
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్‌లో అధిక శాతం నిధులను సాగునీటికే మళ్లించాలని, భారీగా బడ్జెటేతర నిధులను సైతం వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే సాధారణ ఎన్నికల్లోగా రూ. 50 వేల కోట్ల వ్యయంతో మూడు భారీ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు శరవేగంగా ప్రాజెక్టుల పనులు జరగాలని, అదే తీరులో నిధుల కేటాయింపులు ఉండాలని ఆర్థిక, సాగునీటి శాఖల అధికారులకు సీఎం కేసీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.
తొలి సమీక్ష దానిపైనే..
గోదావరిపై నిర్మిస్తున్న కాళేశ్వరం, మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు–రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల పథకాలను సాధారణ ఎన్నికలకు ముందే పూర్తి చేసి.. ప్రజల్లోకి వెళ్లాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈసారి బడ్జెట్ తయారీ సమీక్షల్లో సాగునీటి కేటాయింపులపైనే సీఎం తొలి సమీక్ష నిర్వహించారు కూడా. దీంతో ఈసారి బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకే పెద్ద వాటా దక్కనుందని స్పష్టమవుతోంది. అయితే సాగునీటి కోసం ఏటా బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయిస్తామని గతంలోనే సీఎం ప్రకటించారు. ఈసారి అంతకు రెండింతలుగా రూ.50 వేల కోట్లు వెచ్చించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు నిధుల సమీకరణపై ముఖ్యమంత్రి సమక్షంలో వ్యూహం కూడా ఖరారైనట్లు సమాచారం.
బడ్జెటేతర నిధులతో..
సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.30 వేల కోట్లు కేటాయించాలని, మరో రూ.20 వేల కోట్లు రుణంగా సమీకరించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కొత్తగా మరో రూ.15 వేల కోట్లు, సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.5 వేల కోట్లు రుణంగా సమీకరించాలని భావిస్తున్నారు. బడ్జెట్ తయారీ ఈ అంచనాలు, లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖకు సూచించినట్లు తెలిసింది.
ఇప్పటికే రూ.24 వేల కోట్ల రుణం
రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.24,780 కోట్ల రుణం తీసుకుంది. ఆంధ్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, విజయా బ్యాంకులు ఈ రుణాలు మంజూరు చేశాయి. అందులో ఇప్పటికే కొంత మేర నిధులు ఖర్చు చేశారు కూడా. తాజాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రూ.15 వేల కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 16.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. ఇప్పటికే నలభై శాతం పనులు పూర్తయినందున మరింత వేగం పెంచేందుకు నిధులు వెచ్చించాలని భావిస్తోంది. ఇక 7.5 లక్షల ఎకరాలకు సాగునీరందించే సీతారామ ప్రాజెక్టుకు రెండో ప్రాధాన్యమిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 35 శాతం పనులు పూర్తయ్యాయి.
సాగునీటి శాఖ ప్రతిపాదనలు
వచ్చే బడ్జెట్‌లో ఈ మూడు ప్రాజెక్టులపైనే ప్రభుత్వం ఫోకస్ చేస్తుండగా.. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.9,000 కోట్లు, పాలమూరుకు రూ.4,000 కోట్లు, సీతారామ ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు కావాలని సాగునీటి శాఖ ప్రతిపాదనలు పంపింది. ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా ఆ ప్రతిపాదనల్లో మార్పులు జరిగే అవకాశాలున్నాయి.