'ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు'
► ‘హోదా’ కోసం తిరుపతిలో వామపక్షాల ఆందోళనలు
► తీవ్ర వ్యతిరేకతల మధ్య అరెస్ట్‌లు
తిరుపతి అర్బన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీలు తిరుపతిలో ఆందోళనలు నిర్వహించాయి. సీపీఐ, సీపీఎం, సీఐటీయూ నాయకులు గురువారం తిరుపతిలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి సన్నద్ధమయ్యారు. ఈ సందర్భంగా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరినాధరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి కుమార్‌రెడ్డిల ఆధ్వర్యంలో ముందుగా ప్రధాన తపాలా కార్యాలయాన్ని, ఆ తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌లను ముట్టడించారు.
తపాలా డివిజన్ కార్యాలయం, విక్రయాల విభాగం, ఉత్తరాల స్క్రుటినీ(బట్వాడా సిబ్బంది) విభాగాల తో పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను బయటకు వెళ్లాలని నినాదాలు చేశారు. కొంతసేపు ఉద్యోగులు ససేమిరా అనడంతో ఆందోళనకారులు కొంత తీవ్రతను ప్రదర్శించారు. దాంతో ఇరువర్గాల మధ్య వాదనలు చోటు చేసుకున్నాయి. తిరుపతి ఈస్ట్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో నిరసనకారులకు, పోలీసులకు వాగ్వాదాలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసులు అందరినీ బలవంతంగా లాక్కెళ్లి మినీ లారీ ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం న్యాయం చేసేంత వరకు కొనసాగిస్తామని పేర్కొన్నారు.