basheerbagh
-
Petrol Diesel: ధరలపై వామపక్షాలు భగ్గు
గన్‌ఫౌండ్రీ: కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలపై కనికరం లేకుండా మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతోందని వామపక్ష పార్టీల నేతలు విమర్శించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం సీపీఐ, సీపీఐ(ఎం), ఎస్‌యూసీఐ (సీ) తదితర వామపక్ష పార్టీల నాయకులు బషీర్‌బాగ్ చౌరస్తాలోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం మోసాల ప్రభుత్వమని, కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. కేరళ ప్రభుత్వం 12 శాతం పన్ను తగ్గించి ప్రజలపై భారం పడకుండా చేసిందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సైతం నాడు పన్నులను తగ్గించారని తెలిపారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎస్‌యూసీఐ (సీ) పార్టీ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ మురహరి మాట్లాడుతూ.. 70 శాతం వరకు పన్నులను పెంచే అధికారం మోదీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని, కోవిడ్ సంక్షోభంలోనూ ప్రధాని కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ సామాన్య ప్రజల పొట్టగొడుతున్నారని ధ్వజమెత్తారు. వామపక్ష, విప్లవకారులపై మోదీ ప్రభుత్వం నిర్భంద చట్టాలను ప్రయోగిస్తోందని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, నగర కార్యదర్శి ఈటీ నర్సింహ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రమ, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్యనాయగ్, ఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు స్టాలిన్, ఎస్‌యూసీఐ (సీ) పార్టీతో పాటు పలు వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
విద్యుత్ చట్ట సవరణలు వెంటనే ఉపసంహరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా, రాష్ట్రాల హక్కులను హరించే విధంగా తీసుకువస్తున్న విద్యుత్ చట్ట సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని వివిధ వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ప్రజలకు నష్టం చేసే ఈ సవరణలను వెనక్కు తీసుకోకపోతే గతంలో విద్యుత్ ఉద్యమ షాక్ తగిలి ఏపీ ప్రభుత్వం కూలిపోయిన మాదిరిగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా షాక్ తగులుతుందని హెచ్చరించారు. కేంద్రం విద్యుత్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోకపోతే విద్యుత్ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో మరో ఉద్యమాన్ని చేపడతామని ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని షహీద్‌చౌక్ వద్ద విద్యుత్ ఉద్యమ అమరులు బాలాస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్‌లకు వామపక్షాల నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అమరవీరుల 21వ సంస్మరణ సభలో కేంద్ర విద్యుత్ చట్టాల సవరణకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. గతంలో జరిగిన ‘బషీర్‌బాగ్ విద్యుత్ ఉద్యమం’మహత్తరమైన ఉద్యమమని, ఆ ఉద్యమం కారణంగానే ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలను పెంచే సాహసం చేయలేదని, పైగా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ తదితర సదుపాయాలను కల్పించాయని వక్తలు పేర్కొ న్నారు. ఒకే దేశం–ఒకే పన్ను తదితర నినాదాలతో బీజేపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా చట్టాలను సవరిస్తూ రాష్ట్రాల హక్కులను హరిస్తోందని, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ముందుకు రావాలని సీపీఐ నేతలు కె.నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి కోరారు. నాడు ప్రపంచ బ్యాంకు విధానాల్లో భాగంగానే టీడీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలను అమలు చేసిందని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అంతకంటే ఉధృతంగా ప్రపంచ బ్యాంకు, పెట్టుబడిదారీ విధానాలను అమలు చేస్తోందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కార్యక్రమంలో అజీజ్‌పాషా, పశ్య పద్మ (సీపీఐ), జి.నాగయ్య, డీజీ నరసింహారావు, బి.వెంకట్, టి.సాగర్ (సీపీఎం), ఎం.సుధాకర్ (ఎంసీపీఐ–యూ), కె. మురహరి (ఎస్‌యూసీఐ–సీ), అచ్యుత రామారావు, ఎస్.ఎల్.పద్మ (న్యూడెమోక్రసీ) తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గో రక్షా పేరిట గోవులను రక్షిస్తుంటే పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారంటూ బషీర్ బాగ్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు నిరాహారదీక్ష చేస్తానని రాజా సింగ్ ప్రకటించారు. దీంతో సోమవారం సాయంత్రం ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మొహరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం బషీర్‌బాగ్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ బయలుదేరడానికి వెళుతుండగా పోలీసులు రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గోవులను రక్షించి గోశాలకు తరలిస్తుంటే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. గోరక్ష కార్యకర్తలపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. బక్రీద్ కోసం ఓల్డ్ సిటీకి తరలించిన గోవులను, గోవు దూడలను వెంటనే గోశాలకు తరలించాలన్నారు. గోవులను వదించడానికి పిలిపించిన కసాయిలను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తన డిమాండ్లు నెరవేర్చే వరకు నిరాహారదీక్ష కొనసాగిస్తానని తెలిపారు. కాగా, నిరసన దీక్షకు అనుమతి లేదని పోలీసులు రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
రైతులతో కలసి ఆందోళనకు దిగిన అవినాశ్ రెడ్డి
-
రైతులతో కలసి ఆందోళనకు దిగిన అవినాశ్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ బకాయిల చెల్లింపులో జాప్యంపై వైఎస్సార్ కాంగ్సెస్ పార్టీ మాజీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బషీర్‌బాగ్‌లోని అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ ఆఫీస్ వద్ద రైతులతో కలసి ఆందోళన చేపట్టారు. రైతులకు పంట నష్టానికి సంబంధించిన ఇన్సూరెన్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలని కోరుతూ అక్కడే బైఠాయిచి నిరసన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లుగా పంట నష్ట పోయిన రైతులకు చెల్లించకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కడప జిల్లాలోని 60 వేల మంది రైతులకు 200 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ బకాయిలు అందాల్సి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీలు రైతులు విషయంలో మొండిగా వ్యవహారిస్తున్నాయని విమర్శించారు. పరిస్థితి ఇలాగే ఉంటే రైతుల కోసం ఎంతటి పోరాటానికైనా వైఎస్సార్ సీపీ సిద్ధమని తెలిపారు. -
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బషీర్‌బాగ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం బషీర్‌బాగ్‌లోని ఐడీబీఐ బ్యాంక్ ఉన్న ఐదు అంతస్థుల మహవీర్ హౌస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మహవీర్ హౌస్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్ని మాపక సిబ్బంది సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకుని, ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ప్రమాద కారణంగా బషీర్‌బాగ్‌లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు హైదర్‌గూడ నుంచి కింగ్ కోటి మీదుగా వాహనాలను తరలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. నగరంలో భారీ ట్రాఫిక్: గురువారం సాయంత్రం భాగ్యనగరంలో గాలివాన అల్లకల్లోలం సృష్టించింది. నగరమంతా వర్ష భీభత్సానికి తడిసిముద్దయ్యింది. అంబర్‌పేటలో 4.8 సెంటీ మీటర్లు, హిమయత్ నగర్లో 4.2 సెంటీ మీటర్లు, నాంపల్లి, ఖైరతాబాద్‌లో 4.1 సెంటీ మీటర్లు, మల్కాజ్గిరి, గోల్కొండలో 3.5 సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదు అయ్యింది. దీంతో ఓ పక్క వర్షపు నీరు నిలబడటం, మరో పక్క మెట్రోరైలు పనుల కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ భారీగా స్తంభించింది. -
మహవీర్ హౌస్‌లో అగ్ని ప్రమాదం
-
కోటికి పైగా దోచి.. ఆరున్నర గంటల్లో చిక్కి!
సాక్షి, హైదరాబాద్: బషీర్‌బాగ్‌లోని స్కైలైన్ అపార్ట్మెంట్లో చోటు చేసుకున్న రూ. 1.26 కోట్ల బందిపోటు దొంగతనం కేసును నారాయణగూడ పోలీసులు ఆరున్నర గంటల్లోనే ఛేదించారు. సూత్రధారిగా ఉన్న అక్కడి సర్వీస్ అపార్ట్మెంట్ వంటమనిషితో సహా ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేసి, మొత్తం నగదు స్వాధీనం చేసుకున్నట్లు సిటీ ఇన్చార్జ్ కొత్వాల్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం మధ్య మండల డీసీపీ జోయల్ డెవిస్, అదనపు డీసీపీ సుధాకర్, అబిడ్స్ ఏసీపీ బిక్షంరెడ్డితో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘జీరో దందా’కోసం వచ్చి.. బిల్లులు లేకుండా (జీరో దందా) సిటీలో బంగారం ఖరీదు చేయాలని మైసూర్‌కు చెందిన రాజేంద్ర బ్యాటరీ వర్క్స్ (గోల్డ్ అండ్ సిల్వర్ వర్క్స్) యజమాని రాజేంద్ర హనుమంతు నాగ్రే భావించారు. దీనికోసం తన వద్ద పని చేసే స్వప్నిల్ మధుకర్ ఆమ్నే, సంకిత్, సంగప్పలకు రూ. 1.26 కోట్లు ఇచ్చి కారులో శనివారం ఉదయం సిటీకి పంపారు. వీరు బషీర్‌బాగ్‌లోని స్కైలైన్ సర్వీస్ అపార్ట్మెంట్లో దిగారు. సిటీలో బంగారం ఖరీదు చేయడంపై స్పష్టత రాకపోవడంతో వారిని శనివారం రాత్రి తిరిగి వచ్చేయాల్సిందిగా రాజేంద్ర సూచించారు. దీంతో ఈ ముగ్గురూ రాత్రి 9 గంటలకు నగదు బ్యాగులతో బయలుదేరడానికి సిద్ధమయ్యారు. నగదు విషయం పసిగట్టిన వంట మనిషి ఈ ముగ్గురి వద్ద భారీ మొత్తం ఉన్నట్లు గుర్తించిన సర్వీస్ అపార్ట్మెంట్ వంట మనిషి నానల్ కుమావత్ విషయాన్ని అక్కడి సమీపంలో కిరాణా దుకాణం నిర్వహించే పింజర్ల శ్రీహరి యాదవ్‌కు చెప్పాడు. దీంతో ఆ నగదు దోచుకోవాలని పథకం వేసిన శ్రీహరి.. క్రెడిట్ కార్డ్స్ ఎగ్జిక్యూటివ్ పింజర్ల కునాల్ యాదవ్, జ్యూస్ సెంటర్ నిర్వాహకుడు జె.పరమేశ్, నిరుద్యోగి పింజర్ల కుషాల్ యాదవ్‌తో కలసి రంగంలోకి దిగాడు. పథకం ప్రకారం వాటర్ బబూల్స్తో సర్వీస్ అపార్ట్మెంట్ ఉన్న అంతస్తులోకి వెళ్లిన శ్రీహరి, కునాల్ నగదు బ్యాగ్‌తో కిందికి వస్తున్న స్వప్నిల్ తదితరుల్ని అడ్డగించారు. వారిని సెల్లార్లోకి తీసుకెళ్లి, నగదున్న బ్యాగ్‌ను లాక్కున్నారు. అనంతరం పరమేశ్, కుషాల్ సిద్ధం చేసి ఉంచిన ద్విచక్ర వాహనంపై ఉడాయించారు. దీనిపై బాధితులు ఆలస్యంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన నారాయణగూడ ఇన్స్పెక్టర్ బి.రవీందర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జి.రాంబాబు విచారణ ప్రారంభించారు. అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో సమీపంలో ఉండే అర్షద్ అనే వ్యక్తి ఏర్పాటు చేసుకున్న కెమెరాలను పరిశీలించగా నిందితుల విషయం బయటపడింది. సరైన ప్రణాళిక లేని కారణంగా... డబ్బు దోచేయాలని నిందితులు అప్పటికప్పుడు నిర్ణయించుకున్నారు. దీంతో సరైన ప్రణాళిక లేని కారణంగా ఘటనాస్థలి నుంచి పారిపోయిన నిందితులు మూడు చోట్ల నగదు మార్చడంతో పాటు తాము ధరించిన వస్త్రాలనూ మార్చుకున్నారు. నగదు దోచుకోవడానికి వాటర్ బబూల్తో వచ్చిన ఇద్దరు నిందితులు దాన్ని తమ వెంటే తీసుకువెళ్లారు. బబూల్ను విక్రయిస్తున్న వారి వివరాలు సేకరించే క్రమంలో పోలీసులకు శ్రీహరి కిరాణా దుకాణం, దాని యజమాని అదృశ్యమైన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆదివారం రాత్రి 10.30కు నిందితులను అరెస్టు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఇంత మొత్తం నగదు కలిగి ఉండకూడదని, ఈ నేపథ్యంలో విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు తెలుపుతామని శ్రీనివాసరావు తెలిపారు. -
బషీర్‌బాగ్ దోపిడీ కేసులో పురోగతి
-
బషీర్‌బాగ్ దోపిడీ కేసులో పురోగతి
హైదరాబాద్: బషీర్‌బాగ్ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దోపిడీ కేసును నారాయణగూడ పోలీసులు ఛేదించారు. బంగారం కొనుగోలుకు వచ్చి, స్కై లైన్ అపార్టుమెంట్ నుంచి బయటకు వస్తున్నవారిని ముగ్గురు దుండగులు కలిసి దోపిడీ చేశారు. అపార్టుమెంట్లో ఉన్న సెక్యూరిటీ గార్డు సహాయంతో నిందితులు దోపిడీకి పాల్పడ్డారు. వాటర్ క్యాన్ వేయడానికి వెళ్లి డబ్బు చూసి దోపిడీ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అపార్టుమెంట్లో వంట మనిషిగా పనిచేసే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక నాయకుడు శ్రీహరి మరో ఇద్దరితో (ఒకరు స్కైలైన్ ఎదురుగా ఉన్న బేకరీ యజమాని, టీడీపీ నాయకుడు రాజు కుమారుడితో) కలిసి దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. -
బషీర్‌బాగ్ నెత్తుటి గాయానికి 16 ఏళ్లు
-
పాతనోట్ల ముఠా అరెస్టు
హైదరాబాద్: నగరంలో పాతనోట్ల మార్పిడి ముఠాలు పట్టుపడుతూనే ఉన్నాయి. తాజాగా మరో ముఠాను టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. బషీర్‌బాగ్‌లోని మొగల్కోర్టు బిల్డింగ్‌లో పాతనోట్లు మార్చడానికి ప్రయత్నిస్తున్న 10మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తరచుగా నగరంలో పాతనోట్లను మార్చుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 8కోట్లు విలువ చేసే పాతనోట్లను స్వాధీనం చేసుకున్నారు. -
బషీర్‌బాగ్ అమరవీరులకు నివాళి
కర్నూలు సిటీ: బషీర్ బాగ్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. సీపీఎం జిలా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నగర అద్యక్షులు గౌస్ దేశాయ్ అమరవీరుల చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరంలో అప్పటి సీఎం చంద్రబాబు అనుసరించిన విధానాల వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. సీఎం విధానాలపై పోరాటాలు చేయడమే అమరులకు నిజమైన నివాళి అని అన్నారు. ప్రజా వ్యతిరేఖ విధానాల వల్ల పదేళ్లు అధికారానికి దూరమైనా చంద్రబాబు తీరులో మార్పు రాలేదని, ఇకపై టీడీపీ శాశ్వతంగా సమాధి కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. సమావేశంలో సీపీఎం నాయకులు రాధాకష్ణ, అంజిబాబు, రాముడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
'ఇప్పుడు రిజెక్ట్ చేయడం ధర్మం కాదు'
హైదరాబాద్: మూడున్నరేళ్లుగా రైతులకు బీమా ఎందుకు ఇవ్వడం లేదని ఇన్సూరెన్స్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. 2012-13 పంటల బీమా కోసం రైతులు బషీర్ బాగ్ లోని ఇన్సూరెన్స్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అన్నదాతల ఆందోళనకు వైఎస్ జగన్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2012 నుంచి రబీ పంటకు బీమా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీమియం చెల్లించినా బీమా మంజూరు చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 85 వేల మంది బీమా కడితే మూడున్నరేళ్ల తర్వాత 29 వేల మందికి మాత్రమే ఇన్సూరెన్స్ ఇచ్చారని తెలిపారు. బీమా కింద మంజూరు చేసిన రూ.135 కోట్లలో రూ.105 కోట్లు మాత్రమే ఇచ్చి మిగిలింది పెండింగ్ లో ఉంచారని వెల్లడించారు. మిగతా 26 వేల మందికి ఎందుకు ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే రెండుమూడు నెలల్లోనే చెప్పాలని, మూడున్నరేళ్ల తర్వాత దరఖాస్తులను తిరస్కరించడం ధర్మం కాదని అన్నారు. రైతులకు అండగా నిలవాలని బీమా సంస్థను కోరారు. బీమా ఇవ్వడమే ఆలస్యంగా ఇస్తున్నారని, ఇప్పుడు అదిలేదు.. ఇదిలేదు అంటూ రైతులను ఇబ్బందులకు గురిచేయడం భావ్యం కాదన్నారు. దీనిపై అసెంబ్లీలోనూ మాట్లాడామని గుర్తు చేశారు. నెల రోజుల్లోగా రైతులకు బీమా ఇవ్వాలని, లేకుంటే మళ్లీ ఆందోళనకు దిగుతామని వైఎస్ జగన్ హెచ్చరించారు. వైఎస్ జగన్ తో పాటు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రైతులకు మద్దతు తెలిపారు. -
బషీర్‌బాగ్ వద్ద భక్తుల సందడి
-
బషీర్‌బాగ్ నెత్తుటి గాయానికి 15 ఏళ్లు
-
బషీర్‌బాగ్ నెత్తుటి గాయానికి 15 ఏళ్లు
సాక్షి, హైదరాబాద్: అది బాబు జమానా.. కరువు కరాళ నృత్యం చేస్తున్న రోజులు.. వర్షాల్లేక భూములు నైచ్చాయి.. పంటల్లేక రైతులు అల్లాడుతున్నారు.. గొడ్డూగోదా కబేళాకు తరలాయి.. ఇంతటి దారుణ పరిస్థితుల్లో కరెంటు చార్జీలు పెంచడమేమిటని ప్రభుత్వాన్ని నిలదీసిన పాపానికి ఉద్యమకారులపై లాఠీలు విరిగాయి.. తూటాలు పేలాయి.. కాల్పుల్లో ముగ్గురు అసువులుబాశారు! 2000లో నాటి సీఎం చంద్రబాబు హయాంలో అసెంబ్లీకి కూతవేటు దూరంలో సాగిన ఈ నెత్తుటి క్రీడకు నేటితో సరిగ్గా 15 ఏళ్లు!! దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్పుల్లో ఉద్యమకారులు విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామి అక్కడికక్కడే మరణించగా.. రామకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ర్యాలీలు, ధర్నాలు, చివరకు ఆమరణ నిరాహారదీక్షలు చేపట్టినా నాటి బాబు సర్కారులో మార్పు రాకపోవడంతో.. 2000 ఆగస్టు 28న వామపక్షాలు, ప్రజాసంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతును ప్రకటించింది. ఆందోళనలో భాగంగా ఉద్యమకారులు అసెంబ్లీ భవన సముదాయం వరకు వెళ్లేందుకు యత్నించారు. అయితే బాబు ఆదేశాలతో పోలీసులు ఒక్కసారిగా కాల్పు లు జరిపారు. ఫలితంగా బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ ప్రాంతం రక్తసిక్తమైంది. ఈ నెత్తుటి గాయానికి గుర్తుగా బషీర్‌బాగ్ చౌరస్తాలో షహీద్చౌక్ను ఏర్పాటు చేశారు. నేడు లెఫ్ట్, కాంగ్రెస్ నివాళి శుక్రవారం ఉదయం 11 గంటలకు పది వామపక్ష పార్టీలు షహీద్ చౌక్ వద్ద విద్యుత్ ఉద్యమ అమర వీరులకు నివాళి అర్పించనున్నాయి. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్, తదితర సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోనున్నాయి. అమరవీరుల స్తూపం వద్ద చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), సాదినేని వెంకటేశ్వరరావు(న్యూడెమోక్రసీ-చంద్రన్న), వేములపల్లి వెంకట రామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), ఎండీ గౌస్ (ఎంసీపీఐ-యూ). జానకిరాములు (ఆర్ఎస్పీ), బండ సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్), మురహరి (ఎస్‌యూసీఐ-సీ), భూతం వీరన్న (సీపీఐ ఎంల్), రాజేశ్ (లిబరేషన్) తదితరులు నివాళులు అర్పించనున్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎల్పీ కార్యాలయం నుంచి షహీద్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అమరవీరులకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర నాయకులు నివాళి అర్పిస్తారు. -
‘బషీర్‌బాగ్’ అమరుల త్యాగాలు వృథా కావు
సుభాష్‌నగర్, న్యూస్‌లైన్ : బషీర్‌బాగ్ విద్యుత్ అమరవీరుల త్యాగాలు వృథా కావని వామపక్షాల నాయకులు పేర్కొన్నారు. బషీర్‌బాగ్ మృతులకు నివాళులర్పిస్తూ బుధవారం సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నగరంలోని కళాభారతి నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. అమరులు విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామి, రామకృష్ణల పేరిట తాత్కాలిక స్థూపం నిర్మించి నివాళులర్పించారు. మర్రి వెంకటస్వామి, తాళ్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచబ్యాంకు విధానాలను అమలు చేస్తూ రైతులతో కన్నీరు పెట్టించిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. నాడు బాబుకు పట్టిన గతే నేడు కాంగ్రెస్ పార్టీకి పడుతుందని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోయిని అశోక్, అడ్డగుంట మల్ల య్య, పైడిపల్లి రాజు, పం జాల శ్రీనివాస్, బోనగిరి మహేందర్, యుగేందర్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు మీ సం లక్ష్మణ్‌యాదవ్, జూ పాక శ్రీనివాస్, రాంప్రసాద్ పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో... బషీర్‌బాగ్ విద్యుత్ పోరాటంలో అమరులకు సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి ముకుందరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతూ కిరణ్‌కుమార్‌రెడ్డి అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. నగర కార్యదర్శి వి.శ్రీనివాస్, ఎడ్ల రమేశ్, పి.మల్లయ్య, రవి, మోహన్‌రెడ్డి, స్వామి, సునిత పాల్గొన్నారు. -
బషీర్‌బాగ్ అమరులకు లెఫ్ట్ నివాళి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల వ్యతిరేక పోరులో అమరులైనవారి 13వ వర్ధంతి సందర్భంగా వామపక్షాల నేతలు బుధవారం బషీర్‌బాగ్‌లోని షహీద్‌చౌక్ వద్ద నివాళులు అర్పించారు. విద్యుత్ ఉద్యమ అమరులు.. బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డిలను స్మరించుకున్నారు. నివాళులర్పించిన వారిలో బీవీ రాఘవులు, వైవీ రావు, తమ్మినేని వీరభద్రం(సీపీఎం), కె.రామకృష్ణ, చాడా వెంకటరెడ్డి, గుండామల్లేష్, అజీజ్ పాషా(సీపీఐ), డీవీ కృష్ణ, గాదె దివాకర్(న్యూడెమోక్రసీ), ఎండీ గౌస్, తాండ్రకుమార్, వర్ల వెంకటరెడ్డి(ఎంసీపీఐ), గుర్రం విజయ్‌కుమార్(సీపీఐఎంఎల్), మురహరి(ఎస్‌యూసీఐ), జానకీరాం(ఆర్ఎస్సీ), దయానంద్(ఫార్వర్డ్‌బ్లాక్), ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ తదితరులున్నారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ గైర్హాజరయ్యారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నుంచి చీలిన చంద్రన్నవర్గం నేతలు గోవర్దన్, ఎస్.వెంకటేశ్వరరావు, సంధ్య తదితరులు విడిగా వచ్చి నివాళులర్పించా రు. కాగా.. తెలంగాణ, సమైక్యాంధ్ర విభేదాలు కమ్యూనిస్టుల ఐక్య పోరాటాలకు ఆటంకం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు స్పష్టంచేశారు. తమ మధ్య విభేదాలు ఈనాటివి కాదని, అనేక విషయాలపై భిన్నాభిప్రాయాలున్నా కలిసే పనిచేస్తున్నామన్నారు. విభజనపై పాలకవర్గాలు నాటకమాడుతున్నాయని విమర్శించారు. వారి వారి వాటాలు ఖరారయ్యే వరకు ఈ పోరు ఇలా నడుస్తూనే ఉంటుందన్నారు. ఓ పక్క సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూనే జేసీ దివాకర్‌రెడ్డి, కేశినేని ట్రావెల్స్ వంటి సంస్థలు బస్సుల్ని తిప్పుకుంటూ సొమ్ము చేసుకుంటున్నాయని విమర్శించారు. -
ప్రెస్ మీట్‌ను అడ్డుకున్న తెలంగాణవాదులు
-
బషీర్‌బాగ్ పోరుకు 13 ఏళ్లు!
వామపక్షాల నివాళి నేడు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ రక్తసిక్తమై నేటికి 13ఏళ్లు. విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా 2000 ఆగస్టు 28వ తేదీన జరిగిన ఉద్యమంపై జరిపిన పోలీసు కాల్పుల్లో ముగ్గురు ఉద్యమకారులు ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తొమ్మిది వామపక్ష పార్టీలు బుధవారం ఉదయం 11 గంటలకు మృతవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తాయి. బీవీ రాఘవులు, కె.నారాయణ, సూర్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా విద్యుత్ చార్జీలు పెంచిన నాటి చంద్రబాబు ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు వామపక్షాల పిలుపు మేరకు ఆనాడు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన 25వేల మంది ఉద్యమకారులు రాజధానికి తరలివచ్చారు. ఉద్యమకారులపై స్త్రీ, పురుష విచక్షణ లేకుండా పోలీసులు లాఠీలు ఝళిపించారు. బాష్పవాయువు, నీటి ఫిరంగులు ప్రయోగించారు. సాయుధులయిన పోలీసులు గుర్రాలతో తొక్కించారు. ఉద్యమకారులపై విచక్షణా రహితంగా జరిపిన పోలీసు కాల్పుల్లో బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్దన్‌రెడ్డి మరణించారు. ఈ అమానవీయ ఘటనపై హక్కుల సంఘాలు దుమ్మెత్తిపోసినా చంద్రబాబు ఏ మాత్రం పశ్చాత్తాపం వ్యక్తంచేయకపోగా విద్యుత్ చార్జీల పెంపు సబబేనని వాదించారు. ఈ ఘటనపై కేసు నమోదయిన 12 తర్వాత 2012లో హైకోర్టు ఈ కేసును హైదరాబాద్ పోలీసు నుంచి సీఐడీకి బదిలీ చేసింది. గత ఏడాది నవంబర్ 7న సీఐడీ విభాగం తిరిగి సీపీఐ, సీపీఎం నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, బీవీ రాఘవులు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిపై కేసులు పెడతామని ప్రకటించింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో వెనకడుగు వేసింది. కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ప్రజా స్పందనపై నారాయణ నిర్వేదం.. ప్రతి ఇంట్లో కరెంటు మంట మండుతున్నా ఎవరికి వారు తిట్టుకుంటూ బిల్లులు కడుతున్నారే తప్ప ఉద్యమంలోకి రావడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ నిర్వేదం వ్యక్తంచేశారు. మీరు ఉద్యమం చేయండి, మీ వెంట మేముంటామని చెప్పడమే తప్ప ప్రజలు ఉద్యమించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదని వాపోయారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన చేశారు. -
సెమీస్‌లో వెస్లీ బాయ్స్
జింఖానా, న్యూస్‌లైన్: చందన్ సహానీ (123), వినీత్ రెడ్డి (126) శతకాలతో రెచ్చిపోవడంతో కోకాకోలా అండర్-16 ఇంటర్ కాలేజ్ టోర్నీలో వెస్లీ బాయ్స్ కాలేజి సెమీఫైనల్‌కు చేరింది. సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజి (బషీర్‌బాగ్) జట్టుతో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్లీ బాయ్స్ 173 పరుగుల భారీ తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్లీ జట్టు మూడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేయగా, అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన సెయింట్ మేరీస్ జట్టు 148 పరుగుల వద్ద ఆలౌటైంది. జట్టులో శంతన్ రెడ్డి (46), అక్షయ్‌కుమార్ (45) చక్కని పోరాట పటిమ కనబరిచారు. మరో మ్యాచ్‌లో ఆల్ సెయింట్స్ హైస్కూల్ జట్టు 59 పరుగుల తేడాతో హెచ్‌పీఎస్ రామంతాపూర్ జట్టుపై విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆల్ సెయింట్స్ 251 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హెచ్‌పీఎస్ రామంతాపూర్ జట్టు 192 పరుగుల వద్ద కుప్పకూలింది. జట్టులో హెచ్‌కే సింహా 40 పరుగులు చేసి ఫరవాలేదనిపించాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు హెచ్‌పీఎస్-బీ: 114 (సచిన్ 31; సోహైల్ 3/24), సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్: 115/3 (సోహైల్ 46); ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్: 149 (నవీన్ 32, అంజయ్య 31), భవాన్స్ ఎస్ఏజేసీ: 150/1 (సాయి కిరణ్ 66, నిఖిల్ 62 నాటౌట్).