TCLP
-
సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయండి..
-
తెలంగాణలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్లో సీఎల్పీని విలీనం చేయాలంటూ కాంగ్రెస్‌ను వీడిన 12మంది ఎమ్మెల్యేలు గురువారం తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పన్నెండు మంది ఎమ్మెల్యేలు తమ సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని స్పీకర్‌కు సమర్పించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, ఆత్రం సక్కు, హరిప్రియా, జాజుల సురేందర్, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య ఉన్నారు. తామంతా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, తమ నిర్ణయానికి ప్రజల మద్దతు కూడా ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగానే సీఎల్పీ విలీనం కోరుతున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. అలాగే వీరంతా అసెంబ్లీ కార్యదర్శిని కూడా కలవనున్నారు. కాగా గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే వీరిలో 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. వీరంతా అధికారికంగా టీఆర్ఎస్లో చేరనప్పటికీ వారు కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు కొనసాగించడం లేదు. ఇక ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క, పోడెం వీరయ్య, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రమే పార్టీలో ఉన్నారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఎంపీగా గెలవడంతో హుజుర్నగర్ శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయితే పోడెం వీరయ్య కూడా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఇక సాంకేతికంగా 12మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడితే... అసెంబ్లీలో సీఎల్పీ మనుగడ కష్టమే. మరోవైపు తాజా పరిణమాలు కాంగ్రెస్ సీనియర్ నేతలకు మింగుడపడటం లేదు. సీఎల్పీ కార్యాలయానికి చేరుకున్న భట్టి విక్రమార్క.. పార్టీ నేతలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అంతకు ముందు ఈ ఎమ్మెల్యేలంతా ...టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ప్రగతి భవన్లో కలిశారు. -
‘కేసీఆర్ రాచరిక పాలన కొనసాగిస్తున్నారు’
సాక్షి, కరీంనగర్: ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా సస్పెండ్ చేస్తే ఆత్మహత్యలే శరణ్యమని రేషనడీలర్లు శనివారం టీసీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏకపక్షంగా నియంతృత్వ ధోరణితో కేసీఆర్ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రేషన్ డీలర్లను తొలగిస్తే తొలగిపోయేది ప్రభుత్వమేనని అన్నారు. డీలర్లపై కక్షసాధింపు ధోరణి సహించమని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఐదేళ్ల కోసం తాత్కాలికంగా ఏర్పడిన ప్రభుత్వమేనని, డీలర్లు శాశ్విత ప్రాతిపదికన నియమించబడ్డారని అన్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా డీలర్ల న్యాయమైన సమస్యను పరిష్కరించాలని కోరారు. నాలుగేళ్లుగా డీలర్లకు రావాల్సిన 417 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతినెల క్వింటాలకు ఇవ్వాల్సిన 87 రూపాయలను చెల్లించి, 30000 గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతున్న డీలర్ల డిమాండ్లపై కమిటీ వేయాలన్నారు. అవసరమైతే డీలర్ల సమస్యపై న్యాయపరంగా తాను పోరాడతానని జీవన్ రెడ్డి తెలిపారు. -
‘సంబరాలు కాదు..సంక్షేమం కావాలి’
కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వం సంబరాలు జరపటం కాదు..సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేసి చూపాలని టీసీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. పథకాలకు అవసరమైనన్ని నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలకు నిధులు రూ.3,600 కోట్లు వెంటనే మంజూరు చేయాలని కోరారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రతిపక్షాలు 8 సీట్లు గెలుచుకుంటాయని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి..ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చి అన్ని సీట్లూ గెలుచుకోవాలని సవాల్ విసిరారు. -
ప్రభుత్వంపై ఇక పోరాటమే
హామీలపై నిలదీద్దాం: టీసీఎల్పీ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిందని, హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఇక పోరాటం చేయాల్సిందేనని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం నిర్ణయించింది. ఇప్పటిదాకా పట్టిన ఓపిక, సంయమనం చాలునని, ఇంకా ఉపేక్షించాల్సిన అవసరం లేదని ఏకగీవ్రంగా ప్రతిపాదించింది. బుధవారం ప్రతిపక్ష నాయకుడు కె.జానారెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలోని కమిటీ హాలులో సీఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇందులో చర్చించారు. ప్రభుత్వ విధానాలు, ప్రజలకిచ్చిన హామీలు, కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై సుమారు 4 గంటలపాటు చర్చించారు. శాసనసభ నిబంధనల(రూల్స్) కమిటీ ప్రతిపాదనలను ఈ సమావేశం వ్యతిరేకించింది. సమావేశం వివరాలను కాంగ్రెస్ విప్ వి.సంపత్‌కుమార్, ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి మీడియాకు వివరించారు. ఈపీఎఫ్ ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఈ భేటీలో కృతజ్ఞతలు తెలియజేసినట్టు వివరించారు. విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాల్లో అవినీతి, మిషన్ భగీరథ టెండర్లలో అవినీతి, ప్రాణహిత డిజైన్ మార్పు, అంచనాల పెంపులో అవినీతి, పాలమూరు-రంగారెడ్డి పథకం వంటి వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించినట్టుగా వారు వివరించారు. పంట రుణాలు ఒకేసారి మాఫీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. టీచరు పోస్టుల భర్తీలో అయోమయం, కొత్త జిల్లా ఏర్పాటు హామీ వంటి వాటిపై అసెంబ్లీలో పోరాడుతామని చెప్పారు. జనం తాగునీటి కోసం అల్లాడుతున్నా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోకుండా సచివాలయం, అసెంబ్లీ భవనాలను కొత్తగా కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిపై నిలదీస్తామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో కొత్తదనం ఏమిటో చెప్పాలన్నారు. ప్రాణహితకు జాతీయ హోదా కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకుపోవడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టులతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలకు పేర్లు మార్చడంపైనా నిలదీస్తామన్నారు. నిరసన తెలియజేస్తే సస్పెండా? గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలియజేస్తే ఏడాదిపాటు సస్పెండ్ చేయాలంటూ శాసనసభ నిబంధనల కమిటీలో ప్రతిపాదించడాన్ని సీఎల్పీ సమావేశం తీవ్రంగా వ్యతిరేకించినట్టు సంపత్‌కుమార్, రామ్మోహన్ రెడ్డి చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలుంటే అభినందిస్తామని, అవాస్తవాలు ఉంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం సభ్యుల నిరసనకు అవకాశం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో తయారు చేసిన రూల్స్‌ను శాసనసభలో అమలు చేస్తామంటే అంగీకరించేది లేదన్నారు. జానాపై విమర్శలు సరికాదు ప్రతిపక్ష నేత కె.జానారెడ్డిపై పార్టీకి చెందిన సీనియర్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఇది సరి కాదని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు వ్యాఖ్యానించినట్టుగా తెలిసింది. జానారెడ్డి వ్యవహారశైలిపై జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి వంటి సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయన్నారు. దీనికి సమాధానంగా సీనియర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై పోరాడాలని, పార్టీ గొంతుకను వినిపించాలన్నారు తప్ప వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదని సమాధానమిచ్చారు. కీలక అంశాలపై నిపుణులతో చర్చలు అసెంబ్లీలో సాగు, తాగునీరు, విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాలు, వ్యవసాయం వంటి కీలకమైన అంశాలపై చర్చ సమయంలో... పార్టీ సీనియర్లు, మాజీ మంత్రులు, ఎప్పటికప్పుడు నిపుణులతో చర్చలు జరపాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు సీఎల్పీలో మాజీ మంత్రులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు కోరారు. దీనివల్ల ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో మంచి చెడులు, వాస్తవాలు అనుభవం ఉన్నవారికి సులభంగా అర్థమవుతాయన్నారు. ప్రభుత్వాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి అనుభవ జ్ఞుల సూచనలు అవసరమవుతాయని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. పాలేరును ఏకగ్రీవం చేద్దాం కాంగ్రెస్ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ రాంరెడ్డి వెంకట్‌రెడ్డికి శాసనసభా పక్షం నివాళులు అర్పించింది. అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు మూడేళ్లే ఉన్నందున ఆయన కుటుంబ సభ్యులకు ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలని అన్ని పక్షాలను కోరాలని సమావేశం నిర్ణయించింది. అయితే గతంలో నారాయణఖేడ్‌లో కిష్టారెడ్డి అకాల మరణం చెందినా ఏకగ్రీవం చేయకుండా టీఆర్ఎస్ పోటీకి దిగిందని పలువురు సభ్యులు గుర్తుచేశారు. పాలేరులోనూ ఇదే వైఖరి ప్రదర్శించవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అదే జరిగితే పార్టీ శ్రేణులను పోటీకి సిద్ధం చేయాలని కోరారు. -
సమాచారమే ఇచ్చారు...ఆహ్వానించలేదు: వీహెచ్
హైదరాబాద్ : టీసీఎల్పీ సమావేశం ఉందని తనకు సమాచారం మాత్రమే ఇచ్చారని, అయితే సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానించలేదని రాజ్యసభ సభ్యుడు, రాజ్యసభ ఎంపీ వీ హనుమంతరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుంటే కాంగ్రెస్ కేడర్‌లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోందని ఆయన సోమవారమిక్కడ అన్నారు. వలసలను కట్టడి చేయటం...పార్టీని బలోపేతం చేయడంపై ప్రస్తుత, మాజీ ఎంపీలను ఈనెల 9వ తేదీన ప్రత్యేకంగా భేటీ అవుతున్నట్లు వీహెచ్ తెలిపారు. కాగా ఈనెల 5వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీసీఎల్పీ భేటీ అయిన విషయం తెలిసిందే. -
టిసిఎల్పి న్యాయపోరాటం
హైదరాబాద్: పోలవరం ఆర్డినెన్స్‌పై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(టిసిఎల్పి) నిర్ణయించింది. అసెంబ్లీ కమిటీ హాల్లో టిసిఎల్పి సమావేశం ముగిసింది. పోలవరం ఆర్డినెన్స్‌పై పోరాడాలని తీర్మానించారు. ఆర్డినెన్స్‌ను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు చట్ట సభల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ పోరాడాలని నిర్ణయించారు. పోలవరం బోర్డులో తెలంగాణకు అవకాశం ఇవ్వకపోవడాన్ని ఒక తీర్మానం ద్వారా ఖండించారు. టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టేందుకు చురుగ్గా ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు.