సాక్షి, అమరావతి:ఉన్నత విద్యను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ రంగానికి గతంలో కన్నా ఎక్కువ కేటాయింపులు చేసింది. వర్సిటీలు, కాలేజీ విద్య, సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి విభాగాలకు ఇతోధికంగా నిధులను కేటాయించింది. అత్యున్నత నైపుణ్యాలతో ప్రపంచస్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్రంలోని విద్యార్థులను తీర్చిదిద్దాలన్నది సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష.
అందుకనుగుణంగా ఉన్నత విద్యారంగానికి బడ్జెట్‌లో సముచిత స్థానం కల్పి స్తూ నిధులు కేటాయించారు. ఉన్నత విద్యలోని అన్ని విభాగాలకు రూ.2,064.71కోట్లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు రూ.1,166.64 కోట్లు కలిపి మొత్తంగా రూ.3,231.35 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. 2021–22లో ఉన్నత విద్యకు ప్రభుత్వం రూ.1,973.15 కోట్లు కేటాయించింది. ఆ ఏడాది కేటాయింపులకన్నా అధికంగా రూ.2,031.24 కోట్లు ఖర్చుపెట్టింది.
ఇక 2022–23లో రూ.2,014.30 కోట్లు కేటాయించగా ఈసారి అంతకన్నా అత్యధిక నిధులను బడ్జెట్‌లో పొందుపరిచింది. సంప్రదాయ వర్సిటీలకు, సాంకేతిక విశ్వవిద్యాలయాలకు ఈసారి బడ్జెట్‌లో నిధులు పెంచింది. రూసా కింద రూ.150 కోట్లతో వివిధ కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా ప్రత్యేకంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల భవనాల నిర్మాణం కోసం డిజిటల్ తరగతులు, వర్చువల్ లేబొరేటరీస్, ట్రైబల్ డిగ్రీ కాలేజీల కోసం అదనంగా రూ.9.98 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ కాలేజీల నిర్వహణ ఇతర అవసరాల కోసం రూ.785.89 కోట్లు కేటాయించింది.
(వివిధ ఆస్తుల కల్పనకు మూలధన కేటాయింపులు ఇలా..)
ఆదికవి నన్నయ వర్సిటీ 4.00
క్లస్టర్ వర్సిటీ 52.00
సెంట్రల్ వర్సిటీలకు మౌలిక సదుపాయాలు 12.66
అబ్దుల్‌హక్ ఉర్దూ వర్సిటీ 5.00
రూసా కింద భవనాల నిర్మాణం 150.00
రాయలసీమ వర్సిటీ 7.94
పద్మావతి మహిళా వర్సిటీ 1.35
ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, కురుపాం 33.00
Comments
Please login to add a commentAdd a comment