
సాక్షి, హైదరాబాద్: బషీర్‌బాగ్‌లోని స్కైలైన్ అపార్ట్‌మెంట్‌లో చోటు చేసుకున్న రూ. 1.26 కోట్ల బందిపోటు దొంగతనం కేసును నారాయణగూడ పోలీసులు ఆరున్నర గంటల్లోనే ఛేదించారు. సూత్రధారిగా ఉన్న అక్కడి సర్వీస్ అపార్ట్‌మెంట్ వంటమనిషితో సహా ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేసి, మొత్తం నగదు స్వాధీనం చేసుకున్నట్లు సిటీ ఇన్‌చార్జ్ కొత్వాల్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం మధ్య మండల డీసీపీ జోయల్ డెవిస్, అదనపు డీసీపీ సుధాకర్, అబిడ్స్ ఏసీపీ బిక్షంరెడ్డితో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘జీరో దందా’కోసం వచ్చి..
బిల్లులు లేకుండా (జీరో దందా) సిటీలో బంగారం ఖరీదు చేయాలని మైసూర్‌కు చెందిన రాజేంద్ర బ్యాటరీ వర్క్స్ (గోల్డ్ అండ్ సిల్వర్ వర్క్స్) యజమాని రాజేంద్ర హనుమంతు నాగ్రే భావించారు. దీనికోసం తన వద్ద పని చేసే స్వప్నిల్ మధుకర్ ఆమ్నే, సంకిత్, సంగప్పలకు రూ. 1.26 కోట్లు ఇచ్చి కారులో శనివారం ఉదయం సిటీకి పంపారు. వీరు బషీర్‌బాగ్‌లోని స్కైలైన్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో దిగారు. సిటీలో బంగారం ఖరీదు చేయడంపై స్పష్టత రాకపోవడంతో వారిని శనివారం రాత్రి తిరిగి వచ్చేయాల్సిందిగా రాజేంద్ర సూచించారు. దీంతో ఈ ముగ్గురూ రాత్రి 9 గంటలకు నగదు బ్యాగులతో బయలుదేరడానికి సిద్ధమయ్యారు.
నగదు విషయం పసిగట్టిన వంట మనిషి
ఈ ముగ్గురి వద్ద భారీ మొత్తం ఉన్నట్లు గుర్తించిన సర్వీస్ అపార్ట్‌మెంట్ వంట మనిషి నానల్ కుమావత్ విషయాన్ని అక్కడి సమీపంలో కిరాణా దుకాణం నిర్వహించే పింజర్ల శ్రీహరి యాదవ్‌కు చెప్పాడు. దీంతో ఆ నగదు దోచుకోవాలని పథకం వేసిన శ్రీహరి.. క్రెడిట్ కార్డ్స్ ఎగ్జిక్యూటివ్ పింజర్ల కునాల్ యాదవ్, జ్యూస్ సెంటర్ నిర్వాహకుడు జె.పరమేశ్, నిరుద్యోగి పింజర్ల కుషాల్ యాదవ్‌తో కలసి రంగంలోకి దిగాడు.
పథకం ప్రకారం వాటర్ బబూల్స్‌తో సర్వీస్ అపార్ట్‌మెంట్ ఉన్న అంతస్తులోకి వెళ్లిన శ్రీహరి, కునాల్ నగదు బ్యాగ్‌తో కిందికి వస్తున్న స్వప్నిల్ తదితరుల్ని అడ్డగించారు. వారిని సెల్లార్‌లోకి తీసుకెళ్లి, నగదున్న బ్యాగ్‌ను లాక్కున్నారు. అనంతరం పరమేశ్, కుషాల్ సిద్ధం చేసి ఉంచిన ద్విచక్ర వాహనంపై ఉడాయించారు. దీనిపై బాధితులు ఆలస్యంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ బి.రవీందర్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ జి.రాంబాబు విచారణ ప్రారంభించారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో సమీపంలో ఉండే అర్షద్ అనే వ్యక్తి ఏర్పాటు చేసుకున్న కెమెరాలను పరిశీలించగా నిందితుల విషయం బయటపడింది.
సరైన ప్రణాళిక లేని కారణంగా...
డబ్బు దోచేయాలని నిందితులు అప్పటికప్పుడు నిర్ణయించుకున్నారు. దీంతో సరైన ప్రణాళిక లేని కారణంగా ఘటనాస్థలి నుంచి పారిపోయిన నిందితులు మూడు చోట్ల నగదు మార్చడంతో పాటు తాము ధరించిన వస్త్రాలనూ మార్చుకున్నారు. నగదు దోచుకోవడానికి వాటర్ బబూల్‌తో వచ్చిన ఇద్దరు నిందితులు దాన్ని తమ వెంటే తీసుకువెళ్లారు. బబూల్‌ను విక్రయిస్తున్న వారి వివరాలు సేకరించే క్రమంలో పోలీసులకు శ్రీహరి కిరాణా దుకాణం, దాని యజమాని అదృశ్యమైన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆదివారం రాత్రి 10.30కు నిందితులను అరెస్టు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఇంత మొత్తం నగదు కలిగి ఉండకూడదని, ఈ నేపథ్యంలో విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు తెలుపుతామని శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment