సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి. గడిచిన రెండేళ్లలో ప్రపంచంలోనే ఫ్యూయల్ ధరలు తగ్గిన దేశం ఏదైనా ఉందంటే అది మన దేశమేనని సూచించారు. ఇదంతా ప్రధాని మోదీ ఘనతేనని తెలిపారు.
సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌ల కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. ధరల కట్టడిలో ప్రధాని మోదీ పరిపాలన అద్భుతంగా ఉందన్నారు. దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు రోజుకు మూడు పూటల రేషన్ బియ్యం అందిస్తూనే మోదీ ఇంధన ధరల్ని తగ్గించగలిగారని పునరుద్ఘాటించారు.
మోదీ నిర్ణయం..తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
అంతేకాదు రెండు ఏళ్లే కాలంలో ప్రపంచంలో ఇంధన ధరలు తగ్గిన దేశాల్లో భారత్ తొలిస్థానంలో ఉందని తెలిపారు. గత కొన్నేళ్లుగా డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ కొరత ఏర్పడిన సందర్భం ఒక్కటి కూడా లేదని గుర్తు చేశారు. ప్రధాని మోదీ నవంబర్ 2021, మే 2022 సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. ఆ నిర్ణయం వల్ల పెట్రోల్ ధర 13 రూపాయలు, డీజిల్ ధర రూ.16 రూపాయలకు తగ్గింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్‌ను సైతం తగ్గించాయని అన్నారు.
భారత్‌లో ధరలు స్థిరంగా
వరల్డ్ వైడ్‌గా ధరలు పెరిగిపోతుంటే భారత్‌లో ధరలు నియంత్రణలో ఉన్నాయి. శ్రీలంక ధరలు 60-70 శాతం పెరిగాయి. పాకిస్తాన్‌లో ధరలు అదుపు లేకుండా పెరిగాయి. అమెరికా, పశ్చిమ యూరప్, కెనడాలలో 25 శాతం నుంచి 40 శాతం మధ్య పెరిగాయి. కానీ భారత్‌లో మాత్రం ధరలు తగ్గాయని వెల్లడించారు.
రానున్న రోజుల్లో ఇంధన ధరలు తగ్గుతాయా?
రానున్న రోజుల్లో ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు కేంద్ర మంత్రి లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గుర్తు చేశారు. తాను ఏ ప్రకటన చేసినా అది ఎన్నికల ఉల్లంఘనే అవుతుందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తన ప్రసంగాన్ని ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment