సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 14,177 పోస్టులకు నియామకాలు జరుపుకునేందుకు డీజీపీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు అనుమతించింది. వీటిలో 1,210 సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులతో పాటు, 26 అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులు, 12,941 కానిస్టేబుల్ పోస్టులున్నాయి.
అతి త్వరలోనే నోటిఫికేషన్...
ఆర్థిక శాఖ నుంచి పోస్టుల భర్తీకి ఉత్తర్వులు పొందిన పోలీస్ శాఖ అతి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రిజర్వేషన్లు, వయోపరిమితి సడలింపు.. తదితర అంశాలపై స్పష్టత కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. గతంలో జరిగిన రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన అభ్యర్థులు వారం క్రితమే శిక్షణ పూర్తిచేసుకొని ఉద్యోగాల్లో చేరారని తెలిపారు. నోటిఫికేషన్ జారీచేసిన నాటి నుంచి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏడాది సమయం పడుతుందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment