సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పావులా మారారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ నాలుగేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వానికి టీఆర్‌ఎస్ అనేకసార్లు మద్దతు తెలిపింది. ఇపుడు ఎన్డీఏపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది కాబట్టి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆగమాగం అవుతోందన్నారు. కేసీఆర్ శిఖండి పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. గిరిజన రిజర్వేషన్ బిల్లుపై కేంద్రంపై నెపం నెడుతూ దోబూచులాడుతోందన్నారు.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రావాల్సిన హక్కులను కాలరాస్తూ టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఆందోళన చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసానికి టీఆర్‌ఎస్ మద్దతు తెలిపి తెలంగాణ హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెల్‌లోకి వెళ్లలేదు.. కానీ పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ నేతలు స్పీకర్ మొహంపై ప్లకార్డులు పెట్టి నిరసన తెలుపుతున్నారని.. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని ఆయన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment