బడ్జెట్ అంచనాలన్నీ అవాస్తవికం | Expects the budget Impractically | Sakshi
Sakshi News home page

బడ్జెట్ అంచనాలన్నీ అవాస్తవికం

Published Thu, Mar 31 2016 4:00 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

బడ్జెట్ అంచనాలన్నీ అవాస్తవికం - Sakshi

బడ్జెట్ అంచనాలన్నీ అవాస్తవికం

రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ అక్షింతలు
 
♦ బలహీనంగా తెలంగాణ బడ్జెట్.. నిర్వహణలో లోపాలు
♦ భారీ మిగులు, అక్కర్లేని అనుబంధ కేటాయింపులు
♦ మిగతా రాష్ట్రాల కంటే విద్య, సామాజిక రంగానికి తక్కువగా బడ్జెట్
♦ ‘పే అండ్ అకౌంట్స్’లో బిల్లులకు మించి రూ.81.07 కోట్ల చెల్లింపులు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ అంచనాలు అవాస్తవికంగా ఉన్నాయని... వ్యయ పర్యవేక్షణ, నియంత్రణ బలహీనంగా ఉన్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. అవాస్తవికమైన బడ్జెట్ కారణంగా భారీ మిగులు, అవసరం లేని అనుబంధ కేటాయింపులు, అసలు కేటాయింపులు లేకుండా చేసిన ఖర్చులు వంటివి పెరిగిపోయాయని ఎత్తిచూపింది. ఈ అంశాలన్నీ బడ్జెట్ నిర్వహణ లోపాలను సూచిస్తున్నాయని ఎత్తిచూపింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విశ్లేషించిన కాగ్... తొలి (2014-15) ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికలను వెల్లడించింది. ఈ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం శాసనసభకు సమర్పించింది.

 బడ్జెట్ నిర్వహణ లోపభూయిష్టం
 అవాస్తవికమైన బడ్జెట్ పర్యవసానంగా భారీ మిగులు, అవసరం లేని అనుబంధ కేటాయింపులు, కేటాయింపులు లేకుండా చేసిన ఖర్చులు, అధిక రీ అప్రోప్రియేషన్లతో ఏర్పడిన అదనపు కేటాయింపులన్నీ బడ్జెట్ నిర్వహణ లోపాలు సూచిస్తున్నాయని తమ నివేదికలో కాగ్ వేలెత్తి చూపింది. తొలి కేటాయింపులతో పోలిస్తే వాస్తవంగా జరిగిన ఖర్చు తక్కువగా ఉందని... అలాంటప్పుడు అనుబంధ కేటాయింపులు అనవసరమని స్పష్టం చేసింది. రూ.1.01 లక్షల కోట్ల కేటాయింపుల్లో వాస్తవ ఖర్చు (రూ.64,097 కోట్లు) తక్కువగా ఉన్నందున రూ.5,359 కోట్ల అనుబంధ కేటాయింపు అనవసరమని పేర్కొంది. వివిధ పథకాలకు విధి విధానాలు ఖరారు కాకపోవడం, పాలనాపరమైన అనుమతి లేక పనులు ప్రారంభం కాకపోవడం, నిధులు విడుదల చేయకపోవడంతో ప్రభుత్వం తీసుకున్న పలు విధాన నిర్ణయాలు నెరవేరలేదని వెల్లడించింది. కొన్ని మాత్రం పాక్షికంగా అమలు జరిగాయని తెలిపింది.

 సభకు చెప్పని ఖర్చు రూ.304 కోట్లు
 శాసనపరమైన సాధికారత లేకుండానే 2014-15 సంవత్సరంలో రూ.304 కోట్ల మేరకు అదనపు వ్యయం చేసినట్లు కాగ్ తేల్చింది. నిర్దిష్టమైన ఖర్చుల వివరాలు లేకుండా రూ.2,555 కోట్లను గంపగుత్తగా కేటాయించి, సంవత్సరం చివర్లో తిరిగి అప్పగించిందని తప్పుబట్టింది. ‘‘పీడీ ఖాతాల నగదు పుస్తకాలు, ట్రెజరీ ఖాతా పుస్తకాలు, బ్యాంకు క్యాష్‌బుక్‌ల మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. పీడీ ఖాతాల్లో నిల్వలు పేరుకుపోయాయి. ఇవన్నీ పీడీ ఖాతాలపై పర్యవేక్షణ, నియంత్రణను మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకతను వేలెత్తి చూపిస్తున్నాయి..’’ అని కాగ్ స్పష్టం చేసింది.

