సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మిగులు రాష్ట్రాన్నిఅప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పనితీరుపై కాగ్ ప్రకటించిన రిపోర్టును ప్రజల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అదనపు ఖర్చుతో అవసరానికి మించి విద్యుత్ కొనుగోళ్లు జరిపారని తెలిపారు. విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హడ్కో నుంచి తెచ్చిన అప్పును ఆదాయంగా చూపారని, ఈ విషయాలపై కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుందనే తమ పార్టీ సభ్యులను సస్పెండ్ చేశారన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టకముందే సభ్యులపై వేటు వేసిన చరిత్ర టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని ఆరోపించారు. ప్రమాదకరమైన ఆనవాయితీ తెలంగాణ సర్కార్ తెరలేపిందని, దీనిపై ప్రజాస్వామ్య వాదులంతా చర్చించాలన్నారు.
కాంగ్రెస్‌తో పోలికా..?
కాంగ్రెస్ థర్డ్ గ్రేడ్ పార్టీ అంటూ కేటీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. టీఆర్‌ఎస్ అంటున్న ఆ థర్డ్ గ్రేడ్ పార్టీనే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది.. తెలంగాణ ఇచ్చిందన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన పార్టీ గురించి తెలియని కేటీఆర్ లేకి మాటలు మాట్లాడుతున్నారన్నారు. ‘నెహ్రు క్యాబినెట్‌లో ఇందిరా లేరు.. నెహ్రూ 16 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. ఇందిరా క్యాబినెట్‌లో రాజీవ్ లేరు. రాజీవ్ క్యాబినెట్‌లో కూడా ఇతర కుటుంబసభ్యులు లేరు.. ప్రధాని అవకాశం వచ్చినా మన్మోహన్ ను ప్రధాని చేసిన ఘనత సోనియాది. మన్మోహన్ క్యాబినెట్‌లోను రాహుల్‌కు అవకాశం ఉన్నా చేరలేదు. 10 ఏళ్ళు అవకాశం ఉన్నా ప్రధాని కాలేదు’ అన్నారు. కేటీఆర్‌కు కాంగ్రెస్తో పోల్చుకునే అర్హత లేదని, కేసీఆర్ పాలన కుటుంబ సభ్యులతో నిండిపోయిందన్నారు.
కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు ఇవ్వాల్సిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. నా వారసులు వస్తున్నారని తప్పుడు వార్తలు రాయవద్దని సూచించారు. పార్టీ తరఫునే పాదయాత్ర చేస్తున్నా.. వ్యక్తిగతంగా కాదని స్పష్టం చేశారు. పాదయాత్ర పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామన్నారు. సభ్యుల సభ్యత్వం రద్దు విషయంలో అడ్వకేట్ జనరల ఎందుకు రాజీనామా చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఈ సందర్బంగా ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment