
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధన, విద్యాభివృద్ధి కార్యక్రమాలకు అవసరమయ్యే నిధులకు ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో సగం కోత పెట్టింది. ప్రగతి పద్దు కింద 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ. 420.89 కోట్లు కేటాయించిన సర్కారు...ఈసారి దాన్ని రూ. 210.42 కోట్లకే పరిమితం చేసింది. అలాగే నిర్వహణ పద్దులోనూ వర్సిటీలు అడిగిన మేర నిధులివ్వలేదు.
♦ ఉస్మానియా యూనివర్సిటీకి నిర్వహణ పద్దు కింద రూ. 433 కోట్లు కావాలని అడిగితే రూ. 309.54 కోట్లు మాత్రమే ఇచ్చింది. అయితే గతేడాది కేటాయించిన రూ. 269.17 కోట్లకు అదనంగా నిధులు కేటాయించింది.
♦ శాతవాహన యూనివర్సిటీలో వేతనాలు, నిర్వహణకు నిర్వహణ పద్దు కింద రూ. 16.14 కోట్లు కావాలని అడిగితే..రూ. 8.71 కోట్లు (గతేడాది రూ. 7.57 కోట్లే) కేటాయించింది
♦ మహత్మాగాంధీ యూనివర్సిటీకి రూ. 22.65 కోట్లు అవసరమని ప్రతిపాదిస్తే రూ.19.50 కోట్లు (గతేడాది రూ. 16.95 కోట్లు) కేటాయించింది.
♦ తెలంగాణ యూనివర్సిటీకి రూ. 22.55 కోట్లు కావాలని అడిగితే ఎక్కువ మొత్తాన్నే రూ. 23.77 కోట్లు (గతేడాది రూ.20.67 కోట్లు) కేటాయించింది.
♦ తెలుగు యూనివర్సిటీకి రూ. 33.68 కోట్లు అవసరమని అడిగితే రూ.19.50 కోట్లు కేటాయించింది.
♦ కాకతీయ యూనివర్సిటీకి గతేడాది రూ. 75.76 కోట్లు కేటాయించగా, ఈసారి రూ. 87.12 కోట్లు కేటాయించింది.
♦ పాలమూరు విశ్వవిద్యాలయానికి గతేడాది రూ. 5.77 కోట్లు ఇవ్వగా ఈసారి రూ. 6.64 కోట్లు
♦ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి గతేడాది రూ.9.09 కోట్లు కేటాయించగా, ఈసారి రూ. 10.45 కోట్లు కేటాయించింది.
గురుకులాలకు రూ.2,713.55 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ విద్యలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నెలకొల్పిన గురుకుల పాఠశాలలకు బడ్జెట్ అంతంత మాత్రంగానే కేటాయించింది. గత రెండేళ్లలో కొత్తగా ఏర్పాటు చేసిన పాఠశాలలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. దీనికి తోడు పార్ట్‌టైమ్ టీచర్లతో నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో కొత్త భవనాలు, నియామకాలు చేపట్టాల్సి ఉంది.
కానీ తాజా బడ్జెట్‌లో కొత్త కేటాయింపులేవీ లేవు. కేవలం నిర్వహణ, ప్రస్తుతమున్న సిబ్బంది వేతనాలకు మాత్రమే రూ.2,713.55 కోట్లు కేటాయించింది. కొత్తగా ప్రారంభించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో తరగతుల సంఖ్య పెరగనుంది. దీంతో వ్యయం అధికం కానుంది. ఈ నేపథ్యంలో గతేడాది తరహాలోనే కేటాయింపులు జరపడంతో గురుకులాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పేలా లేవు.
విద్యా రంగానికి నిధులు నామమాత్రమే
సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేస్తామని ఊదరగొట్టిన ప్రభుత్వం బడ్జెట్‌లో మాత్రం దాని ప్రస్తావనే తేలేదని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాములు గురువారం ఆరోపించారు. విద్యారంగానికి 10 శాతం కూడా బడ్జెట్ కేటాయించలేదని పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పి.సరోత్తం రెడ్డి పేర్కొన్నారు. నామమాత్రపు బడ్జెట్ కేటాయింపులతో విద్యను ఎలా బలోపేతం చేస్తారని ఎస్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి భుజంగ రావు, జి.సదానందం గౌడ్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment