ప్రభుత్వంపై ఇక పోరాటమే
హామీలపై నిలదీద్దాం: టీసీఎల్పీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిందని, హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఇక పోరాటం చేయాల్సిందేనని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం నిర్ణయించింది. ఇప్పటిదాకా పట్టిన ఓపిక, సంయమనం చాలునని, ఇంకా ఉపేక్షించాల్సిన అవసరం లేదని ఏకగీవ్రంగా ప్రతిపాదించింది. బుధవారం ప్రతిపక్ష నాయకుడు కె.జానారెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలోని కమిటీ హాలులో సీఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇందులో చర్చించారు. ప్రభుత్వ విధానాలు, ప్రజలకిచ్చిన హామీలు, కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై సుమారు 4 గంటలపాటు చర్చించారు. శాసనసభ నిబంధనల(రూల్స్) కమిటీ ప్రతిపాదనలను ఈ సమావేశం వ్యతిరేకించింది. సమావేశం వివరాలను కాంగ్రెస్ విప్ వి.సంపత్‌కుమార్, ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి మీడియాకు వివరించారు.
ఈపీఎఫ్ ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఈ భేటీలో కృతజ్ఞతలు తెలియజేసినట్టు వివరించారు. విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాల్లో అవినీతి, మిషన్ భగీరథ టెండర్లలో అవినీతి, ప్రాణహిత డిజైన్ మార్పు, అంచనాల పెంపులో అవినీతి, పాలమూరు-రంగారెడ్డి పథకం వంటి వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించినట్టుగా వారు వివరించారు. పంట రుణాలు ఒకేసారి మాఫీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. టీచరు పోస్టుల భర్తీలో అయోమయం, కొత్త జిల్లా ఏర్పాటు హామీ వంటి వాటిపై అసెంబ్లీలో పోరాడుతామని చెప్పారు. జనం తాగునీటి కోసం అల్లాడుతున్నా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోకుండా సచివాలయం, అసెంబ్లీ భవనాలను కొత్తగా కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిపై నిలదీస్తామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో కొత్తదనం ఏమిటో చెప్పాలన్నారు. ప్రాణహితకు జాతీయ హోదా కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకుపోవడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టులతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలకు పేర్లు మార్చడంపైనా నిలదీస్తామన్నారు.
నిరసన తెలియజేస్తే సస్పెండా?
గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలియజేస్తే ఏడాదిపాటు సస్పెండ్ చేయాలంటూ శాసనసభ నిబంధనల కమిటీలో ప్రతిపాదించడాన్ని సీఎల్పీ సమావేశం తీవ్రంగా వ్యతిరేకించినట్టు సంపత్‌కుమార్, రామ్మోహన్ రెడ్డి చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలుంటే అభినందిస్తామని, అవాస్తవాలు ఉంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం సభ్యుల నిరసనకు అవకాశం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో తయారు చేసిన రూల్స్‌ను శాసనసభలో అమలు చేస్తామంటే అంగీకరించేది లేదన్నారు.
జానాపై విమర్శలు సరికాదు
ప్రతిపక్ష నేత కె.జానారెడ్డిపై పార్టీకి చెందిన సీనియర్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఇది సరి కాదని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు వ్యాఖ్యానించినట్టుగా తెలిసింది. జానారెడ్డి వ్యవహారశైలిపై జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి వంటి సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయన్నారు. దీనికి సమాధానంగా సీనియర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై పోరాడాలని, పార్టీ గొంతుకను వినిపించాలన్నారు తప్ప వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదని సమాధానమిచ్చారు.
కీలక అంశాలపై నిపుణులతో చర్చలు
అసెంబ్లీలో సాగు, తాగునీరు, విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాలు, వ్యవసాయం వంటి కీలకమైన అంశాలపై చర్చ సమయంలో... పార్టీ సీనియర్లు, మాజీ మంత్రులు, ఎప్పటికప్పుడు నిపుణులతో చర్చలు జరపాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు సీఎల్పీలో మాజీ మంత్రులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు కోరారు. దీనివల్ల ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో మంచి చెడులు, వాస్తవాలు అనుభవం ఉన్నవారికి సులభంగా అర్థమవుతాయన్నారు. ప్రభుత్వాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి అనుభవ జ్ఞుల సూచనలు అవసరమవుతాయని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు.
పాలేరును ఏకగ్రీవం చేద్దాం
కాంగ్రెస్ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ రాంరెడ్డి వెంకట్‌రెడ్డికి శాసనసభా పక్షం నివాళులు అర్పించింది. అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు మూడేళ్లే ఉన్నందున ఆయన కుటుంబ సభ్యులకు ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలని అన్ని పక్షాలను కోరాలని సమావేశం నిర్ణయించింది. అయితే గతంలో నారాయణఖేడ్‌లో కిష్టారెడ్డి అకాల మరణం చెందినా ఏకగ్రీవం చేయకుండా టీఆర్‌ఎస్ పోటీకి దిగిందని పలువురు సభ్యులు గుర్తుచేశారు. పాలేరులోనూ ఇదే వైఖరి ప్రదర్శించవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అదే జరిగితే పార్టీ శ్రేణులను పోటీకి సిద్ధం చేయాలని కోరారు.