 ఇతర రాష్ట్రాల కంటే తక్కువ
 తొలి ఏడాదిలో ప్రభుత్వం అభివృద్ధి వ్యయానికి తగిన ప్రాధాన్యత ఇచ్చినా కేటాయించిన నిధులను ఆశించిన ప్రయోజనాలకు పూర్తిగా విడుదలయ్యేలా చూడలేదని కాగ్ ఆక్షేపించింది. విద్యారంగానికి 11.57 శాతం కేటాయించడం మిగతా రాష్ట్రాల సగటు (16.23%) కంటే తక్కువేనని పేర్కొంది. మొత్తం ఖర్చులో సామాజిక రంగంపై 34.42 శాతం వ్యయం చేశారని.. ఇది మిగతా రాష్ట్రాలతో (36.50%) పోలిస్తే తక్కువని తెలిపింది. రాష్ట్రం తీర్చాల్సిన అప్పుల్లో యాభై శాతానికిపైగా వచ్చే ఏడేళ్లలోనే తీర్చాల్సి ఉందని గుర్తుచేసింది.

 బిల్లులకు మించి చెల్లింపులు
 ‘పే అండ్ అకౌంట్స్’ కార్యాలయాలపై తనిఖీలు కరువయ్యాయని, ఆర్థిక నియంత్రణలో లోపాలున్నాయని కాగ్ ప్రస్తావించింది. ‘‘బిల్లుల నుంచి వసూలు చేసిన రూ.14.29 కోట్ల భవన, ఇతర నిర్మాణ కూలీల సంక్షేమ శిస్తును సంక్షేమ బోర్డుకు చెల్లించలేదు. విడుదలైన నిధులకు మించి చెల్లింపులు జరగకుండా చూడాల్సిన పే అండ్ అకౌంట్స్ అధికారులు (పీఏవోలు) వివిధ శాఖాధిపతులు జారీ చేసిన లెటర్ ఆఫ్ క్రెడిట్స్ మించి రూ.81.07 కోట్ల బిల్లులు చెల్లించారు. ఖమ్మం, నిజామాబాద్, నిర్మల్, హన్మకొండ పీఏవోల పరిధిలో ఈ చెల్లింపులు జరిగాయి. రూ.50 లక్షలలోపు విలువైన 147 పనులకు  ఈఎండీ (ముందస్తు ధరావతు) ఆమోదించడంలో నిబంధనలను ఉల్లంఘించారు. డీడీలకు బదులుగా రూ.99లక్షల విలువైన బ్యాంకు గ్యారంటీలను ఆమోదించారు. వీటిలో 97 కాలం చెల్లినవి ఉన్నాయి. నాణ్యత ధ్రువపత్రాలు లేకుండానే హన్మకొండ, నిజామాబాద్ పీఏవోలు రూ.36.44 కోట్ల విలువైన 18 బిల్లులు ఆమోదించారు. కార్మిక సదుపాయాలు కల్పించినట్లు ధ్రువీకరణ లేకుండానే నిర్మల్ పీఈవో రూ.91.25 లక్షల బిల్లులు చెల్లించారు’’ అని కాగ్ వేలెత్తి చూపింది.
 
 రెవెన్యూ మిగులు పెంచి చూపారు
 2014-15 బడ్జెట్‌లో రెవెన్యూ మిగులును ఎక్కువగా చేసి చూపించారని కాగ్ ఆక్షేపించింది. ఆ బడ్జెట్‌లో ఏకంగా రూ.690.27 కోట్లు మిగులు చూపించారని పేర్కొంది. ప్రభుత్వ పద్దుల నియమాల ప్రకారం చిన్న తరహా పనులపై ఖర్చును రెవెన్యూ పద్దులో నమోదుచేయాలని, కానీ ఆ తరహా పనులకు చెందిన రూ.371.55 కోట్ల మొత్తాన్ని వివిధ క్యాపిటల్ పద్దుల కింద చూపారని తెలిపింది. అలాగే రూ.553కోట్ల విలువైన లావాదేవీలను తనిఖీ చేయగా... రెవెన్యూ రాబడులను అధికం చేసి చూపినట్లు వెల్లడైందని పేర్కొంది. రూ.1.50 కోట్ల సహాయక గ్రాంటును కూడా క్యాపిటల్ పద్దుల కింద నమోదు చేయడాన్ని తప్పుబట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement