వామపక్షాల నివాళి నేడు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ రక్తసిక్తమై నేటికి 13ఏళ్లు. విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా 2000 ఆగస్టు 28వ తేదీన జరిగిన ఉద్యమంపై జరిపిన పోలీసు కాల్పుల్లో ముగ్గురు ఉద్యమకారులు ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తొమ్మిది వామపక్ష పార్టీలు బుధవారం ఉదయం 11 గంటలకు మృతవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తాయి. బీవీ రాఘవులు, కె.నారాయణ, సూర్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా విద్యుత్ చార్జీలు పెంచిన నాటి చంద్రబాబు ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు వామపక్షాల పిలుపు మేరకు ఆనాడు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన 25వేల మంది ఉద్యమకారులు రాజధానికి తరలివచ్చారు. ఉద్యమకారులపై స్త్రీ, పురుష విచక్షణ లేకుండా పోలీసులు లాఠీలు ఝళిపించారు. బాష్పవాయువు, నీటి ఫిరంగులు ప్రయోగించారు. సాయుధులయిన పోలీసులు గుర్రాలతో తొక్కించారు.
ఉద్యమకారులపై విచక్షణా రహితంగా జరిపిన పోలీసు కాల్పుల్లో బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్దన్‌రెడ్డి మరణించారు. ఈ అమానవీయ ఘటనపై హక్కుల సంఘాలు దుమ్మెత్తిపోసినా చంద్రబాబు ఏ మాత్రం పశ్చాత్తాపం వ్యక్తంచేయకపోగా విద్యుత్ చార్జీల పెంపు సబబేనని వాదించారు. ఈ ఘటనపై కేసు నమోదయిన 12 తర్వాత 2012లో హైకోర్టు ఈ కేసును హైదరాబాద్ పోలీసు నుంచి సీఐడీకి బదిలీ చేసింది. గత ఏడాది నవంబర్ 7న సీఐడీ విభాగం తిరిగి సీపీఐ, సీపీఎం నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, బీవీ రాఘవులు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిపై కేసులు పెడతామని ప్రకటించింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో వెనకడుగు వేసింది. కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
ప్రజా స్పందనపై నారాయణ నిర్వేదం..
ప్రతి ఇంట్లో కరెంటు మంట మండుతున్నా ఎవరికి వారు తిట్టుకుంటూ బిల్లులు కడుతున్నారే తప్ప ఉద్యమంలోకి రావడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ నిర్వేదం వ్యక్తంచేశారు. మీరు ఉద్యమం చేయండి, మీ వెంట మేముంటామని చెప్పడమే తప్ప ప్రజలు ఉద్యమించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదని వాపోయారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన చేశారు.
బషీర్‌బాగ్ పోరుకు 13 ఏళ్లు!
Published Wed, Aug 28 2013 1:13 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM
Advertisement
Advertisement