Telangana Budget: మాది సంకల్ప బలం | Congress govt first full budget was introduced by the Deputy CM | Sakshi
Sakshi News home page

Telangana Budget: మాది సంకల్ప బలం

Published Fri, Jul 26 2024 5:38 AM | Last Updated on Fri, Jul 26 2024 5:38 AM

Congress govt first full budget was introduced by the Deputy CM

ఆరంభంలోనే కొన్ని చేసి చూపాం.. త్వరలో మిగతావీ చేసి చూపిస్తాం 

చిత్తశుద్ధి, సమర్థత, నిజాయతీ పునాదులుగా ముందుకు..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరింది 

గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దుతూ ముందుకు సాగుతున్నామని వెల్లడి 

కాంగ్రెస్‌ సర్కారు తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం

రూ.2,91,159 కోట్లతో బడ్జెట్‌

గంటా 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగం

గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, వైఫల్యాలను గుర్తించిన ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుని కాంగ్రెస్‌ పార్టీకి అధికారం అప్పగించారు. మేం ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలనే ఉద్దేశంతో హామీలివ్వలేదు. ప్రజల గుండె చప్పుళ్లకు స్పందించి హామీలను ప్రజల ముందుంచాం. అవి అలవికానివంటూ ప్రతిపక్షాలు పదేపదే విమర్శిస్తున్నాయి. కానీ సంకల్పబలం, చిత్తశుద్ధి, సమర్థత, నిజాయతీలే పునాదులుగా నిర్మితమైన మా ప్రభుత్వానికి అలవికాని హామీలంటూ లేవని తొలి అడుగుతోనే నిరూపించాం.
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తామిచ్చిన హామీలను అమలు చేసి చూపాలన్న పట్టుదలతో ఉన్నామని.. ఆ దిశగానే రాష్ట్ర బడ్జెట్‌కు రూపకల్పన చేశామని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మాట ఇస్తే శిలాశాసనమని రుణమాఫీ అమలుతో మరొక్కసారి రుజువైందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, అర్హులకు రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్, నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్ల పథకం, అర్హులకు ఉచితంగా నెలకు 200 యూనిట్ల విద్యుత్‌ సరఫరా వంటి హామీలను ప్రభుత్వం ఏర్పడిన కొన్నిరోజుల్లోనే అమల్లోకి తెచ్చామని చెప్పారు. 

త్వరలోనే మిగతావీ చేసి చూపిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను భట్టి విక్రమార్క గురువారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,91,159 కోట్ల అంచనాతో ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ, గత ప్రభుత్వ తీరును విమర్శిస్తూ, శాఖల వారీగా బడ్జెట్‌ కేటాయింపులను వివరిస్తూ సుదీర్ఘంగా గంటా 45 నిమిషాల పాటు ప్రసంగించారు. భట్టి బడ్జెట్‌ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ మహాకవి దాశరథి వరి్ణంచిన తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన సోనియాగాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్‌ ప్రభుత్వ తొలి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నందుకు సంతోషిస్తున్నాను. పదేళ్ల అస్తవ్యస్త పాలనకు విజ్ఞతతో చరమగీతం పాడిన తెలంగాణ ప్రజానీకానికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. 

వామనావతారంలా పెరిగిన అప్పులు.. 
తెలంగాణ ఏర్పాటైన తర్వాత దశాబ్దకాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని వట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు.. అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయ్యారు. ప్రజల సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి అడుగంటింది, రాష్ట్రం అప్పుల పాలైంది. రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న రూ.75,577 కోట్ల అప్పు.. 2023 డిసెంబర్‌ నాటికి వామనావతారంలా పెరిగి పెరిగి రూ.6,71,757 కోట్లకు చేరింది. సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. నీళ్లను ఏ కాలువల ద్వారా పారించాలన్న ధ్యేయంతో కాకుండా.. అవినీతి సొమ్మును ఏ కాలువల ద్వారా ప్రవహింపచేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసింది. 

ఓ వైపు అప్పులు, మరోవైపు పేరుకుపోయిన బిల్లులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుంది. ఇప్పుడు మా ప్రభుత్వం తగిన దిద్దుబాటు చర్యలను చేపట్టడంతోపాటు మరింత మేలైన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనే కృత నిశ్చయంతో ఉంది. తలకు మించిన రుణభారం ఉన్నప్పటికీ దుబారా ఖర్చులు కట్టడి చేసి, ఆర్థిక క్రమశిక్షణతో పాలన ప్రారంభించాం. ఈ సంవత్సరం మార్చి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు క్రమం తప్పకుండా ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలు/పెన్షన్లు చెల్లించేలా చర్యలు తీసుకున్నాం. 

బడ్జెట్‌ సమగ్ర స్వరూపం (రూ.కోట్లలో) 


అప్పులు తీరుస్తూ.. సంక్షేమం పాటిస్తూ.. 
రాష్ట్రానికి డిసెంబర్‌ నాటికి రూ.6,71,757 కోట్లు అప్పులు ఉన్నట్టు తేలింది. మా ప్రభుత్వం వచ్చాక రూ.35,118 కోట్ల రుణాలు తీసుకోగా.. గత ప్రభుత్వం తాలూకు రూ.42,892 కోట్ల రుణాలు, వడ్డీలు చెల్లించాం. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. ఇదే సమయంలో సంక్షేమాన్ని విస్మరించలేదు. డిసెంబర్‌ నుంచి ఇప్పటివరకు రూ.34,579 కోట్లను వివిధ పథకాలపై ఖర్చు చేశాం. మూలధన వ్యయానికి అదనంగా రూ.19,456 కోట్లు ఖర్చు చేశాం. 

గత దశాబ్దకాలంలో ఉద్యోగ నియామకాలు సరిగా జరగక నిరుద్యోగ యువత కలలు కల్లలయ్యాయి. అక్రమాలు, పేపర్‌ లీకేజీలు, అసమర్థ పరీక్ష నిర్వహణతో యువతకు ఉద్యోగాలు అందని పరిస్థితి ఏర్పడింది. దాన్ని సరిదిద్ది నియామక ప్రక్రియలో పారదర్శకత తీసుకొచ్చే చర్యలను మా ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామక పత్రాలను అందజేశాం. 

జాతీయ వృద్ధిరేటుకన్నా వెనుకబడ్డాం.. 
2023–24లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2 శాతం వృద్ధి చెందితే.. మన దేశ ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం, తెలంగాణ 7.4 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అంటే గత ఏడాది జాతీయ వృద్ధిరేటు కన్నా తెలంగాణ వృద్ధిరేటు తక్కువ. 2023–24లో తెలంగాణ జీఎస్‌డీపీ ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే రూ.14,63,963 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే 11.9 శాతం వృద్ధి నమోదైంది. జాతీయ స్థాయిలో ఈ వృద్ధి రేటు 9.1 శాతం. 

రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వృద్ధితో పోల్చినప్పుడు ఖర్చుల కోసం రుణాలపై భారీగా ఆధారపడిందన్న విషయం స్పష్టమవుతోంది. ఇటువంటి పరిస్థితి ఆర్థిక సుస్థిరతకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. ఆదాయాన్ని మించి రుణం నిరంతరంగా పెరుగుతూ వచ్చింది. కఠిన ఆర్థిక సంస్కరణలు తీసుకురాని పక్షంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడుతుంది. 

జిల్లాల మధ్య ఆదాయ అంతరాలు.. 
2023–24లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,47,299. జాతీయ తలసరి ఆదాయం రూ.1,83,236తో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,64,063 ఎక్కువ. అదే సమయంలో తలసరి ఆదాయ స్థాయిల్లో జిల్లాల మధ్య తీవ్రమైన అంతరం ఉంది. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ.9,46,862 అయితే.. వికారాబాద్‌ జిల్లా తలసరి ఆదాయం రూ.1,80,241 మాత్రమే. అంటే జిల్లాల మధ్య ఆర్థికాభివృద్ధి సమాన స్థాయిలో లేదని స్పష్టమవుతోంది..’’ అని భట్టి పేర్కొన్నారు. అనంతరం వివిధ శాఖలు, పథకాల వారీగా బడ్జెట్‌ కేటాయింపులను వెల్లడించారు. 

అతి త్వరలో రూ.2లక్షల వరకు రుణమాఫీ  
‘‘గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని రైతులను అప్పుల్లోకి నెట్టిందే తప్ప నిజంగా ఎలాంటి మేలు చేయలేదు. మేం రైతులకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో ఏకకాలంలో రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేయాలని నిర్ణయించి అమలు ప్రారంభించాం. జూలై 18న రూ.లక్ష వరకు రుణమున్న 11.34 లక్షల మంది రైతులకు రూ.6,035 కోట్ల రుణమాఫీ మొత్తాన్ని ఖాతాల్లో ఒకేసారి జమచేశాం. రూ.రెండు లక్షల వరకు రుణం ఉన్న మిగతా రైతులకు కూడా అతిత్వరలో రుణమాఫీ జరుగుతుంది. కాంగ్రెస్‌ మాట ఇస్తే శిలాశాసనమని రుణమాఫీ అమలుతో మరొక్కసారి రుజువైంది.’’

ధరణికి శాశ్వత పరిష్కారం చూపిస్తాం
బడ్జెట్‌ ప్రసంగంలో వివిధ ప్రభుత్వ శాఖలు, పథకాల వారీగా చేసిన నిధుల కేటాయింపులను డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. పలు అంశాలకు సంబంధించిన విధానాలను, చేపట్టబోయే చర్యలనూ తెలిపారు. 
‘రైతు భరోసా’ కింద అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి రూ.15,000 చెల్లించాలన్నది మా సంకల్పం. అందుకే ప్రజలతో చర్చించి ఎలా చేయాలన్న దానిపై కసరత్తు  చేస్తున్నాం. 
⇒ భూమిలేని రైతు కూలీల ఆర్థిక, జీవన స్థితిగతులు మెరుగుపర్చడానికి వారికి ఏటా రూ.12,000 అందించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం. 

⇒ మా ప్రభుత్వం రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంట బీమా పథకాన్ని అమలు చేయడానికి ఈ సంవత్సరం నుంచి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాము. ఈ పథకం క్రింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.  
⇒ సన్నరకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి 33 రకాల వరిని గుర్తించి, వాటికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ చెల్లించాలని నిర్ణయించాం. 
⇒ ధరణి పోర్టల్‌ సమస్యలు, పరిష్కారాల పురోగతిపై ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సమీక్షిస్తున్నాం. ధరణి కమిటీ పూర్తి అధ్యయనం తర్వాత శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటాం. 

⇒ ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నియోజకవర్గంలో కనీసం 3,500 చొప్పున మొత్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నాం. ఇంటి విస్తీర్ణం కనీసం 400 చదరపు అడుగులతో ఉంటుంది. 
⇒ ఒకే ప్రాంతంలో వేర్వేరుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్‌ గురుకుల పాఠశాలలను 20 ఎకరాల స్థలంలో ఒకేచోట నిర్మిస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం.  

మహనీయుల మాటలను ఉటంకిస్తూ..
భట్టి తన బడ్జెట్‌ ప్రసంగంలో పలువురు మహనీయుల మాటలను ఉటంకించారు. ‘‘సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం సఫలం కాజాలదు. ఆ రెండూ కూడా రాజకీయ ప్రజాస్వామ్యానికి పునాది రాళ్లు. పునాది ఎంత బలంగా ఉంటే.. ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుంది’’ అన్న బీఆర్‌ అంబేడ్కర్‌ మాటలను గుర్తు చేశారు. వ్యవసాయానికి కేటాయింపులను వెల్లడిస్తున్న సమయంలో.. ‘‘ఏ పని అయినా ఆగవచ్చు.. కానీ వ్యవసాయం ఆగదు’’ అని జవహర్‌లాల్‌ నెహ్రూ చెప్పారని భట్టి పేర్కొన్నారు. 

ఇక ‘‘ఏదైనా పని జరిగే వరకు అది అసాధ్యంగా గోచరిస్తుంది’’ అని నెల్సన్‌ మండేలా చెప్పారని.. తాము ఇచ్చిన రుణమాఫీ హామీకి ఇది వర్తిస్తుందని భట్టి చెప్పారు. తాము రుణమాఫీ అమలుతో మండేలా మాటలను నిజం చేసి చూపామన్నారు. కాంగ్రెస్‌ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్న సమయంలో ‘‘ప్రజాస్వామ్యం అనేది బలవంతులకు, బలహీనులకు సమాన అవకాశాలు కల్పించేది’’ అని మహాత్మాగాంధీ చెప్పారని గుర్తుచేశారు.

అసెంబ్లీలో షేమ్‌ షేమ్‌.. ఫాల్స్‌ ఫాల్స్‌!
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ ప్రసంగం కొనసాగుతుండగా శాసనసభలో షేమ్‌ షేమ్‌.. ఫాల్స్‌ ఫాల్స్‌.. అన్న నినాదాలు హోరెత్తాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలను భట్టి విక్రమార్క విమర్శిస్తున్నప్పుడు అధికార కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు ‘షేమ్‌.. షేమ్‌..’ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో భట్టి చెప్తున్న మాటలు ‘ఫాల్స్‌.. ఫాల్స్‌..’ అంటూ బీఆర్‌ఎస్‌ సభ్యులు ప్రతిగా నినాదాలు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement