10,000 కానిస్టేబుల్ పోస్టులు
ఏఆర్, సివిల్, వివిధ బెటాలియన్ల భర్తీ
- మంత్రివర్గ ఆమోదంతో భారీగా నియామకాలకు రంగం సిద్ధం
- ఆగస్టు రెండో వారంలో నియామక ప్రక్రియ ప్రారంభం!
- స్పెషల్ పోలీస్, కమ్యూనికేషన్ విభాగాల్లోనూ పలు పోస్టులు
- కసరత్తు మొదలుపెట్టిన పోలీసు శాఖ
- జీఏడీ అనుమతి, ఆర్థిక శాఖ ఉత్తర్వులు అందగానే ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖలో భారీగా నియామకాలకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన లోటు, జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అవసరమైన కొత్త పోస్టులు, టెక్నాలజీకి తగినట్లుగా కావాల్సిన సిబ్బందిని నియమించుకునేందుకు కసరత్తు మొదలైంది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన 26,290 పోస్టుల్లో తొలిదశగా దాదాపు 10 వేల పోస్టుల్లో నియామకాలు జరిపేందుకు ప్రక్రియ ప్రారంభిస్తోంది.
తెలంగాణ ఏర్పాటయ్యాక జరిగిన నియామకాల్లో పోలీసు శాఖదే సింహభాగం. ప్రభుత్వం 2015లో 10 వేలకు పైగా కానిస్టేబుల్, ఫైర్‌మన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. ఫిబ్రవరిలో తుది పరీక్ష ఫలితాలు ప్రకటించి, ఎంపికైనవారిని నెలన్నర క్రితం శిక్షణకు సైతం పంపించింది. 539 ఎస్సై పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహించగా.. త్వరలోనే ఫలితాలు వెల్లడించనుంది. తాజాగా మంత్రివర్గం ఆమోదించిన పోస్టుల్లో.. 10 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. సివిల్, ఏఆర్, బెటాలియన్, స్పెషల్ పోలీస్, కమ్యూనికేషన్ తదితర విభాగాల్లో ఈ నియామకాల కోసం ఏర్పాట్లు చేయాలని సూత్రప్రాయంగా ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది.
ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఇద్దరు డ్రైవర్లు
పోలీసు శాఖలో బందోబస్తు, గన్‌మన్లు, డ్రైవర్లు వంటివారు అత్యధికంగా ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగం నుంచే ఉంటారు. తాజాగా ఈ విభాగంలోనే నాలుగు వేలకుపైగా నియమకాలు జరపాలని భావిస్తున్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లను డ్రైవర్లుగా పంపించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
కోట్ల రూపాయలు వెచ్చించి నూతనంగా కొనుగోలు చేసిన అత్యాధునిక వాహనాల భద్రత నిమిత్తం వారిని రోజుకొకరి చొప్పున ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పుడు పాత జిల్లాల నుంచే కొంత మంది సిబ్బందిని విభజించి వాటికి ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌ను ఏర్పాటు చేశారు. దానివల్ల సిబ్బంది కొరత ఏర్పడడంతో ఏఆర్ బలగాలను పెంచాలని నిర్ణయించారు.
ప్రత్యేక బలగాలకు సైతం
రాష్ట్ర విభజన తర్వాత గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సీఐడీ, ఇంటెలిజెన్స్, ఐఎస్‌డబ్ల్యూ, పీటీసీ, కమ్యూనికేషన్స్, ఏసీబీ... తదితర విభాగాల్లో సిబ్బంది కొరత ఏర్పడింది. ఆ విభాగాలను పటిష్టం చేయాలంటే సిబ్బందిని పెంచాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా భర్తీ చేయనున్న పోస్టుల్లో దాదాపు సగం వరకు సివిల్, బెటాలియన్లకు కేటాయించనున్నారు. కమ్యూనికేషన్ తదితర విభాగాల్లో మిగతా పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిసింది.
ఆర్థిక శాఖ ఉత్తర్వులే తరువాయి
కేబినెట్ ఆమోదించిన పోస్టుల్లో మొదటి దఫా నియామకాలపై ప్రభుత్వ ఆదేశాల కోసం వేచిచేస్తున్నామని సీనియర్ ఐపీఎస్ ఒకరు తెలిపారు. జీఏడీ నుంచి కొత్త పోస్టుల ఆమోదానికి సంబంధించి ఆదేశాలు వచ్చాక.. ఆర్థిక నుంచి అనుమతి రావల్సి ఉంటుందని.. ఇందుకు కనీసం 20 రోజులు పడుతుందని చెప్పారు. తర్వాత తమ కార్యచరణ ఉంటుందని, ఆగస్టు మొదటి లేదా రెండో వారానికి కల్లా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు.