బషీర్‌బాగ్ నెత్తుటి గాయానికి 15 ఏళ్లు
సాక్షి, హైదరాబాద్: అది బాబు జమానా.. కరువు కరాళ నృత్యం చేస్తున్న రోజులు.. వర్షాల్లేక భూములు నైచ్చాయి.. పంటల్లేక రైతులు అల్లాడుతున్నారు.. గొడ్డూగోదా కబేళాకు తరలాయి.. ఇంతటి దారుణ పరిస్థితుల్లో కరెంటు చార్జీలు పెంచడమేమిటని ప్రభుత్వాన్ని నిలదీసిన పాపానికి ఉద్యమకారులపై లాఠీలు విరిగాయి.. తూటాలు పేలాయి.. కాల్పుల్లో ముగ్గురు అసువులుబాశారు! 2000లో నాటి సీఎం చంద్రబాబు హయాంలో అసెంబ్లీకి కూతవేటు దూరంలో సాగిన ఈ నెత్తుటి క్రీడకు నేటితో సరిగ్గా 15 ఏళ్లు!!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్పుల్లో ఉద్యమకారులు విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామి అక్కడికక్కడే మరణించగా.. రామకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ర్యాలీలు, ధర్నాలు, చివరకు ఆమరణ నిరాహారదీక్షలు చేపట్టినా నాటి బాబు సర్కారులో మార్పు రాకపోవడంతో.. 2000 ఆగస్టు 28న వామపక్షాలు, ప్రజాసంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి.
దానికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతును ప్రకటించింది. ఆందోళనలో భాగంగా ఉద్యమకారులు అసెంబ్లీ భవన సముదాయం వరకు వెళ్లేందుకు యత్నించారు. అయితే బాబు ఆదేశాలతో పోలీసులు ఒక్కసారిగా కాల్పు లు జరిపారు. ఫలితంగా బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ ప్రాంతం రక్తసిక్తమైంది. ఈ నెత్తుటి గాయానికి గుర్తుగా బషీర్‌బాగ్ చౌరస్తాలో షహీద్‌చౌక్‌ను ఏర్పాటు చేశారు.
నేడు లెఫ్ట్, కాంగ్రెస్ నివాళి
శుక్రవారం ఉదయం 11 గంటలకు పది వామపక్ష పార్టీలు షహీద్ చౌక్ వద్ద విద్యుత్ ఉద్యమ అమర వీరులకు నివాళి అర్పించనున్నాయి. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్, తదితర సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోనున్నాయి. అమరవీరుల స్తూపం వద్ద చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), సాదినేని వెంకటేశ్వరరావు(న్యూడెమోక్రసీ-చంద్రన్న), వేములపల్లి వెంకట రామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), ఎండీ గౌస్ (ఎంసీపీఐ-యూ).
జానకిరాములు (ఆర్‌ఎస్‌పీ), బండ సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్), మురహరి (ఎస్‌యూసీఐ-సీ), భూతం వీరన్న (సీపీఐ ఎంల్), రాజేశ్ (లిబరేషన్) తదితరులు నివాళులు అర్పించనున్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎల్‌పీ కార్యాలయం నుంచి షహీద్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అమరవీరులకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర నాయకులు నివాళి అర్పిస్తారు.