బషీర్‌బాగ్ చౌరస్తాలో వామపక్ష పార్టీల నాయకుల నిరసన
గన్‌ఫౌండ్రీ: కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలపై కనికరం లేకుండా మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతోందని వామపక్ష పార్టీల నేతలు విమర్శించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం సీపీఐ, సీపీఐ(ఎం), ఎస్‌యూసీఐ (సీ) తదితర వామపక్ష పార్టీల నాయకులు బషీర్‌బాగ్ చౌరస్తాలోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం మోసాల ప్రభుత్వమని, కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. కేరళ ప్రభుత్వం 12 శాతం పన్ను తగ్గించి ప్రజలపై భారం పడకుండా చేసిందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సైతం నాడు పన్నులను తగ్గించారని తెలిపారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎస్‌యూసీఐ (సీ) పార్టీ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ మురహరి మాట్లాడుతూ.. 70 శాతం వరకు పన్నులను పెంచే అధికారం మోదీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని, కోవిడ్ సంక్షోభంలోనూ ప్రధాని కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ సామాన్య ప్రజల పొట్టగొడుతున్నారని ధ్వజమెత్తారు. వామపక్ష, విప్లవకారులపై మోదీ ప్రభుత్వం నిర్భంద చట్టాలను ప్రయోగిస్తోందని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, నగర కార్యదర్శి ఈటీ నర్సింహ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రమ, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్యనాయగ్, ఐఎస్‌ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు స్టాలిన్, ఎస్‌యూసీఐ (సీ) పార్టీతో పాటు పలు వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment