కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని.. మిషన్ కాకతీయ, భగీరథ కాంట్రాక్టులు ఆంధ్రా వ్యక్తులకు ఇచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. 1999కి ముందు అసలు కేసీఆర్ తెలంగాణ అనే పదం మాట్లాడలేదని, పలు పదవులు అనుభవించిన తర్వాత తెలంగాణ వాదం వినిపించారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 50 ఏళ్ల పాలనలో రూ. 70వేల కోట్ల అప్పు అయ్యిందని.. తెలంగాణ ఏర్పాటు తరువాత కేవలం మూడేళ్లలోనే రూ. 70వేల కోట్లు అప్పు చేసిన ఘనత కేసీఆర్‌దేనని ఎద్దేవా చేశారు.
గత నాలుగేళ్లు నిమ్మకు నీరెత్తనట్లు ప్రధాని నరేంద్ర మోదీ పాట పాడిన కేసీఆర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ప్లేట్ ఫిరాయించారని విమర్శించారు. గత నాలుగేళ్లుగా జనాభా ప్రాతిపదికన బడ్జెట్ వెచ్చించలేదని, రిజర్వేషన్లపై అలసత్వం వహించారన్నారు. మైనారిటీల హక్కులను కాపాడేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ బలం కేవలం 3శాతం మాత్రమేనని, మోదీ డైరెక్షన్‌లోనే కేసీఆర్ మూడో కూటమి తెరపైకి తెచ్చారని చెప్పారు. తలసాని శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వర రావు, మహేందర్ రెడ్డిలు ఎప్పుడైనా తెలంగాణ కోసం పోరాటాలు చేశారా అని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్షం లేకుండా శాసనసభ నడపడం కేసీఆర్‌కి మాత్రమే చెల్లుతుందని ఆయన ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment