
సాక్షి, కరీంనగర్: ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా సస్పెండ్ చేస్తే ఆత్మహత్యలే శరణ్యమని రేషనడీలర్లు శనివారం టీసీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏకపక్షంగా నియంతృత్వ ధోరణితో కేసీఆర్ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రేషన్ డీలర్లను తొలగిస్తే తొలగిపోయేది ప్రభుత్వమేనని అన్నారు. డీలర్లపై కక్షసాధింపు ధోరణి సహించమని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఐదేళ్ల కోసం తాత్కాలికంగా ఏర్పడిన ప్రభుత్వమేనని, డీలర్లు శాశ్విత ప్రాతిపదికన నియమించబడ్డారని అన్నారు.
ప్రభుత్వం భేషజాలకు పోకుండా డీలర్ల న్యాయమైన సమస్యను పరిష్కరించాలని కోరారు. నాలుగేళ్లుగా డీలర్లకు రావాల్సిన 417 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతినెల క్వింటాలకు ఇవ్వాల్సిన 87 రూపాయలను చెల్లించి, 30000 గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతున్న డీలర్ల డిమాండ్‌లపై కమిటీ వేయాలన్నారు. అవసరమైతే డీలర్ల సమస్యపై న్యాయపరంగా తాను పోరాడతానని జీవన్ రెడ్డి తెలిపారు.