సాక్షి, హైదరాబాద్
భారీ స్థాయిలో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా 14 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అనుమతివ్వాలంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఆర్థిక శాఖ ప్రతిపాదనలు పంపింది. జిల్లాల పునర్విభజన సమయంలో 18 వేల కానిస్టేబుల్ పోస్టులు అవసరమని మంత్రి మండలి నిర్ణయం తీసుకోగా.. ప్రస్తుతం ఆ పోస్టుల అనుమతి కోసమే సీఎం వద్దకు ఫైలు వెళ్లింది. 3,897 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ 2017 నవంబర్‌లోనే ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నియామక ప్రక్రియను విడతల వారీగా చేపట్టేందుకు పోలీస్ శాఖ సమాయత్తమవుతోంది.
వచ్చే అనుమతి ఉత్తర్వులను బట్టి రెండు దశల్లో నియామకాలు చేపట్టాలని, ట్రైనింగ్ సెంటర్లు కూడా ఒత్తిడి లేకుండా సమయానుకూలంగా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చని భావిస్తోంది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి సైతం నియామకాలపై ఇటీవల క్లారిటీ ఇచ్చారు. మరోవైపు 2018ని టెక్నాలజీ ఇయర్‌గా ప్రకటించిన పోలీస్ శాఖ.. అదే స్థాయిలో శిక్షణ వ్యవహారాలూ ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాగా, 2015లో 9,281 కానిస్టేబుల్, 538 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన పోలీస్ శాఖ.. నియామకం పూర్తి చేసి ఎంపికైన వారికి ప్రస్తుతం శిక్షణ ఇస్తోంది. కానిస్టేబుళ్ల శిక్షణ ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి కాబోతోంది. ఎస్సైలకు మరో 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment