బషీర్‌బాగ్ అమరులకు లెఫ్ట్ నివాళి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల వ్యతిరేక పోరులో అమరులైనవారి 13వ వర్ధంతి సందర్భంగా వామపక్షాల నేతలు బుధవారం బషీర్‌బాగ్‌లోని షహీద్‌చౌక్ వద్ద నివాళులు అర్పించారు. విద్యుత్ ఉద్యమ అమరులు.. బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డిలను స్మరించుకున్నారు. నివాళులర్పించిన వారిలో బీవీ రాఘవులు, వైవీ రావు, తమ్మినేని వీరభద్రం(సీపీఎం), కె.రామకృష్ణ, చాడా వెంకటరెడ్డి, గుండామల్లేష్, అజీజ్ పాషా(సీపీఐ), డీవీ కృష్ణ, గాదె దివాకర్(న్యూడెమోక్రసీ), ఎండీ గౌస్, తాండ్రకుమార్, వర్ల వెంకటరెడ్డి(ఎంసీపీఐ), గుర్రం విజయ్‌కుమార్(సీపీఐఎంఎల్), మురహరి(ఎస్‌యూసీఐ), జానకీరాం(ఆర్‌ఎస్సీ), దయానంద్(ఫార్వర్డ్‌బ్లాక్), ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ తదితరులున్నారు.
ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ గైర్హాజరయ్యారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నుంచి చీలిన చంద్రన్నవర్గం నేతలు గోవర్దన్, ఎస్.వెంకటేశ్వరరావు, సంధ్య తదితరులు విడిగా వచ్చి నివాళులర్పించా రు. కాగా.. తెలంగాణ, సమైక్యాంధ్ర విభేదాలు కమ్యూనిస్టుల ఐక్య పోరాటాలకు ఆటంకం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు స్పష్టంచేశారు. తమ మధ్య విభేదాలు ఈనాటివి కాదని, అనేక విషయాలపై భిన్నాభిప్రాయాలున్నా కలిసే పనిచేస్తున్నామన్నారు. విభజనపై పాలకవర్గాలు నాటకమాడుతున్నాయని విమర్శించారు. వారి వారి వాటాలు ఖరారయ్యే వరకు ఈ పోరు ఇలా నడుస్తూనే ఉంటుందన్నారు. ఓ పక్క సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూనే జేసీ దివాకర్‌రెడ్డి, కేశినేని ట్రావెల్స్ వంటి సంస్థలు బస్సుల్ని తిప్పుకుంటూ సొమ్ము చేసుకుంటున్నాయని విమర్శించారు.