మూసీ, మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు రాలేదు..
70 కిలోమీటర్లకు రూ.20 వేల కోట్లకు పైగా అంచనా
ప్రతిపాదనలు, ప్రణాళికలు ఓకే...డీపీఆర్ తయారీలో జాప్యం
ఇక రాష్ట్ర బడ్జెట్‌లో నిధులిస్తేనే పనులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళన, అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్రం ప్రస్తుత బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించ లేదు. దీంతో మొత్తం భారమంతా రాష్ట్రంపైనే పడనుంది. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కోసం కేంద్రం సుమారు రూ.10 వేల కోట్ల నిధులను కేటాయించాలని రాష్ట్రం కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు స్వయంగా కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో మూసీ భారాన్ని పూర్తిగా రాష్ట్రమే భరించవలసిన వచి్చంది.
⇒ ఇక మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుపైన డీపీఆర్‌లో జాప్యం కారణంగా ఈ ప్రాజెక్టును కేంద్రానికి సమరి్పంచడంలో ఆలస్యం జరిగింది. బడ్జెట్ కంటే ముందే ఈ ప్రాజెక్టుపైన కేంద్రానికి డీపీఆర్‌ను సమరి్పంచి ఉంటే నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఉండేది. కానీ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మెట్రో రెండో దశను కూడా ప్రస్తుతానికి రాష్ట్ర నిధులతోనే ప్రారంభించవలసిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఈ రెండు ముఖ్యమైన ప్రాజెక్టుల కోసం రాష్ట్ర బడ్జెట్‌లో ఏ మేరకు నిధులు కేటాయించనున్నారనేది చర్చనీయాంశంగా మారింది.
⇒ సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్ వరకు ఎలివేటెడ్ కారిడార్, మేడ్చల్ రూట్‌లో ఫ్లై ఓవర్ల నిర్మాణాలను సైతం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పనులకు శంకుస్థాపన చేసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో సిటీ ప్రాజెక్టులే అత్యంత కీలకం కానున్నాయి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పాతబస్తీ మెట్రో కోసం నిధులు విడుదల చేయకపోవడం వల్ల పనులు ప్రారంభం కాలేదు. మూసీకి రూ.వెయ్యి కోట్లు ఇవ్వనున్నట్లు గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు సర్వే పనులు కొనసాగుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ నిరి్మంచనున్న 70 కిలోమీటర్ల మెట్రో రెండో దశకు సుమారు రూ.20 వేల కోట్లకు పైగా వ్యయం కానున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. మెట్రో మొదటి దశను పీపీపీ పద్ధతిలో
నిరి్మంచగా, రెండో దశ ప్రాజెక్టును మాత్రం ప్రభుత్వమే చేపట్టింది.
ఇదీ రెండో దశ మెట్రో...
⇒ నాగోల్ నుంచి ఎల్‌బీనగర్ వరకు అక్కడి నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రెండో దశలో చేపట్టనున్నారు.
⇒ అలాగే ఎల్‌బీనగర్ నుంచి హయత్‌నగర్, మియాపూర్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు, రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు రెండో దశలోనే పూర్తికావలసి ఉంది. అలాగే ఎయిర్‌పోర్ట్ రూట్‌లోనే మైలార్‌దేవ్‌పల్లి నుంచి హైకోర్టు వరకు మరో లైన్‌ను నిర్మించనున్నారు.
⇒ ఎయిర్‌పోర్ట్ కారిడార్, హయత్‌నగర్ కారిడార్‌లలో అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అలైన్‌మెంట్‌లు, స్టేషన్‌లను ఖరారు చేశారు.
⇒ రెండో దశ డీపీఆర్‌ను సిస్టా కన్సల్టెన్సీకి అప్పగించారు. ప్రస్తుతం ఇది తుది దశకు చేరుకుంది.
నిధులిస్తే పనులు ప్రారంభం...
⇒ సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు జంక్షన్ వరకు సుమారు రూ.2232 కోట్ల అంచనాలతో 18.10 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
⇒ ఈ ప్రాజెక్టు కోసం వివిధ చోట్ల సుమారు 197 ఎకరాలకు పైగా భూములను సేకరించవలసి ఉంటుందని అధికారులు గుర్తించారు. ఇందులో రక్షణ శాఖకు చెందిన భూములే 113 ఎకరాల వరకు ఉన్నాయి.
⇒ ఈ మార్గంలో తొలగించవలసిన కట్టడాలు, సేకరించాల్సిన భూములపైన కూడా క్షేత్రస్థాయి సర్వేలు పూర్తయ్యాయి.
⇒ ప్రభుత్వం నిధులను విడుదల చేసిన వెంటనే పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.
ఈ బడ్జెట్‌లో మురిపిస్తారా...
⇒ మూసీ అభివృద్ధి పనులు మొదలయ్యాయి. నదికి రెండు వైపులా 50 మీటర్ల పరిధిలో సామాజిక, ఆరి్థక సర్వే కొనసాగుతోంది.
⇒ గండిపేట్ నుంచి ఘట్కేసర్ వరకు సుమారు 55 కిలోమీటర్ల మార్గంలో ఉన్న మూసీ నదిని పూర్తిగా ప్రక్షాళన చేసి అభివృద్ధి చేయనున్నారు.
⇒ నదికి రెండు వైపులా 50 మీటర్ల పరిధిలో సుమారు 12,500 నిర్మాణాలను తొలగించవలసి ఉంటుందని అధికారులు గుర్తించారు.
⇒ ఇళ్లు, ఆస్తులు కోల్పోయిన వారికి పరిహారం కోసం పెద్ద మొత్తంలో ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా.
⇒ అలాగే ఎస్‌టీపీలు, నదికి ఇరువైపులా రహదారులు, ఐటీ టవర్లు, మెట్రో రైలు వంటి భారీ నిర్మాణాలను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment