ్య తేలనుంది. మరోవైపు, బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్య, వైద్య రంగాలకు స్వల్పంగానే నిధులు కేటాయించారని విద్యావేత్తలు, ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఇది వ్యవసాయ కేంద్రీకృత బడ్జెట్ అని, అన్ని రంగాలకు సమ స్థాయిలో కేటాయింపులు దక్కలేదని పేర్కొంటున్నారు.
వ్యవసాయ కేంద్రీకృత బడ్జెట్
తెయూ(డిచ్‌పల్లి): సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వ్యవసాయ కేంద్రీకృత బడ్జెట్ అన్న రీతిలో ఉంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అగ్రస్థానాన్ని కేటాయించారు. నీటిపారుదల శాఖ, మిషన్ కాకతీయకు రూ.45 వేల కోట్లు కేటాయించడం హర్షణీయం. రైతుబంధు, రైతుబీమా, రైతులకు రూ.లక్ష లోపు రుణమాఫీ, పంటల కాలనీల అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించారు. అయితే, నిరుద్యోగ భృతికి కేటాయించిన రూ.1800 కోట్లు ఏమాత్రం సరిపోవు. బడ్జెట్‌లో విద్య,వైద్య రంగాలకు నిధుల కేటాయింపులో వివక్ష కనిపిస్తోంది. ఉన్నత విద్యకు ఎక్కువ నిధులిస్తే బాగుండేది. – రవీందర్‌రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, తెయూ
Comments
Please login to add a commentAdd a comment