
'సీఎం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా బడ్జెట్'
హైదరాబాద్: వాస్తవిక అంచనాలతో కొత్త రూపంలో తెలంగాణ బడ్జెట్ తీసుకువస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సోమవారం తెలంగాణ అసెంబ్లీలో 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ఈటల రాజేందర్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాక్షి మీడియాతో రాజేందర్ ప్రత్యేకంగా మాట్లాడుతూ... తెలంగాణ ధనిక రాష్ట్రం అన్నది మేము కాదని... ఆర్థిక సంఘమే ఆ విషయాన్ని వెల్లడించిందని చెప్పారు.
తమ ప్రభుత్వం దుబారా తగ్గించుకుంటుందన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్తులను పెంచుతామని వెల్లడించారు. సీఎం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా ఈ బడ్జెట్ రూపొందించినట్లు ఈటల పేర్కొన్నారు. భూముల విక్రయం ద్వారా గతేడాది అనుకున్న ఆదాయం రాలేదన్నారు. కానీ, ప్రస్తుతం బూమ్ పెరిగిందని.... ఈసారి మరింత ఆదాయం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయాలను సమీక్షిస్తామన్నారు. తెలంగాణలో వేలాది ఎకరాలు ఆక్రమిత భూములున్నాయని... వాటిని అన్నింటిని వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ఎన్నుల ఎగవేతను తగ్గిస్తాం.. ఆదాయాన్ని భారీగా పెంచుతామన్నారు. తెలంగాణ రాష్ట్రంగా విడిపోయి అభివృద్ధి సాధిస్తామని గతంలో అన్న మాట నిజమైందన్నారు. ఏపీ అభివృద్ధి చెందితే తమకు సంతోషమే అని చెప్పారు. ఉద్యమ సమయంలో వేగంగా ఉన్నా... ప్రస్తుతం ఆలోచనతో పని చేస్తున్నారన్నారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన మాత్రం లేదని ఈటల రాజేందర్ తెలిపారు.