బడ్జెట్ నిరాశాజనకం.. : సున్నం రాజయ్య
బడ్జెట్‌లో రైతులు, కార్మికులు, ఉద్యోగులతోపాటు 10 జిల్లాల సమగ్రాభివృద్ధికి తగ్గ అంశాలు లేవు. బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడే బడ్జెట్ కాదు.
ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక సాధించుకున్నాం. ఈ చట్టాన్ని పూర్తిగా ఆ వర్గాలకే అమలు చేయాలి. బడ్జెట్ కేటాయింపులను బట్టి చూస్తే ఎస్సీలకు భూపంపిణీకి 30 ఏళ్లు పడుతుంది. భూములు పోడు చేసుకుంటున్న 12 లక్షలమంది గిరిజనులకు పట్టాలివ్వాలి. దుమ్ముగూడెం-సాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టును రద్దు చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి. మేము అటు(అధికార), ఇటు(ప్రతిపక్షం) కాదు, ప్రజల పక్షం.
అయోమయం.. అంకెల గారడీ.. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
ప్రణాళిక బడ్జెట్‌లో అయోమయం, అంకెల మార్పు, అంకెల గారడీగా ఉందేమో మంత్రి వివరణ నివ్వాలి. రూ. 17 వేల కోట్ల లోటు బడ్జెట్‌ను ఎట్లా భర్తీ చేస్తారో చెప్పాలి. తెలంగాణ వచ్చాక ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి. కరెంట్ సమస్యను అధిగమించడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి. ప్రభుత్వం 14 అంశాలపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏ నివేదికలిచ్చాయో బడ్జెట్‌లో పేర్కొనలే దు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ నివారణకు నక్కలగండి నుంచి డిండి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలి. ఈ బడ్జెట్‌కాకపోయినా.. వచ్చే బడ్జెట్‌లో అయినా నిధులు కేటాయించాలి.
బీబీనగర్ ఆస్పత్రికి నిధులివ్వాలి. దళితులతోపాటు గిరిజనులకు కూడా భూమి కొనుగోలు చేసి పంపిణీ చేయాలి. బీసీలకు తక్కువ నిధులు కేటాయించారు. చేనేత కార్మికులను విస్మరించడం సరికాదు. వారిని ఆదుకోవాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా భరోసా కల్పించాలి. తెలంగాణ సాధన కోసం 1,200 మంది ఆత్మ బలిదానం చేసినందున, 459 మందికే పరిహారం పరిమితం చేయకుండా అందరికీ రూ.10 లక్షల పరిహారం ఇచ్చి, ఇళ్లు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించాలి.