గోదావరిఖని (రామగుండం): రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబమే బంగారంగా మారుతోందని, ప్రజలు కోరుకున్న బంగారు తెలంగాణ ఏర్పాటవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని అప్పు ల మయంగా మార్చిన కేసీఆర్‌కు సీఎం పదవి లో కొనసాగే నైతిక అర్హత లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో అంకెల గారడి బడ్జెట్ ప్రవేశపెట్టిందని, అప్పు లను ఆదాయంగా చూపిస్తూ బ్యాంకులు, ఆర్థిక సంఘాలను మోసం చేసిందని కాగ్ ఇచ్చిన నివేదికతో సీఎం పనితీరేంటో తెలిసిందనిదు య్యబట్టారు. దళితులు, గిరిజనులకు సంబంధించిన రూ.10 వేల కోట్లను దారి మళ్లించారని, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల స్థలం విషయంలో నూ కాగ్ తప్పుబట్టిందని నిప్పులు చెరిగారు. రెండో విడత ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వహించిన బహిరంగ సభలో ఉత్తమ్ పాల్గొ ని మాట్లాడారు. ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల్లోకి దించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని విమర్శించారు. రూ.లక్షా 74 వేల కోట్ల అభివృద్ధిపై శాసనసభలో ప్రతిపక్షాలు మాట్లాడితే గొంతునొక్కి ఇద్దరు శాసనసభ్యుల్ని గెంటేశారని, ప్రజాస్వామ్యంలో ఇది మా యని మచ్చగా మారిందని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరించాలని కోరారు.
నిరుద్యోగ భృతి రూ.3 వేలు..
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని, ప్రీమియం భారం రైతులపై పడకుండా ప్రభుత్వమే భరిస్తుందని, పంటకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఉత్తమ్ హామీ ఇచ్చారు. వరి, జొన్న, మొక్కజొన్న రూ.2 వేలకు తక్కువ కాకుండా.. మిర్చి, పసుపు రూ.10 వేలు, ఎర్రజొన్నలు రూ.3 వేలకు తక్కువ కాకుండా కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రంలో 6 లక్షల మహిళా సంఘాలున్నాయని, ప్రతి సంఘానికి రూ.లక్ష రివాల్వింగ్ ఫండ్‌ను తిరిగి చెల్లించకుండా ఇప్పిస్తామని, రూ.10 లక్షల బ్యాంకు రుణం ఇప్పిం చి వడ్డీ భారమూ ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. రూ.1,000కి తగ్గకుండా అభయహస్తం పింఛన్ పునరుద్ధరిస్తామని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామని, లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తూ నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతిని ఇప్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
అప్పుడలా.. ఇప్పుడిలానా..?: కుంతియా
అవినీతిమయంగా మారిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి 2019 ఎన్నికల్లో సింగరేణి కార్మికులు, ప్రజలు గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, ఐఎన్‌టీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు రామచంద్ర కుంతియా పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్‌రావు కుర్చీలు లేపారని, పేపర్లు చించేశారని.. కానీ నేడు విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలపడాన్ని తప్పుగా చూపిస్తూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌లను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు.
ఆర్థిక శాఖను మోసం చేసిన విషయంలో కోర్టుకు వెళతాం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ‘‘సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. అప్పులను ఆదాయంగా చూపించి మరిన్ని అప్పులు తీసుకొచ్చేందుకు, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకునేందుకు అంకెల గారడీతో ఆర్థిక శాఖను మోసం చేసిన కేసీఆర్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని యోచిస్తున్నాం..’’అని ఉత్తమ్ తెలిపారు. టీపీసీసీ ఆధ్వర్యంలో రెండో విడత బస్సుయాత్ర ప్రారంభిస్తున్న సందర్భంగా ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్‌కు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కేసీఆర్ ప్రతిరోజు అబద్ధాలు చెబుతున్నారని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధం కావాలని సీనియర్ నేత షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు.
ఫేస్‌బుక్ లైవ్‌లో ఉత్తమ్!
ఉత్తమ్ ఆదివారం ఫేస్‌బుక్ లైవ్‌లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలతో మాట్లాడారు. ప్రజా సమస్యలు తీర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తూ నాలుగేళ్లుగా రైతులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. గత 60 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు 60 వేల కోట్ల అప్పు చేస్తే.. కేసీఆర్ నాలుగేళ్లలో రెండు లక్షల కోట్లకు చేర్చారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment