Telangana Budget 2021-22: పట్టాలెక్కని ఎంఎంటీఎస్‌! - Sakshi
Sakshi News home page

తెలంగాణ బడ్జెట్‌: ‘గ్రేటర్’‌కు సర్కారు వారి పాట

Published Fri, Mar 19 2021 8:16 AM | Last Updated on Fri, Mar 19 2021 11:25 AM

Telangana Budget: Metro Rail Project For Rs 1000 Crore - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ వాసుల కలల మెట్రోకు తాజా బడ్జెట్‌లో కాసుల వర్షం కురిసింది. మెట్రోకు రూ.వెయ్యి కోట్ల నిధులను కేటాయించడంతో ఎంజీబీఎస్‌–పాత నగరం (5.3 కి.మీ), రాయదుర్గం– శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (31 కి.మీ) మార్గంలో మెట్రో కూత పెడుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గత మూడేళ్లుగా మెట్రోకు రాష్ట్ర సర్కారు మొండిచేయి చూపడంతో హైదరాబాద్‌ మెట్రోరైలు (హెచ్‌ఎంఆర్‌) అభివృద్ధి ప్రణాళికలు, ప్రయాణికుల వసతుల కల్పన ప్రాజెక్టులు అటకెక్కిన విషయం విదితమే.

చివరకు హెచ్‌ఎంఆర్‌ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు కూడా నిధులు లేని దుస్థితి నెలకొన్న తరుణంలో తాజా బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించడం విశేషం. తొలి విడత మెట్రో ప్రాజెక్టులో ఎంజీబీఎస్‌– ఫలక్‌నుమా మార్గంలో మెట్రో విస్తరణ పనులు నిధుల లేమి కారణంగా పట్టాలెక్కని విషయం విదితమే. రాయదుర్గం– శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తాజాగా ప్రభుత్వం కేటాయించిన నిధులతో మొదలవుతాయని మెట్రో వర్గాలు తెలిపాయి. 

పట్టాలెక్కని ఎంఎంటీఎస్‌! 
ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో మొండిచెయ్యే దక్కింది. ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. నిధుల కొరతతో ఇప్పటికే చాలా చోట్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని రూట్లలో రైల్వే లైన్‌ల నిర్మాణం, విద్యుదీకరణ పూర్తయినా కొత్త రైళ్ల కొనుగోళ్లకు నిధులు లేక  పట్టాలు అలంకారప్రాయంగా మారాయి. అయిదేళ్ల క్రితం రూ.850 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్రం తన వాటాగా 2/3 వంతు చొప్పున సుమారు రూ.550 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు దశలవారీగా రూ.130 కోట్లు మాత్రమే ఇచ్చింది.

రైల్వేశాఖ సొంత నిధులతోనే చాలావరకు పనులు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులు లేక కొంతకాలంగా రైల్వేశాఖ సైతం చేతులెత్తేయడంతో పనులు స్తంభించాయి. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్రతిపాదించిన యాదాద్రి ఎంఎంటీఎస్‌కు సైతం నిధులు కేటాయించకపోవడం గమనార్హం. ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి వరకు నిర్మించదలచిన ఈ ప్రాజెక్టు మూడేళ్ల క్రితమే సర్వే పూర్తయింది.   

ప్రగతిరథ చక్రం రయ్‌ రయ్‌ 
సిటీ బస్సుకు ఊరట లభించింది. పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న  ఆర్టీసీకి ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. రెండేళ్లుగా ఆర్థిక నష్టాలతో పాటు  ప్రయాణికుల ఆదరణను సైతం కోల్పోయిన ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పునర్వైభవాన్ని సంతరించుకొనే అవకాశం ఉన్నట్లు  అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రూ.1500 కోట్ల బడ్జెట్‌  కేటాయింపులతో పాటు, మరో రూ.1500 కోట్ల బడ్జెటేతర సహాయం అందజేయనుంది. దీంతో  గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇప్పటికే  ప్రతిపాదించిన 25 డబుల్‌  డెక్కర్‌ బస్సులతో పాటు ఎలక్ట్రిక్‌ బస్సులు సైతం ప్రయాణికులకు అందుబాటులోకి  రానున్నాయి. తాజా కేటాయింపులతో బస్సుల కొనుగోళ్లు వేగంగా జరిగే అవకాశం ఉంది.

‘ఆర్టీసీకి ఇది అన్ని విధాలా సానుకూల సమయం. సకాలంలోనే డబుల్‌ డెక్కర్‌ బస్సులు రోడ్డెక్కుతాయి’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కేటాయింపులతో కొత్త  బస్సులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  గ్రేటర్‌లో పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఎలక్ట్రిక్‌ బస్సులు కొనుగోలు చేయడంతో పాటు ఇప్పుడు ఉన్న బస్సులను కూడా ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్చే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ సంవత్సరం కొంత ప్రగతి సాధించే అవకాశముంది.  

‘మహా’ అత్తెసరు!  
హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కొనసాగిస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులపై తాజా బడ్జెట్‌ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. నగరవాసుల ట్రాఫిక్‌ కష్టాలను తీర్చే బాలానగర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులతో పాటు మెహిదీపట్నం, ఉప్పల్‌లో స్కైవే, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ర్యాంపులు, చెరువులు సుందరీకరణ, నెక్లెస్‌ రో డ్డులో అభివృద్ధి పనులు చేస్తున్న హెచ్‌ఎండీఏకు ఈ బడ్జెట్‌లో అభివృద్ధి కార్యకలాపాల కోసం కేవలం రూ.10 లక్ష లు మాత్రమే కేటాయించడం అధికారులను విస్మయపరిచింది. ఎప్పటిలాగానే ఈసారి కూడా హెచ్‌ఎండీఏ సొంత ఆదాయంతోనే పనులను ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు రూ.900 కోట్లపైగా అంచనా వ్యయంతో జరుగుతున్న ఈ పనులకు ఇక హెచ్‌ఎండీఏ అటు కోకాపేట, ఇటు మూసాపేట భూముల విక్రయాలపై వచ్చే ఆదాయమే ఆధారం కానుంది.

158 కి.మీ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం  చేపట్టిన కాంట్రాక్టర్లకు 2011 నుంచి ప్రతి ఏడాది బీఓటీ అన్యూటి పేమెంట్‌ రెండు వాయిదాల్లో రూ.331.38 కోట్లు చెల్లిస్తోంది. 2016 నుంచి రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని తీసుకొచ్చిన హెచ్‌ఎండీఏ కాంట్రాక్టర్లకు రూ.440 కోట్లు చెల్లించింది. గతేడాది  ఓఆర్‌ఆర్‌ బీవోటీ అన్యూటి పేమెంట్‌ల కింద గతంలో పెండింగ్‌లో ఉన్న వాటితో కలుపుకొని రూ.1687 కోట్లు కేటాయించాలని హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలిస్తే కేవలం రూ.20 లక్షలు మాత్రమే కేటాయించింది. ఈసారి జైకా రుణం చెల్లింపుల కోసం రూ.478 కోట్లు అడిగితే రూ.472 కోట్లు కేటాయించారు. 2022 డిసెంబర్‌తో రుణాల చెల్లింపు ముగియనుంది.  

ఆర్‌ఆర్‌ఆర్‌.. హుషార్‌: భూసేకరణకు రూ.750 కోట్లు  
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణానికిగాను భూ సేకరణ కోసం ప్రభుత్వం రూ.750 కోట్లు కేటాయించింది. మహానగరం చుట్టూ విస్తరించిన ప్రధాన పట్టణాలను కలుపుతూ సుమారు 330 కి.మీ మేర ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రెండు భాగాలుగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌.. దక్షిణ మార్గం రంగారెడ్డి జిల్లా మీదుగా వెళ్లనుంది. చేవెళ్ల, షాబాద్, షాద్‌నగర్, కడ్తాల్, యాచారం మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ వద్ద కలుస్తుంది. సుమారు 120 కి.మీ పరిధి రంగారెడ్డి జిల్లాలో ఉండనుంది. దక్షిణ మార్గానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించలేదు.

చౌటుప్పల్‌ నుంచి భువనగిరి, గజ్వేల్‌ మీదుగా కంది వరకు విస్తరించనున్న ఉత్తర భాగానికి ఇప్పటికే కేంద్రం అనుమతిచ్చింది. తాజాగా బడ్జెట్‌లో భూ సేకరణకు నిధులు కేటాయించడంతో తొలుత ఈ మార్గంలో భూ సేకరణ చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దక్షిణ మార్గంలో అలైన్‌మెంట్‌ ఖరారు కావడానికి కొంత సమయం పట్టనుండటంతో భూ సేకరణ కొంత ఆలస్యం కానుంది. ఇప్పటికే ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంతో జిల్లా రూపు రేఖలు మారిపోయాయి. త్వరలో ఏర్పాటు కానున్న ఆర్‌ఆర్‌ఆర్‌తో జిల్లా మరింత 
అభివృద్ధి దిశగా పయనించే వీలుంది.  

మూసీకి మహర్దశ: రూ.200 కోట్ల కేటాయింపులు 
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని గ్రేటర్‌ భాగ్యరేఖ.. చారిత్రక మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ పనులకు తాజా బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో మూసీ ప్రవహిస్తున్న బాపూఘాట్‌ నుంచి ప్రతాప సింగారం (45 కి.మీ) మార్గంలో నదికి సమాంతరంగా ఇరువైపులా తీరైన రహదారుల ఏర్పాటు, పాదచారుల దారులు, సుందర ఉద్యానాల ఏర్పాటు, ప్రక్షాళన, సుందరీకరణ పనులు ఊపందుకోనున్నాయి. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో సబర్మతి, గంగా నది తరహాలో మూసీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు కాలుష్య కోరల నుంచి విముక్తి లభించనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. నగర వాసులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచడంతో పాటు గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు.  

ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఊతం 
ఒకవైపు వాహన విస్ఫోటనం. మరోవైపు కాలుష్యం చిమ్ముతున్న కాలం చెల్లిన వాహనాలు. నగరజీవిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు సముచితమైన  ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నట్లు తాజా బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలు ఈ రంగానికి  ఊతమిచ్చాయి. ఎలక్ట్రిక్‌ రవాణా, వ్యక్తిగత వాహనాల తయారీకి సబ్సిడీ ఇవ్వడంతో పాటు వాహన కొనుగోలుదారులకు  జీవితకాల పన్ను నుంచి మినహాయింపు లభించనుంది. దీంతో నగరంలో ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు గ్రేటర్‌ పరిధిలో కేవలం 5,700 ఎలక్ట్రిక్‌ వాహనాలు మాత్రమే నమోదయ్యాయి. సుమారు 3 వేల ద్విచక్ర వాహనాలు కాగా.. మిగతావి  బస్సులు, ఇతర కేటగిరీలకు చెందిన రవాణా వాహనాలు ఉన్నాయి.

మరోవైపు నగరంలో రోజురోజుకూ వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వివిధ కేటగిరీలకు చెందిన వాహనాలన్నీ సుమారు 60 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో 15 లక్షలకుపైగా కాలం చెల్లినవే. వ్యక్తిగత వాహనాలతో పాటు 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలు కూడా యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఆటో రిక్షాలు, ఇతర వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో వాహన కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర కేటగిరీల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తే పర్యావరణానికి కొంత మేరకు రక్షణ లభించనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement