సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి కూడా కేంద్ర ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకుంది. ఆశించినన్ని నిధులు రావని తెలిసినా.. గడిచిన నాలుగేళ్ల అనుభవాలను విస్మరించి మరోసారి భారీ అంచనాలను వేసుకుంది. కేంద్రం నుంచి వచ్చే నిధులను భూతద్దంలో చూపించింది. గత నెలలోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. పన్నుల వాటాతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్ల రూపంలో దాదాపు రూ.30 వేల కోట్లు రాష్ట్రానికి వచ్చే అవకాశమున్నట్లు కేంద్ర బడ్జెట్ తేటతెల్లం చేసింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా కేంద్రం నుంచి రూ.48 వేల కోట్లు వస్తాయనే అంచనాలతో బడ్జెట్‌ను తయారు చేసింది. ఇప్పటికే కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆశించిన మేర సాయం అందటం లేదు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని నీతి ఆయోగ్ ఏడాది కిందటే సిఫారసు చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. వీటికి తోడుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రస్తావించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల్లో కోత వేయటంతో పాటు సీఎస్‌టీ బకాయిలు, వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే గ్రాంట్లను సైతం పెండింగ్‌లో పెట్టింది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి భారీ నిధులు వస్తాయని బడ్జెట్‌లో ప్రస్తావించిన తీరు చర్చనీయాంశంగా మారింది. పన్నుల వాటా రూ.19,207.43 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.2,720.26 కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు రూ.9,723.44 కోట్లు వస్తాయని పక్కాగా లెక్కలేసిన ప్రభుత్వం..అదనంగా ప్రత్యేక ప్యాకేజీలు, గ్రాంట్లు వస్తాయని లెక్కలేసుకుంది. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.900 కోట్లు, ఇతర గ్రాంట్ల కింద రూ.15,698 కోట్లు వస్తాయని అంచనాలు వేసుకుంది.
‘ఫెడరల్’వ్యూహం ఆశలకు గండికొట్టేనా..
రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది పాత జిల్లాలకు కేంద్రం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధిని గతంలో విడుదల చేసింది. ప్రతి జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున రూ.450 కోట్లు విడుదల చేసింది. తొలి రెండేళ్లు నిధులు కేటాయించిన కేంద్రం.. గత రెండేళ్లుగా పెండింగ్‌లో పెట్టింది. వీటిని మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖకు ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తులు చేసింది. ఈ నిధులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. కానీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇటీవలే సమర శంఖం పూరించారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి అదనంగా నిధులు రావటం కష్ట సాధ్యమనే అభిప్రాయాలున్నాయి. అలాగే జాతీయ స్థాయి రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశం పరిణామాల దృష్ట్యా.. కేంద్రం తెలంగాణపై మరింత శీతకన్ను వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా కేంద్రం నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.15 వేల కోట్లకు పైగా గ్రాంట్లు, ప్రత్యేక ప్యాకేజీలు వస్తాయనుకోవడం అత్యాశే అవుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
కేంద్రం వైపే.. రాష్ట్రం చూపు!
Published Fri, Mar 16 2018 2:47 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment