సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం, పలు ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు వామపక్షాలు, ముస్లిం సంఘాల నేతృత్వంలో పలువురు ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. వామపక్షాల నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద పెదసంఖ్యలో మోహరించిన పోలీసులు ఎక్కడిక్కడ నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు ముందస్తుగా చర్యలో భాగంగా చార్మినార్ వద్ద 50 మందిని దక్షిణ మండలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ర్యాలీ లో పాల్గొనేందుకు వచ్చిన సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ ర్యాలీ నేపథ్యంలో నాంపల్లి- మొజంజాహి మార్కెట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్ అయింది.
బీజేపీ కార్యాలయం ముట్టడి
సీఏఏను వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు వామపక్ష విద్యార్థి నేతలు, శ్రేణులు ప్రయత్నించారు. బీజేపీ కార్యాలయం వద్ద చేరుకున్న వామపక్ష శ్రేణులు.. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు.
సెంట్రల్ యూనివర్సిటీలో..
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు గురువారం ధర్నా నిర్వహించారు. మోదీ సర్కార్ సీఏఏను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment