సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల షెడ్యూల్ విడుదలైంది. శుక్రవారం నుంచి జూన్ 15 వరకు బదిలీల షెడ్యూల్ ఖరారు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకు ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. నిబంధనల ప్రకారం ఒకే చోట ఐదేళ్లకు పైబడి పనిచేస్తున్న వారిని కచ్చితంగా బదిలీ చేయనున్నారు. కనీసం రెండేళ్లకు పైబడి ఒకేచోట ఉన్న వారే బదిలీలకు అర్హులవుతారు. ఏ కేడర్‌లోనైనా బదిలీలు 40 శాతం మించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాత జిల్లాలు, జోనల్, మల్టీ జోనల్ కేడర్‌కు అనుగుణంగానే బదిలీల ప్రక్రియ చేపడతారు.
భార్యాభర్తలు, 2019 మే నెలాఖరులోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులు, 70 శాతానికి పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులు, మానసిక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలున్న వారు, కారుణ్య నియామకాల కింద ఉద్యోగం పొందిన వితంతువులు, తీవ్ర అనారోగ్యానికి గురైన వారు, దీర్ఘకాలంగా మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. బదిలీల కోసం ఉద్యోగుల నుంచి ఆప్షన్స్ తీసుకొని ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా పారదర్శక విధానంలో ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమున్న మేరకు మారుమూల ప్రాంతాల్లో పనిచేసేందుకు వెళ్లేందుకు ఆప్షన్లు ఇవ్వకపోతే లాటరీ పద్ధతిలో ఉద్యోగులను ఎంపిక చేసి బదిలీ చేస్తారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నుంచే అన్ని విభాగాల ఖాళీల వివరాలు, కచ్చితంగా బదిలీ అయ్యే ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేసి ప్రచురిస్తారు.
జూన్ 16 నుంచి నిషేధం అమల్లోకి
జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు ఉద్యోగులు బదిలీ కోరుతూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఐదు ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. 6వ తేదీ నుంచి 12 వరకు దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ప్రక్రియ పూర్తి చేస్తారు. 13 నుంచి 15 వరకు బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయి. బదిలీ అయిన ఉద్యోగులను ఆయా శాఖలు మూడు రోజుల్లోగా రిలీవ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే రిలీవ్ చేసినట్లుగానే భావించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 16 నుంచి సాధారణ బదిలీలపై నిషేధం మళ్లీ అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించింది.
రాష్ట్రస్థాయి పోస్టుల బదిలీలకు ఆయా శాఖల కార్యదర్శుల నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. మల్టీ జోనల్ పోస్టులకు సంబంధిత శాఖాధిపతి, జిల్లా కేడర్ పోస్టులకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీలు బదిలీ ప్రక్రియను చేపడుతాయి. విద్య, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు–రిజిస్ట్రేషన్లు, రవాణా, అటవీ, పోలీస్ శాఖలు బదిలీలకు విడిగా విధానాలు రూపొందించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment