
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడింది. ఈ ఇళ్ల నిర్మాణానికి దాదాపు రూ.18 వేల కోట్లు అవసరముండగా.. తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.1,500 కోట్లే కేటాయిం చింది. గతేడాది రూ.500 కోట్లు కేటాయించగా ఆ మొత్తాన్ని ఈసారి మూడు రెట్లకు పెంచింది. రాష్ట్రవ్యా ప్తంగా 2,72,763 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ఇప్పటి వరకు 9,522 ఇళ్లను పూర్తిచేసింది. 1,68,981 ఇళ్లు ఇంకా వివిధ స్థాయిలో ఉన్నాయి. హడ్కో నుంచి పెద్ద ఎత్తున రుణం తీసుకుని దాన్ని దశలవారీగా ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద రూ.1,143 కోట్లు మంజూరైనట్టు తాజా బడ్జెట్‌లో పేర్కొంది. పీఎంఏవై పట్టణ ఇళ్లకు రూ.766.50 కోట్లు, గ్రామీణ ఇళ్లకు రూ.376.60 కోట్లను కేంద్రం మంజూరు చేసిందని వెల్లడించింది.
2018–19 ఆర్థిక సంవత్సరానికి గృహనిర్మాణ శాఖకు కేటాయింపులు..(కోట్లలో..)
నిర్వహణ పద్దు: రూ.652.05
ప్రగతి పద్దు: రూ.2,143.10
మొత్తం: రూ.2,795.15
రోడ్లకు రూ.5,363 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రహదారులు, వంతెనల నిర్మాణానికి దాదాపు రూ.12 వేల కోట్ల విలువైన పనులను ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది. అయితే తాజా బడ్జెట్‌లో మాత్రం రోడ్లు, భవనాల శాఖకు రూ.5,363 కోట్లను మాత్రమే కేటాయించింది. ఇందులో ప్రగతి పద్దు కింద కేటాయించింది రూ.3,501 కోట్లు మాత్రమే. ఇది ఇంచుమించు గతేడాది బడ్జెట్ కేటాయింపులంతే ఉండటం విశేషం. పనుల్లో ఆశించిన వేగం లేకపోవటం వల్లనే నిధుల కేటాయింపు పెరగటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా రహదారులకు రూ.810 కోట్లు, గజ్వేల్, ఇతర అనుసంధాన రహదారుల ప్రాంత అభివృద్ధి అథారిటీకి రూ.80 కోట్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరసల రోడ్లకు రూ.460 కోట్లు, రేడియల్ రోడ్లకు రూ.80 కోట్లు కేటాయించారు. కొత్త కలెక్టర్ భవనాలకు రూ.500 కోట్లు, ఎమ్మెల్యే భవనాలకు రూ.30 కోట్లు, కళాభారతి నిర్మాణం కోసం రూ.40 కోట్లు కేటాయించారు.
సచివాలయ భవనం సంగతేంటి?: సికింద్రాబాద్ బైసన్‌పోలో మైదానంలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణ అంశాన్ని తాత్కాలికంగా ప్రభుత్వం పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ బడ్జెట్‌లో దీనికి నామ మాత్రంగా రూ.5 కోట్లు కేటాయించింది. గతేడాది రూ.15 కోట్లు కేటాయించినా ఖర్చు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment