
ఇక అభివృద్ధి పరుగులు
సంకెళ్లు తెంచుకున్న ఆర్థిక వ్యవస్థ మనది: బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ఈటల
♦ సమగ్ర అధ్యయనం, వాస్తవాల ఆధారంగా ఇది తొలి బడ్జెట్
♦ ప్రజల భారం లేకుండా నిధులు సమీకరిస్తాం
♦ గతంలో ప్రతి రూపాయికి భిక్షమెత్తుకునే పరిస్థితి ఉండేది
♦ ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాశాం
♦ సీఎం కేసీఆర్ ప్రతి రంగంలో లోతైన సమీక్షలు చేశారు
♦ ఆ తర్వాతే బడ్జెట్‌కు తుదిరూపు ఇచ్చాం
♦ మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇళ్లకు బడ్జెటేతర నిధులు
♦ చాణ్యక నీతి, అశోకుడి రీతి, ఇల్లాలి ఇగురంల కలయికే ఈ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్ : ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ముచ్చటగా మూడోసారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు! ముఖ్యమంత్రికి ధన్యవాదాలతో ప్రసంగాన్ని ప్రారంభించి.. చాణక్యుడి నీతి, అశోకుడి రీతి, ఇల్లాలి ఇగురం.. ఈ మూడింటి మేలు కలయికే బడ్జెట్ అంటూ ముగించారు. మొత్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.1,30,415 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి బడ్జెట్‌లో ప్రణాళికేతర పద్దు కంటే ప్రణాళికా పద్దుకు ఎక్కువ నిధులు కేటాయించారు. ప్రణాళికేతర పద్దు కింద రూ.62,785.14 కోట్లు కేటాయించగా అంతకంటే దాదాపు రూ.5 వేల కోట్లు అధికంగా ప్రణాళిక పద్దు కింద రూ.67,630.73 కోట్లు ప్రతిపాదించారు.
ప్రణాళికేతర వ్యయంలో ఎక్కువగా రాజీ పడకుండా చూపటం, వనరులను బలోపేతం చేసి వ్యయాన్ని సహేతుకంగా క్రమబద్ధీకరించటం ద్వారా ఇది సాధ్యమైందని ఈటల తన ప్రసంగంలో పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ మిగులు రూ.3,718.37 కోట్లుగా చూపిన మంత్రి... ద్రవ్యలోటు రూ.23,468.29 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ద్రవ్యలోటును రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.5 శాతంగా అంచనా వేస్తున్నామని, సాగునీటి రంగానికి కేటాయించిన నిధులను నిర్మాణ వ్యయంగా పరిగణించటం వల్ల రెవెన్యూ మిగులు అధికంగా అంచనా వేసినట్టు వెల్లడించారు.
2015-16 సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర సొంత ఆదాయం రూ.54,256.71 కోట్లు కాగా.. 2016-17లో ఇది రూ.72,412.23 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు వివరించారు. కేంద్ర వితరణ నిధులు 2015-16లో రూ.25,223.49 కోట్లు కాగా 2016-17లో కేంద్రం రూ.28,512.52 కోట్లు ప్రతిపాదించిందని, ఇది నామమాత్రపు పెరుగుదలేనంటూ సభ దృష్టికి తెచ్చారు.
వృద్ధిరేటు పరుగులు..
గత రెండేళ్లుగా వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ స్థూల ఉత్పత్తి గణనీయంగా మెరుగుపడిందని, 2015-16లో ప్రస్తుత ధరల ప్రకారం స్థూల ఉత్పత్తి 11.67 శాతం మేర వృద్ధి నమోదైందని చెప్పారు. ఇది జాతీయ సగటు వృద్ధి రే టు 8.6 శాతం కంటే ఎక్కువని తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుత ధరల్లో 2014-15 సంవత్సరంలో 12.7 శాతం మెరుగుపడి రూ.1,29,182గా లెక్క తేలిందన్నారు. 2015-16లో 10.70 శాతం పెరిగి రూ.1,43,023గా ఉండొచ్చని అంచనా వేశామని, ఇది కూడా జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.93,231 కంటే ఎక్కువేనని పేర్కొన్నారు.
సంకెళ్లను తెంచుకున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో పరుగుపెడుతుందని భరోసా వ్యక్తంచేశారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, ఉత్పాదక రంగం, సేవల రంగాలు.. అన్నింటా ఆర్థిక అభివృద్ధికి ఉజ్వల అవకాశాలున్నాయన్నారు.
అందుకే ప్రాజెక్టుల రీడిజైనింగ్..
భవిష్యత్తులో గోదావరి, కృష్ణాల ద్వారా నీళ్లు రావటం కష్టమేనని, అందుకే ప్రాణహిత, ఇంద్రావతి నదుల నీటిని ఒడిసి పట్టుకోవటానికి ప్రాజెక్టుల రీడిజైనింగ్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు ఈటల వివరించారు. మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై అవగాహన కుదుర్చుకున్నట్టు వెల్లడించారు.
తెలంగాణకు కోటి ఎకరాలకు నీళ్లివ్వాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, 2017 డిసెంబరు నాటికి 95 శాతం గ్రామాలకు తాగునీరందించటం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. మిషన్ భగీరథ, రెండు పడక గదుల ఇళ్ల పథకాలకు ప్రణాళిక వ్యయం కింద కేటాయింపులను ప్రతిపాదించలేదని, వాటికి బడ్జెటేతర నిధులను సమకూర్చనున్నట్టు వెల్లడించారు.
ఇక కోతలకు చెల్లు
తెలంగాణ వస్తే అంధకారమంటూ గతంలో కొందరు చేసిన కామెంట్లు తప్పని నిరూపించినట్టు ఈటల పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇక కరెంటు కోతలుండవని తేల్చి చెప్పారు. వచ్చే ఖరీఫ్ నుంచి వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..’ అన్న పరిస్థితి నుంచి బీమారయితే సర్కారు దవాఖానకే పోతాం అనే పరిస్థితి తీసుకొస్తున్నట్టు చెప్పారు.
మైనారిటీల స్థితిగతులను అధ్యయనం చేస్తున్న సుధీర్ కమిటీ నివేదిక రాగానే వారి అభ్యున్నతికి శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది నుంచి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలందరికీ కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపచేస్తున్నామన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
బడ్జెట్ ప్రసంగంలో మంత్రి కేటీఆర్ ప్రస్తావన
సాధారణంగా బడ్జెట్ ప్రసంగంలో సీఎం పేరు మినహా మంత్రుల పేర్ల ప్రస్తావన ఉండదు. కానీ ఈటల తన బడ్జెట్ ప్రసంగంలో సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందనలతో ముంచెత్తారు. ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్’ నానుడితో తాగునీటి ద్వారా వచ్చే వ్యాధుల నివారణ కోసం రక్షిత మంచినీటిని అందించేందుకు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథను సృష్టిస్తే.. దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ రేయింబవళ్లు కృషి చేసేలా మంత్రి కేటీఆర్ ముందుండి నడుపుతున్నారన్నారు.
ముఖ్యమంత్రికి ధన్యవాదాలతో..
సోమవారం ఉదయం సరిగ్గా 11.35 గంటలకు మంత్రి ఈటల సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ధన్యవాదాలతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇది మూడో బడ్జెట్ అయినప్పటికీ పూర్తి సమాచారంతో, సమగ్ర అధ్యయనంతో, వాస్తవాల ఆధారంగా రూపొందించిన తొలి బడ్జెట్ ఇదేనని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తప్పిదాలకు ఇప్పుడు తెలంగాణ మూల్యం చెల్లించాల్సి వస్తోందని, భారీగా ఉన్న కరెంటు కొరత లాంటివి రాష్ట్రాన్ని పీడించాయని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా సీఎం ప్రతీ శాఖ తీరును స్వయంగా సమీక్షించి వాస్తవాలను బేరీజు వేసుకున్నారన్నారు. లోతైన అధ్యయనం తర్వాత బడ్జెట్‌కు తుదిరూపం ఇచ్చినట్టు వెల్లడించారు.
ప్రముఖుల కొటేషన్లతో..
ప్రసంగం మధ్యలో మంత్రి ఈటల ప్రముఖుల కొటేషన్లు వినియోగించారు. ఆరోగ్యంపై మాట్లాడుతూ.. ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్యసేన్ మాటలను ప్రస్తావించారు. మనదేశం ఆర్థిక అభివృద్ధిలో రెండో స్థానంలో ఉండటం, కానీ మానవాభివృద్ధి సూచీలో 138వ స్థానంలో నిలిచిన తీరు, దాని నివారణకు అనుసరించాల్సిన విధానాలపై ఆయన చేసిన సూచనలను ప్రస్తుతించారు. రాజనీతిజ్ఞతలో ఆర్థికశాస్త్ర పితామహుడు చాణక్యుడి నీతి, భవిష్యత్ అవసరాల్లో అశోకుడి రీతి, ఇంటిని చక్కబెట్టుకోవటంలో ఇల్లాలి ఇగురం.. ఈ మూడింటి మేలైన కలయికే ఈ బడ్జెట్ స్వరూపం అంటూ ప్రసంగాన్ని ముగించారు.