బడ్జెట్‌పై ప్రముకుల విమర్శలు | political leaders criticism on the budget | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌పై ప్రముకుల విమర్శలు

Published Thu, Nov 6 2014 3:37 AM | Last Updated on Thu, Jul 11 2019 5:33 PM

బడ్జెట్‌పై ప్రముకుల విమర్శలు - Sakshi

బడ్జెట్‌పై ప్రముకుల విమర్శలు

బీసీల అభివృద్ధిని గాలికొదిలేసింది: దత్తాత్రేయ
బడ్జెట్‌లో బీసీలకు రూ.2,022 కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదు. బీసీల సమగ్ర అభివృద్ధిని ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఈ బడ్జెట్ కేటాయింపులను చూస్తే అర్థమవుతోంది. రూ.25 వేల కోట్లతో బీసీల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామన్న టీఆర్‌ఎస్ తన ఎన్నికల హామీని నిలబెట్టుకోలేదు. ప్రతి ఏటా వెయ్యికోట్లతో బీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక చేయూత అందిస్తామన్న హామీని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు.
 
ఏ మాత్రం స్పష్టత లేదు : జానారెడ్డి
తెలంగాణ మొదటి బడ్జెట్ నిస్సారంగా ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదు.   చాలా అంశాలపై స్పష్టత లేదు. రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ, కరెంటు, కరువు మండలాల ప్రకటన ఇవేవీ బడ్జెట్‌లో లేవు. ఫీజు రీయింబర్స్‌మెంటు, ఆరోగ్య శ్రీ, ఎస్టీలకు, మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్, డబుల్ బెడ్‌రూంల ఇళ్ల నిర్మాణం, నిలిచిపోయిన 5 లక్షల ఇళ్ల బిల్లుల చెల్లింపులు వంటి అంశాలను విస్మరించారు.
 
అన్ని వర్గాలనూ మోసం చేసే బడ్జెట్
తెలంగాణ తొలి బడ్జెట్ అన్నివర్గాలను మోసం చేసే విధంగా ఉంది. కమీషన్ల బడ్జెట్‌గానే కనిపిస్తోంది తప్ప ఏ ఒక్క రంగం అభివృద్ధి చెందేలా లేదు. కొడుకు, అల్లుడిని సంతృప్తి పరిచేలా వారి శాఖలకే భారీగా కేటాయింపులు జరిగాయి. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా కేటాయింపులున్నాయి. ప్రాధాన్యతా రంగాలను పూర్తిగా విస్మరించారు. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం.     - ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ ఎమ్మెల్యే
 
ఎన్నికల హామీలకు బడ్జెట్‌కు పొంతన లేదు
టీఆర్‌ఎస్ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు, వాగ్దానాలకు భిన్నంగా బడ్జెట్ ఉంది. బడ్జెట్ మొత్తం అంకెల గారడీగా, కొత్త సీసాలో పాత సారాలా ఉంది.  ఏ రంగం పైనా స్పష్టత లేదు. రైతు ఆత్మహత్యలు, కరువు నివారణ చర్యల్ని ప్రస్తావించలేదు. గొప్పలకు పోయి రూ. లక్ష కోట్ల బడ్జెట్ ప్రకటించారే తప్ప ఆదాయ వన రులు సమకూర్చడంపై స్పష్టత ఇవ్వలేదు.     - డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే
 
కేటాయింపులు ఘనం.. రాబడి శూన్యం
బడ్జెట్‌లో వివిధ రంగాలకు కేటాయింపులు ఘనంగా కనిపిస్తున్నా.. ఆదాయ రాబడి మాత్రం శూన్యంగా ఉంది. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా..రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా.. క నీసం నివారణ చర్యల ప్రస్తావన లేకపోవడం సరికాదు.ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది క్రమబద్ధీకరణను విస్మరించారు. -సున్నం రాజయ్య, సీపీఎం ఎమ్మెల్యే
 
ప్రచారం ఆకాశమంత, ఆచరణ అణువంత
ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న వాగ్దానాల అమలు, అధికారంలోకి వచ్చాక చేసిన వాగ్దానాల అమలు ఊహాలోకంలో ఉంటుందేమో. తొలి బడ్జెట్‌లో ప్రచారానికి, ఆచరణకు పొంతన లేదు. ప్రచారం ఆకాశమంత, ఆచరణ  అణువంతగా ఉంది. రంగాల వారీగా కేటాయింపులు ప్రాధాన్యతకు నోచుకోకపోవడం దురదృష్టకరం.    
- చాడ వెంకటరెడ్డి, సీపీఐ తెలంగాణ కార్యదర్శి
 
బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాం
తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాం. టీఆర్‌ఎస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా మంత్రి ఈటెల బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లుంది. ఈ బడ్జెట్‌లో రాష్ట్ర అభివృద్ధితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి తగిన ప్రాధాన్యత లభించింది. మైనార్టీలకు భారీగా కేటాయించడం అభినందనీయం.
- అక్బరుద్దీన్ ఒవైసీ, మజ్లిస్ శాసనసభా పక్ష నేత
 
మహిళలకు నిరాశ మిగిల్చిన బడ్జెట్
‘‘బడ్జెట్ మహిళలకు నిరాశే మిగిల్చింది. లక్షకోట్లకు పైగా కేటాయింపులతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మహిళా,శిశుసంక్షేమశాఖకు కేటాయించింది నామమాత్రం రూ. 221 కోట్లు మాత్రమే. ప్రభుత్వం స్త్రీ,పురుష జనాభా నిష్పత్తి ఆధారంగా బడ్జెట్‌ను అమలుచేయాలి. మహిళల సమగ్రాభివృద్ధి చెందేలా కేటాయింపులుండాలి.’’
- ఐద్వా నేతలు ఆశాలత, టి.జ్యోతి, హైమావతి
 
తొలి బడ్జెట్ నిరుత్సాహ పర్చింది
తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ నిరుత్సాహపర్చింది. బడ్జెట్‌లో రైతు ఆత్మహత్యల నివారణ చర్యల ప్రస్తావన లేకపోవడం శోచనీయం. రైతాంగ సమస్యలపై స్పష్టత, విద్యుత్ సమస్యపై తగిన ప్రతిపాదనలు లేవు. భవిష్యత్‌లో విద్యుత్ కష్టాలు కొనసాగుతాయన్న సంకేతాలిచ్చారు. గృహ నిర్మాణం, పెన్షన్‌లకు నిధులు తగ్గించడం చూస్తే.. భారీ కోత తప్పదని స్పష్టమవుతోంది.  
- ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే
 
అందరికీ నిరాశే మిగిల్చింది
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, కొలువులు, ఇళ్లు అందుబాటులోకి వస్తాయని ఆశించిన వారందరికీ బడ్జెట్ నిరాశే మిగిల్చింది. ఆర్థికవ్యవస్థకే సవాల్  విసురుతున్న విద్యుత్‌కు వెయ్యికోట్లే కేటాయిస్తే ప్రస్తుత సంక్షోభం తీరేదెలా? కొలువుల ప్రస్తావనే లేదు, ఒక్క కొత్త నోటిఫికేషన్ ప్రకటించలేదు. ఫాస్ట్ పథకం ఊసే లేదు, స్కాలర్‌షిప్‌లు, సంక్షేమ హాస్టళ్లలో వసతులు, కేజీ టు పీజీ ఉచిత విద్యకు అత్యల్పంగా కేటాయించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం కార్యాలయంలో ఛేజింగ్ సెల్ ఏర్పాటుచేస్తే ప్రజలు ఆశలు కొంతైనా తీరే అవకాశం ఉంది. బడ్జెట్ కేటాయింపుల ప్రతిపాదనల్లో మార్పులు, చేర్పులకు ప్రభుత్వం సిద్ధపడాలి.
- తమ్మినేని వీరభద్రం, సీపీఎం కార్యదర్శి
 
తగిన నిధుల కేటాయింపుల్లేవ్
తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్లో పలు రంగాలకు తగిన స్థాయిలో నిధుల కేటాయింపు జరగలేదు.  బడ్జెట్ ఆహ్వానించదగినదే అయినప్పటికీ  నీటిపారుదల, రక్షిత మంచి పథకాలు, గిరిజనాభివృద్ధి తదితర రంగాలకు నిధుల కేటాయింపులు సరిగ్గా జరగలేదు. కరువు, రైతుల ఆత్మహత్యల నివారణపై స్పష్టత లేదు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీ ప్రకారం ప్రాధాన్యత రంగాలకు నిధుల కేటాయింపులు జరగాలి. ప్రస్తుతం కేటాయించిన నిధులు సైతం పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలి.
-రవీంద్రకుమార్,  సీపీఐ ఎమ్మెల్యే
 
22 ఏళ్ల తరువాత తెలంగాణ ఆర్థిక మంత్రి బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో 22 సంవత్సరాల తరువాత తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్థిక మంత్రి బడ్జెట్ సమర్పించారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 1992లో శనిగరం సంతోష్‌రెడ్డి ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. మళ్లీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014లో తొలి బడ్జెట్‌ను ఈటెల రాజేందర్ సభ లో ప్రవేశపెట్టడం విశేషం. 1956 తరువాత అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలంగాణ మంత్రుల్లో మర్రి చెన్నారెడ్డి(1965-67), నూకల రామచంద్రారెడ్డి(1974), జి. రాజారామ్
(78-81), పి. మహేంద్రనాథ్(85-88), కె.రాజయ్య(1989), సంతోష్‌రెడ్డి(91-92)లు ఉన్నారు.
 
టీఆర్‌ఎస్ కరపత్రంలా ఉంది
బడ్జెట్ పుస్తకం కేవలం టీఆర్‌ఎస్ కరపత్రంలా ఉంది. కాగితాల మీద లెక్కలేగానీ.. ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. వనరులు కల్పించాలన్న చిత్తశుద్ధితో కాకుండా.. కరపత్రం మాదిరిగా ప్రజలను మభ్యపెట్టే విధంగా బడ్జెట్ ఉంది. టీఆర్‌ఎస్ నేతల లక్షణాలు, మాటలు, లెక్కలు అన్నీ అంకెల గారడీయే. వాళ్లు ప్రస్తావించిన వాటినే మేం సభలో లేవనెత్తుతాం.
-  డి. శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నేత
 
కేటాయింపులు బాగున్నాయి
ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్‌లో కేటాయింపులు బాగానే ఉన్నాయి. ఈ రెండు ఉప ప్రణాళికల్లో నిధుల కేటాయింపు కూడా సరిగానే ఉంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబా రక్ పథకాలకు నిధుల కేటాయింపు, దళిత పారి శ్రామికవేత్తలకు రూ.వంద కోట్లు కేటాయించడం బాగుంది. అయితే వీటిని సక్రమంగా ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలి.   
- మల్లేపల్లి లక్ష్మయ్య, ఫౌండర్ ప్రెసిడెంట్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్
 
బీసీలకు న్యాయం జరగలేదు
బడ్జెట్‌లో బీసీలకు తగిన ప్రాధాన్యత లభించలేదు. బీసీ,ఎస్సీ,ఎస్టీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా నిధుల కేటాయింపులు జరగలేదు. బడ్జెట్ అన్ని వర్గాలనూ నిరాశపర్చింది. ఉపాధి, ఉద్యోగ అవకాశా లపై స్పష్టమైన హామీ లభించలేదు. విద్యుత్ సంక్షోభంపై వాస్తవ పరిస్థితిని ప్రతిపక్షాలతో చర్చించకుండా దాట వేసే ధోరణితో ప్రభుత్వం వ్యవహరించడం సరికాదు.    
- ఆర్.కృష్ణయ్య, టీడీపీ ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement