చమురు బంగారు బాతా?
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర శీఘ్రగతిన పతనమవుతోంది. బ్యారెల్ 150 డాలర్ల వరకు ఎగబాకిన చమురు ధర ప్రస్తుతం 30 డాలర్ల దిగువకి దిగజారింది. 20 డాలర్లకు పడిపోయినా ఆశ్చర్యం లేదు. చమురు అవసరాలలో 80 శాతం కోసం దిగుమతులపై ఆధారపడ్డ భారత్‌కు ఇది శుభపరిణామం. కానీ, ముడి చమురు ధర తగ్గిన మేరకు కేంద్రం వినియోగదారునికి ఆర్థిక వెసులుబాటు కల్పించకపోవటం విచారకరం. బ్యారెల్ చమురు ధర 150 డాలర్లున్ననాటికి, 30 డాలర్లుకు పడిపోయిన నేటికి పెట్రోల్, డీజిల్ ధరలలో పెద్దగా తేడా లేదు. కారణం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హేతుబద్ధత లేకుండా డ్యూటీలు, పన్నుల పేరుతో మోపుతున్న ఆర్థిక భారమే. గత 18 నెలలలో ముడి చమురు ధరలలో 23% తగ్గుదల ఉండగా... మన వినియోగదారులకు ధర 4% మాత్రమే తగ్గింది.
ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా పన్నులు వేయాలన్నది ప్రాథమిక పరిపాలనా సూత్రం. కానీ మన పన్నుల వ్యవస్థ ఆది నుంచి అస్తవ్యస్థంగానే ఉంది. ఇక, పెట్రో ఉత్పత్తులు వినియోగదారునికి చేరేలోపు అడుగడుగునా ఎన్నో రకాల డ్యూటీలు, పన్నులు, సెస్‌లు, సర్ చార్జీలు... కొన్ని కేంద్రానివి, మరికొన్ని రాష్ట్రాలవి. 2016 జనవరిలో అంతర్జాతీయ ముడి చమురు ధర బ్యారెల్ (159 లీటర్లు) 30 డాలర్లు అనుకుందాం. మన కరెన్సీలో లీటర్ ముడి పెట్రోలు రూ.12.45 అవుతుంది. పన్నులు, సుంకాలు, ఖర్చులు కలుపుకుంటే చివరకు లీటర్ పెట్రోల్ ధర రూ.59.04 (25% వ్యాట్‌తో) అవుతుంది. కానీ తెలుగు రాష్ట్రాలలో పెట్రో ఉత్పత్తులపై 34% వ్యాట్ విధిస్తున్నారు. దీంతో ధర రూ. 68కి చేరుతుంది. అంటే, ముడిపెట్రోలు ధర, శుద్ధి చేసిన పెట్రోలుగా వినియోగదారునికి చేరేసరికి సుమారు నాలుగున్నర రెట్లు పెరుగుతుంది. అలాగే డీజిల్ ధర కూడా నాలుగు రెట్లు పెరుగుతోంది.
మోదీ ప్రభుత్వం వచ్చాక ఆరుసార్లు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంచింది. కాబట్టే ముడి చమురు ధర తగ్గినా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు ఆ మేరకు తగ్గలేదు. చమురు ధరల పతనం వల్ల దేశానికి సమకూరిన మిగులు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు. ఇక ఎక్సైజ్ సుంకం పెంపు వల్ల గత ఏడాది సుమారు రూ. 80,000 కోట్లు అదనపు ఆదాయం లభించగా, 2016 పెంపు వల్ల మరో రూ. 3,700 కోట్లు సమకూరుతుంది. ఈ ప్రభుత్వ తీరుపై ఎన్ని విమర్శలు చెలరేగినా కేంద్రం లెక్క చేయడం లేదు. వ్యాట్ విధింపులో ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి పొంతన కనపడదు. ఈ పన్నులుగాక ఎక్సైజ్ డ్యూటీ, సెస్, సర్ చార్జి లాంటివి కూడా వడ్డిస్తున్నారు. పైగా అదనపు సెస్ ఎంట్రీ టాక్స్, స్పెషల్ సెస్, స్వచ్ఛభారత్ సెస్ లాంటి పేర్లతో ఇష్టానుసారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వేస్తున్నాయి.
కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ మీద కూడా రాష్ట్రాలు వ్యాట్ విధిస్తాయి! పన్ను మీద పన్ను! సామాన్యుల నడ్డి విరవడానికి వెరవని రాష్ట్ర ప్రభుత్వం సంపన్నులు ప్రయాణించే విమాన ఇంధనంపై నామమాత్రపు వ్యాట్‌ను విధిస్తోంది. రైతుల నుంచి సకల వృత్తుల సామాన్యులు వాడే డీజిల్‌పై వ్యాట్ పెంచుతున్నారు. దీంతో వారి ఇంధన, రవాణా వ్యయాలు పెరిగిపోతున్నాయి. కాకులను కొట్టి గద్దలకు వేయడం అంటే ఇదే. మన దేశంలో డీజిల్ వినియోగం ఎక్కువ. చమురు ధరల పతనానికి అనుగుణంగా డీజిల్ ధరను తగ్గించి ఉంటే ఆహార ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చి సామాన్యుల కొనుగోలు శక్తి పెరిగేది. రైతు పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేది.
దేశంలో 2010లో పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేశారు. అంటే, అంతర్జాతీయ ధరల ఎగుడు దిగుడులకు అనుగుణంగా దేశంలో చమురు ధరలు పెరగడం లేదా తగ్గడం జరగాలి. కానీ దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన తదుపరి 2007 నుంచే చమురు ఉత్పత్తులపై సబ్సిడీలు తగ్గుతూ వచ్చాయి. (2015) 2007-2014 మధ్య ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ రూ. 3.10 లక్షల కోట్లు కాగా, అదే కాలంలో పన్నుల రూపేణా దానికి రూ. 6.21 లక్షల కోట్లు సమకూరింది. అంటే, చమురు రంగ సబ్సిడీలు మిథ్యే.
పైగా వంట గ్యాస్‌పై సబ్సిడీలను కూడా వీలైనంత మేరకు తగ్గించేలా మోదీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. పెట్రో ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవటం ఆచరణ రీత్యా నిజం కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే వాటి ధరలను నియంత్రిస్తున్నాయి. కాబట్టే చమురు ధరల పతనం ప్రయోజనాలు ప్రజలకు అందకుండా పోగా, పన్నుల భారం పెరుగుతోంది. పెట్రోలియం ఉత్పత్తులను అవి బంగారు గుడ్లు పెట్టే బాతుగా పరిగణిస్తున్నాయి.
రెండేళ్ళ క్రితం ముడి చమురు ధరలు గరిష్టంగా పెరగగా ప్రతిపక్షాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను తగ్గించి, ప్రజలను ఆదుకోవాలని ఆందోళన సాగించాయి. అవే రాజకీయ పార్టీలు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికార పీఠం ఎక్కి గతంలో కంటే భారీగా పన్నులను పెంచాయి. చమురు ధరల పతనం లబ్ధి ప్రజలకు అందకుండా చేస్తున్నాయి. అసలుకంటే వడ్డీ భారం అన్నట్లు పెట్రోల్, డీజిల్ వినియోగంలో చమురు ధరలకంటే పన్నుల భారం అధికంగా మారింది.
పెట్రో ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులను హేతుబద్ధీకరించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆర్థిక, సామాజిక స్థితిగతులను, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చటం లక్ష్యంగానే పన్నుల విధింపు ఉండాలని కౌటిల్యుని నుంచి ఆడంస్మిత్ వరకు ఎందరో ఆర్థిక శాస్త్రవేత్తలు ఉద్ఘోషించారు. కానీ మనదేశంలో అందుకు విరుద్ధంగా... సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు దిగజారుస్తూ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను అల్లకల్లోలం చేస్తూ హేతు విరుద్ధమైన పన్నుల విధానాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.
-డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రివర్యులు
సెల్ : 99890 24579