‘తెలంగాణ ఆర్థిక బడ్జెట్ అబద్ధాల పుట్ట’
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ అబద్దాల పుట్ట అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ శాసనసభ సాక్షిగా అబద్దాలు చెప్పించారని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మిగులు బడ్జెట్ అయితే రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రైతులను చిన్నచూపు చూశారని ధ్వజమెత్తారు. 17 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే గానీ సంపూర్ణంగా మాఫీ జరగదని, బడ్జెట్ లో కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని తెలిపారు. ఇలాయితే రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. అన్నదాతలకు సంపూర్ణంగా రుణామాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్ పథకానికి రూ.4300 కోట్లు కేటాయిస‍్తే తప్పా మాఫీ జరగదని, కేవలం రూ. 1900 కోట్లే కేటాయించారని విమర్శించారు. పేదలకు కట్టించే ఇళ్లపై ఒక్క రూపాయి చెల్లించలేదని ఆరోపించారు. మూడేళ్లలో 1400 ఇళ్లు మాత్రమే నిర్మించారని, రెండేళ్లలో రెండున్న లక్షల ఇళ్లు కడతారా అని నిలదీశారు. దళిత కుటుంబాలకు భూమి పంపిణీ చేస్తామన్న హామీని కూడా టీఆర్ఎస్ సర్కారు నిలబెట్టుకోలేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.